నిర్మల్, జూలై 13(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కోట్లాది రూపాయలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని పల్లెలు, పట్టణాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టి వందల సంఖ్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఆధునికీకరించింది. ఇలా జిల్లావ్యాప్తంగా 260 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులతో పనులు పూర్తయిన పాఠశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లులను సైతం చెల్లిస్తూ వచ్చింది. అయితే 2023 చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటికే కొనసాగుతున్న పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు సాంకేతిక అవరోదాలు ఏర్పడ్డాయి.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి రావడంతో నాటి నుంచి నేటి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ బిల్లులు చె ల్లించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ది. అలాగే బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమై పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ కాంగ్రె స్ ప్రభుత్వం నిలిపి వేసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా అనేక శాఖల్లో అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించడం లో కూడా వివక్ష చూపుతుండడం సర్వత్రా విస్మయానికి గురి చేస్తున్నది. జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ పథకం కింద వివిధ పాఠశాలల్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు 18 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 50 మంది కాంట్రాక్టర్లకు రూ.13 కోట్లకు పైగా బిల్లులను చెల్లించాల్సి ఉన్నది. దీంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేశామని, తమకు రావాల్సిన బిల్లులను చెల్లించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించి మాత్రం సంబంధిత కాంట్రాక్టర్లకు వెంట వెంటనే బిల్లులను చెల్లిస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులను మాత్రం పెండింగ్‌లో పెట్టడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. పాలకులు మారినంత మాత్రాన ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లపై వివక్ష చూపడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
దిలావర్పూర్, లోలం పాఠశాలతోపాటు నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో నిర్మల్‌కు చెందిన ఆమెర్ బిన్ హమీద్ అనే కాంట్రాక్టర్ పలు అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. ఈ మూడు పాఠశాలలకు సంబంధించి ఆయనకు దాదాపు కోటి రూపాయల వరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉన్నది. బిల్లుల కోసం 18 నెలలుగా కాంగ్రెస్ పాలకులతోపాటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసి విసిగి వేసారిపోయాడు. పనుల పెట్టుబడి కోసం అప్పులు చేయడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి క్రమంగా ఒత్తిడి అధికమైంది. దీంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమెర్ బిన్ హమీద్ 20 రోజుల క్రితం గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా ఓ యువ కాంట్రాక్టర్‌కు 45 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు.
పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించేలా కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు కాంట్రాక్టర్లు ఆందోళనబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయిన కాంట్రాక్టర్లు ఇకపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు పోరుబాట పట్టనున్నారు. ఈ మేరకు ఇటీవల కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేసిన కాంట్రాక్టర్లు.. వచ్చే నెల 1వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు విధించారు. ఆగస్టు 1వ తేదీలోగా తమ బిల్లులు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా తా ము పనిచేసిన అన్ని పాఠశాలలకు తాళం వేస్తామని ఆ విన తి పత్రంలో పేర్కొన్నారు. అనంతరం జరిగే పరిణామాల కు ప్రభుత్వమే బాధ్యత వ హించాల్సి ఉంటుందని వా రు హెచ్చరించారు.
అయితే ఇప్పటికే ఓ కాం ట్రాక్టర్ తనకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని ప్ర భుత్వ పాఠశాలకు తాళం వేసిన సంగతి తెలిసిందే. ఇటీవ ల ఖానాపూర్ మండలం రాజూరా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ గడ్డం శ్రీనివాస్ బడికి తాళం వేసి తన నిరసన తెలియజేశాడు. గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో రూ.42 లక్షల విలువ గల పనులు చేసిన శ్రీనివాస్.. ఇప్పటి వరకు చేసిన అప్పుకు రూ.9 లక్షల వరకు వడ్డీలు కట్టానని వాపోతున్నాడు.
అప్పులు చేసి పాఠశాలలో అభివృద్ధి పనులు చేస్తే నేటికీ నయా పైసా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వచ్చే ఆగస్టు 1 నుంచి బడులకు తాళం వేస్తామని కాంట్రాక్టర్ల మూకుమ్మడి హెచ్చరికలతో విద్యాశాఖలో ఆందోళన మొదలైంది. బడులకు తాళం వేస్తే తరగతుల నిర్వహణ సాగక, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.