మంచిర్యాల, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు కళకళలాడిన గ్రామ పంచాయతీలు.. ప్రస్తుతం పట్టించుకునే నాథులు లేక అస్తవ్యస్తంగా మారాయి. పాలకవర్గాలు లేక పాలన పడకేయగా, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువై సమస్యల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరగా నిధులివ్వకపోగా, నిర్వహణ భారం మోయలేక పంచాయతీ కార్యదర్శులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.
కేసీఆర్ సర్కారులో ఆదర్శం..ప్రస్తుతం అధ్వానం
పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ సర్కారు ‘పల్లె ప్రగతి’ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టింది. పల్లెలను ప్రగతి పథంలో నడిపించి ఆదర్శంగా తీర్చిదిద్దింది. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, ప్రతి పంచాయతీకి చెత్త సేకరణ ట్రాక్టర్లు, మొక్కలకు నీరు పట్టేందుకు ట్యాంకర్లు సమకూర్చింది. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సెగ్రిగేషన్ షెడ్లు నిర్మించింది. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను అందుబాటులోకి తెచ్చింది.
కానీ, కాంగ్రెస్ గెలిచిన ఏడాదిన్నరలో పల్లెల పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. పట్టించుకునే వారు లేక పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయి. నిధులు లేక పంచాయతీలకు సమకూర్చిన ట్రాక్టర్లు మూలన పడ్డాయి. నడుస్తున్న వాహనాలకు సైతం చాలా వరకు రిపేర్లు ఉన్నాయి. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 82 ట్రాక్టర్లు మూలనపడి నిరుపయోగంగా మారాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆ సంఖ్య వేలల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. నిధులు లేక ట్రాక్టర్ల నిర్వహణ కష్టమవుతుందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు.
ఏడాదిన్నరగా నిధుల్లేవ్..
కేసీఆర్ సర్కారు పల్లెప్రగతి కార్యక్రమాన్ని 2019లో మొదలుపెట్టింది. అంతకుముందు పాతగోడలు, పాడుబడ్డ భవనాలు, అధ్వానపు రోడ్లతో అవస్థల్లో ఉన్న గ్రామాల దశాదిశా ఒక్కసారిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా 15వ ఆర్థిక సంఘం నిధులు ఎన్ని ఇస్తే, దానికి సమానంగా ప్రతి నెలా కేసీఆర్ సర్కారు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చింది. దీంతో గ్రామాలకు నిధుల వరద పారింది. ఒక్కసారిగా పల్లెల రూపురేఖలు మారిపోయింది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పటి నుంచి గ్రామాలకు ఇప్పటి దాకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థికసంఘం నిధులు ఆగిపోయాయి. కేంద్ర నిధులు రాక, రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వక గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గతంలో కేసీఆర్ సర్కారు చేసిన పనులను సైతం కొనసాగించే పరిస్థితి లేకుండా తయారైంది. పాలకవర్గాలు లేని సమయంలో ఆలానా.. పాలనా చూడాల్సిన రాష్ట్ర సర్కారు చేతులు ఎత్తేసింది. దీంతో గ్రామాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, చెత్త సేకరణ ట్రాక్టర్లు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ భారంగా మారింది.
ఈజీఎస్ నుంచి నిధులు వాడుకోండి..
గతంలో గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ర్టాల నుంచి వచ్చే నిధుల్లో 20 శాతం శానిటేషన్‌కు, 5 శాతం గ్రీన్ మేనేజ్మెంట్కు, 2 శాతం నిధులు ఇతర ఖర్చులకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు వీటికి ఎలాంటి ప్రత్యేక నిధులు రావడం లేదు. పారిశుధ్య పనులు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్న సర్కారు.. ఫండ్స్ మాత్రం ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటి, వాటి నిర్వహణకు వచ్చే ఫండ్స్‌తో ట్రాక్టర్లు నడిపించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సర్కారులో రోజూ ట్రాక్టర్లు తీశారని, ఇప్పుడు వారానికి ఒకసారైనా తీయాలని చెబుతున్నారని చెప్పుకొచ్చారు.
ట్రాక్టర్ల మరమ్మతుల భారం తమపైనే వేస్తున్నారంటున్నారు. వచ్చిన జీతం పంచాయతీల్లో పెట్టుబడులు పెట్టడానికే పోతుందంటున్నారు. స్ట్రీట్‌లైట్లు మార్చడానికి సైతం మా జేబుల్లో నుంచే ఖర్చు పెడుతున్నామంటున్నారు. వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎక్కువయ్యాయి. అంతకుముందు గ్రామాల్లో ఉన్న మల్టీ పర్పస్ వర్కర్లను కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉద్యోగులుగా చూపిస్తున్నారు.
కేంద్రం నుంచి వచ్చే జీతాలనే మల్టీ పర్పస్ వర్కర్లకు ఇస్తున్నారు. దీంతో మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సమస్యలకు పంచాయతీలనే బాధ్యులను చేస్తున్నారు. ఎక్కడ పైల్‌లైన్ లీకేజీ జరిగినా, ఎక్కడ బోర్ పనిచేయకపోయినా ఆ పనులు సైతం మాకే చెబుతున్నారంటూ పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. బోర్లు బాగు చేయించడానికి చందాలు సేకరించాల్సిన దుస్థితి నేడు పల్లెలో ఉందంటున్నారు. నిధులు లేకుండా ట్రాక్టర్లు నడపమంటే, డబ్బులు లేకుండా పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు నడపమంటే ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా స్పందించి గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.