మంచిర్యాల, జూలై 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అడవినే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న గిరి బిడ్డలకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారాడు. దశాబ్దాలుగా భూ యాజమాన్య హక్కు కోసం కొట్లాడుతున్నా.. ఏ నాయకుడు కనికరించ లేదు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పత్రాలు ఇవ్వలేక పోయాయి. పొట్ట కూటి కోసం భూమి దున్నుకుంటే.. అధికారుల వేధింపులు, కేసులు, కొట్లాటలు, ఎన్నో అవమానాలు, పంట చేతికొచ్చే సమయంలో నాశనం చేయడం ఇవన్నీ పరిపాటిగా మారాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందించాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 99,019 మందికి పట్టాలు ఇవ్వగా.. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో 47,130 మందికి, ఆదిలాబాద్లో 34 వేలు, మంచిర్యాలలో 3,821, నిర్మల్లో 14,068 మందికి పట్టాలు ఇచ్చాడు. పోడు పట్టాలు అందుకున్న రైతులందరికీ రూ.49.50 కోట్ల రైతుబంధు సాయాన్ని తమ ఖాతాల్లో జమ చేశారు.
ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలోకి నాగలి దించాలంటే వెనకాడే దుస్థితి. పొట్ట కూటి కోసమని సాగు చేస్తే అధికారుల వేధింపులు.. అక్రమంగా అడవిని సాగు చేస్తున్నారంటూ కేసులు.. కొట్లాటలు. అమాయక గిరిజన రైతుల వీపుపై ఫారెస్టు అధికారుల లాఠీలు విరిగేవి. ఎన్నో అవమానాలు దాటుకొని పంట చేతికొచ్చేలోపు అధికారులు పాడు చేసేవాళ్లు. మరో వైపు పోడు భూములకు పట్టాలివ్వాలనే డిమాండ్ పట్టించుకునే నాథుడే లేక ఆదివాసీ గిరిజన రైతులు అవస్థలు పడేవారు. కానీ.. స్వరాష్ట్రంలో పోడు రైతులకు ఆ దుస్థితి నుంచి విముక్తి కల్పిస్తూ సీఎం కేసీఆర్ పట్టాలిచ్చే మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పట్టాల పంపిణీ మొదలుపెట్టి నెల రోజులు గడవక ముందే అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు పట్టాలు అందాయి. రైతులంతా పట్టాలు అందుకున్న సంబురంలో ఉండగానే బ్యాంక్ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమయ్యాయి. పోడు పట్టాలిచ్చిన సీజన్లోనే డబ్బులు వేస్తామని మాటిచ్చిన సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మరుక్షణమే వానకాలం రైతుబంధు కింద రూ.23.55 కోట్ల చెక్కును కలెక్టర్కు అందజేశారు. ఈ సీజన్ నుంచి పోడు పట్టాదారులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 31,026 రైతుల ఖాతాల్లో 99,019 ఎకరాలకు సంబంధించి రూ.49.50 కోట్లను జమచేయించారు.
ప్రతి ఎకరాకు రైతుబంధు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఎంపిక చేసిన ప్రతి రైతుకు పోడు పట్టాలు ఇచ్చారు. పట్టాలు అందుకున్న కొన్ని రోజులకే ఒక్క గుంట కూడా వదలకుండా ప్రతి ఎకరాకు వానకాలం రైతుబంధు సాయాన్ని అందించారు. జిల్లాలో పోడు సాగులో ఉన్న 99,019 ఎకరాలకు రెండు సీజన్లకు కలిపి యేటా రూ.99.10 కోట్లు రానున్నాయి. పట్టాలిచ్చి, వ్యవసాయం చేయడానికి డబ్బులు ఇస్తున్న ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని రైతులు చెబుతున్నారు. పంట పెట్టుబడికి అప్పు చేయాల్సిన పని లేకుండా రైతుబంధు బ్రహ్మాండం గా ఉపయోగపడుతుందంటున్నారు. కూలీల ఖర్చులు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సర్కార్ ఇచ్చిన పైసలు సరిపోతున్నాయని సంబురపడి పోతున్నారు. పట్టా తీసుకొని ఎవరికీ భయపడకుండా, రైతుబంధు సాయంతో సాగు పనులు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు పొలంబాట పట్టిన గిరిజనులు.. సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కార్ పుణ్యమాని భూముల్లో సాగు సంబురాలు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పోడు భూముల్లో వరినాట్లు వేస్తూ, పత్తి చేనులో కలుపు తీస్తూ రైతులు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగు పనుల్లో నిమగ్నమైన పోడు రైతులను పలకరించి ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
