మందమర్రి, ఆగస్టు 2 : భూగర్భ గనుల్లో రక్షణ చర్యలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందని, పని ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసపల్లి శ్రావణ్‌కుమార్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందమర్రిలోని కేకే-5 గని పై గంటపాటు ధర్నా చేశారు. వివిధ కార్మిక సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు జే.రవీందర్ మాట్లాడుతూ గని ప్రమాదంలో కార్మికుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు.
యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణపై చూపడం లేదని ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తి పేరిట యాజమాన్యం, అధికారులు రక్షణ చర్యలను మరచి పోయారన్నారు. గనుల నిబంధనల ప్రకారం రోజుకు మూడు షిఫ్టులు మాత్రమే నిర్వహించాల్సి ఉండగా, ఉత్పత్తి లక్ష్య సాధన అంటూ నిబంధనలకు విరుద్ధంగా ఆరు షిఫ్టులు నిర్వహిస్తున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. యాజమాన్యం విధానాలపై గుర్తింపు సంఘం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కార్మికుల రక్షణకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఐఎన్టీయూసీ ఏరియా నాయకుడు నరేందర్ మాట్లాడుతూ గనుల్లో యాజమాన్యం నిబంధనలకు విరుద్ధ్దంగా విధులను కేటాయిస్తోందని ఆరోపించారు.
నాలుగు ఎస్డీఎల్ యంత్రాలు నడపాల్సి ఉండగా.. కాలం చెల్లిన ఆరు యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఎస్డీఎల్ యంత్రం మొరాయించడం వల్లే దానిని సరిచేసే క్రమంలో సైడ్ఫాల్ జరిగి శ్రావణ్ కుమార్ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓ.రాజశేఖర్, ఎస్.వెంకటస్వామి, రాజేందర్ పాల్గొన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గనిని సందర్శించి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు.