మంచిర్యాల, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేశారు. ఒక విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్థిపై రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద పిల్లలకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి విద్యను అందించారు. గురుకులాల్లో చదివిన పిల్లలు అద్భుతాలు సృష్టించే స్థాయికి ఎదిగారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గురుకులాలపై పట్టింపు కరవైంది. ఫలితంగా సంక్షేమ, గురుకుల ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంక్షేమం ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 43 మంది విద్యార్థులు మృత్యువాత పడడం ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఐదు నుంచి ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన రెండేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనడానికి ఎన్నో ఘటనలు సాక్షి భూతాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 2024, అక్టోబర్ 31న రాత్రి పాఠశాలలో భోజనం చేశాక విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 75 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వీరిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దురదృష్టవశాత్తు చౌదరి శైలజ చికిత్స పొందుతూ నవంబర్ 26, 2024లో మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఇది జరిగి వారం రోజులు కూడా తిరగకుండానే.. మంచిర్యాల జిల్లా సాయికుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోనూ ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 12 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురవడం అప్పట్లో కలకలం రేపింది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదివే మడావి గంగోత్రి(14) వాంతులు, విరేచనాలు చేసుకొని 2024, సెప్టెంబర్ 26న మృతి చెందింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చూపించి వైద్యుల సూచనల మేరకు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. గంగోత్రి పాఠశాల బాత్రూమ్లోనే స్పృహతప్పి పడిపోయి చనిపోయిందని.. పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే ఆమె మృతి చెందిందని, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అధికారులు రెగ్యులర్ తనిఖీలు నిర్వహించక పోవడంతోపాటు, గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తుండడంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, పేరెంట్స్ కమిటీలు ఆరోపిస్తున్నాయి. గతంలో ప్రతి నెల రెండో శనివారం పేరెంట్స్ కమిటీలు జరిగేవి. నిత్యం ఇంటరాక్షన్తో పిల్లల సమస్యలు తల్లిదండ్రుల దృష్టికి వస్తే, ఉపాధ్యాయులతో మాట్లాడి పరిష్కరించుకొనే అవకాశం ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే పేరెంట్స్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. కానీ.. గతేడాది కాలంలో చాలా గురుకులాల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్లు జరగడం లేదు. ముఖ్యంగా చెన్నూర్ ప్రాంతంలో ఇలాంటి సమావేశాల జాడ కనిపించడం లేదు. గతంలో మాదిరి మీడియాను అనుమతించడం లేదు. దీంతో గురుకులాల్లో ఏం జరుగుతుందో ఎవ్వరిని తెల్వని దుస్థితి నెలకొన్నది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే లోపాలు గుర్తుకొస్తున్నాయి. నాలుగు రోజులు అధికారులు హడావుడి చేయడం తప్ప.. రెగ్యులర్ పర్యవేక్షణ కనిపించడం లేదు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో ఎలాంటి సమీక్షలు, ఆకస్మిక పరిశీలనలు కానరావడం లేదు. దీంతో గురుకులాలు, ఆశ్రమాల్లో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల్లో పనిచేసే ప్రిన్సిపల్ రాత్రివేళ స్థానికంగా అందుబాటులో ఉండకుండా, క్షేత్రస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తుండడం కూడా ఇబ్బందులకు కారణమని తెలుస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
2024, ఫిబ్రవరి 8వ తేదీన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) మైనార్టీ గురుకులంలో అర్బస్ మృతి చెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అప్పస్ అనే విద్యార్థి దాడి చేయడంతో ఆ విద్యార్థి మృతి చెందాడు. గురుకులంలో విద్యార్థులు గొడవ పడి, కొట్లాట వరకు వెళ్లడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
తాజాగా మార్చి 29, 2026వ తేదీన చెన్నూర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న శ్రీహిందూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. హాస్టల్లో గడ్డి మందు తాగిన సదరు విద్యార్థినికి మూడు రోజులపాటు చెన్నూర్ సర్కారు దవాఖానలో ఫుడ్ పాయిజన్తో వాంతులు చేసుకుందని చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకురాగా. విద్యార్థిని పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో సదరు విద్యార్థిని ప్రాణాలు విడిచింది. చేతులు కాలికా ఆకులు పట్టుకున్నట్లు విద్యార్థిని ప్రాణం పోయాక ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరచిపోక ముందే ఇదే పాఠశాలలకు చెందిన మరో విద్యార్థిని డెటాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
ఏప్రిల్ 24,2025వ తేదీన మంచిర్యాల జిల్లా కాలేజీ రోడ్డులోని తెలంగాణ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో బీకాం సెకండియర్ చదివే విద్యార్థిని జంగంపల్లి లక్ష్మిప్రసన్న(19) కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. భీమిని మండలంలోని జగ్గయ్యపేటకు చెందిన ఈ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న వివరాలు బయటికి రాలేదు. ఈ ఘటన జరగడానికి నెలరోజుల ముందే ఇదే కళాశాలలో బీఎస్సీ సెకండియర్ చదువుతున్న మరో విద్యార్థిని జూన్ 25వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో కళాశాల వసతి గృహం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తృటిలో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఇది మర్చిపోక ముందే నస్పూర్ కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థిని మధులత భోజనం బాగోలేదని స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.