మా దేవుడు
ఇచ్చిన మాట ప్రకారం మేము సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాకు దేవుడిలాంటోడు. పోడు భూములు సాగు చేస్తూ ఎక్కడైతే అవమానా లు, ఇబ్బందులు ఎదుర్కోన్నమో అక్కడ మేము అదే భూమికి పట్టాలను పొంది సాగు చేసుకుంటు న్నాం. నాడు వానలు కురిసిన యంటే మా భూముల్లో నాగళ్లు దింపాలి అంటే భయమయ్యేది. ఫారెస్టోళ్లు వచ్చి ఎక్కడ కేసు చేస్తరో, మా పంట ఎక్కడ నాశనం అయితదో అని భయపడేది. కానీ.. కేసీఆర్ పుణ్యమాని ఆ రంది మొత్తం తొలిగి పోయింది. నా పేరిట 3.35 ఎకరాల భూమి పంట కాగా ఆనందంగా అరక కట్టి పత్తి సాగు చేస్తున్నా. –
అజ్మీరా హరిలాల్,ఎసన్వాయి(కోటపల్లి మండలం)
దమ్మున్న కేసీఆర్
భూమిని నమ్ముకొని బతుకుతున్న మా గిరిజన రైతుల కష్టాలు తీర్చిన దమ్మున్న ఒకే ఒక నాయకుడు కేసీఆర్ సార్. నా చిన్నప్పటి నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నా. యేటా ఫారెస్టోళ్లతో సాగు విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. కేసులు కూడా అయినయ్. ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ.. కేసీఆర్ సార్ ఎవ్వరు చేయని పనిని మా గిరిజన రైతులకు చేసి పెట్టిండు. భూ తల్లిని నమ్ముకొని బతుకుతున్న మా గిరిజనులకు పోడు పట్టాలు చేసి మాకు ఒకదారిని చూపిండు. మా కష్టాలు తెలిసిన సీఎం సార్కు మేం ఎళ్లకాలం రుణపడి ఉంటాం.
– అజ్మీరా చందు నాయక్, ఎసన్వాయి(కోటపల్లి మండలం)
పట్టా చేసిండు.. రైతుబంధు ఇచ్చిండు..
ఏండ్ల తరబడి సాగు చేస్తున్న పోడు భూమికి కేసీఆర్ సార్ పట్టా చేసి ఇచ్చుడుతోపాటు మాకు రైతుబంధు కూడా ఇచ్చిండు. మా పేరిట 38 గుంటల భూమి పట్టా కాగా మాకు రైతుబంధు ద్వారా రూ.4,750 మా అకౌంట్లో వేసిండు. ఇటు పట్టా ఇచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా కేసీఆర్ సార్ పెట్టుబడి సాయం అందించిండు. గతంలో సాగు చేయాలి అంటే అప్పులు చేసి పంటలు వేసేది. కేసీఆర్ సార్ మాలాంటి పేద రైతులకు భూమి పట్టా చేసుడుతోపాటు రైతుబంధు ఇచ్చి మాకు దేవుడు అయిండు.
– ఏలాది లక్ష్మి, ఎసన్వాయి(కోటపల్లి మండలం)
ఇగ ఎవ్వరికీ భయపడేదే ..
సీఏం కేసీఆర్ సార్ పుణ్యమాని మా పేరిట పోడు భూములకు పట్టాలు వచ్చినయ్. ఇన్నాళ్లు ప్రతి ఒక్కరికీ భయపడుతూ పంటలు పండించేటోళ్లం. మా సీఎం కేసీఆర్ సార్ మా భూములకు పట్టాలను ఇచ్చి మమ్మల్ని భూ యజమానులను చేసిండు. అడవి భూములను సాగు చేసుకునే మేము పట్టాలు వస్తాయని కలోల కూడా అనుకోలేదు. కేసీఆర్ సార్ మా కలలను నిజం చేస్తూ కుమ్రం భీం పుట్టిన గడ్డపై నుండే మా భూములకు మమ్మల్ని రాజులను చేసిండు. ఇప్పడు పోడు భూములకు పట్టాలు రావడంతోపాటు రైతుబంధుతోపాటు రైతుబీమా అందనుంది. – పసుల భారతి, ఎసన్వాయి (కోటపల్లి మండలం)
రూ.8,625 అకౌంట్లో పడ్డయ్
తరతరాలుగా వస్తున్న అటవీ భూమిని మా తాత, తండ్రులు సాగు చేసిన్రు. వారసత్వంగా 1.29 ఎకరాల భూమి రావడంతో మేము కూడా పంటలు పండిస్తున్నం. ప్రధానంగా పత్తి సాగు చేస్తం. ఎప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి సతాయించే వారు. ఈ భూమి మీది కాదు అని గొడవ చేసిన సందర్భాలు అనేకం. గతంలో అధికారులకు పట్టాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇచ్చినం. కానీ.. పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించిండు. సంతోషమనిపించింది. గిప్పుడు ఆ కల నెరవేరింది. పట్టాలు ఇవ్వడంతోపాటు పెట్టుబడి సాయం కింద రూ.8,625లు మా అకౌంట్లో వేసిండు.
– అజ్మీరా సుశీల-మధూకర్, ఎసన్వాయి(కోటపల్లి మండలం)