నిర్మల్ చైన్‌గేట్, మే 5 : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సర్వే త్వరితగతిన పూర్తి చేసి అర్హులను గుర్తించాలన్నారు. రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. పలు ప్రాంతాల నుంచి టెలీఫోన్ ద్వారా వచ్చిన అర్జీలను స్వీకరించారు.
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూమిని రక్షించాలని కోరుతూ సోమవారం సోన్ మండలంలోని సిద్దులకుంట గ్రామస్తులు భారీ సం ఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ జలాశయంలో ముంపునకు గురైన గ్రామంలో భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం 23 ఎకరాల మిగులు భూమిని ఉంచిందని తెలిపారు. అయితే కొందరు అక్రమంగా పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 2022లో అప్పటి కలెక్టర్ రద్దు చేసినప్పటికి మళ్లీ సాగు చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందించి పట్టాలను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నకిలీ అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొం దిన వ్యక్తిపై విచారణ జరిపించాలని కోరుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్, యాంటి కరప్షన్, యాంటి క్రైమ్ బ్యూ రో ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యం రఘు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చుంచు శాలిని అనే మహిళ అధికారులను తప్పుదోవ పట్టించి నకిలీ అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె మామడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై తాను సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ జాతీయులను వెంటనే రాష్ట్రం నుంచి పంపించాలని కలెక్టర్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ దేశీయుల వీసాలను రద్దు చేసిందన్నారు. కానీ.. హైదరాబాద్‌లో అనేక మంది పాకిస్థాన్ పౌరులు నివసిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ పౌరులను గుర్తించి పాక్‌కు పంపించాలన్నారు.