e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home ఆదిలాబాద్ వానలు పుల్.

వానలు పుల్.

సాధారణం కంటే ఎక్కువ నమోదు
నిండుగా సాగునీటి వనరులు
రెండు పంటలకూ పుష్కలంగా నీరు
ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు

ఆదిలాబాద్‌, జులై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఈ ఏడాది వానలు దంచికొడుతున్నాయి. వానకాలం సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండగా, మొదటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 534.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 851.5 మి.మీ కురిసింది. నిర్మల్‌ జిల్లాలో 429.5 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, 753.1 మి.మీ పడింది. మరో రెండు నెలల పాటు వర్షాలు పడే అవకాశ ముండగా, ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. రెండు పంటలకూ పుష్కలంగా సాగునీరు అందనుండగా, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకున్నాయి.

ఆదిలాబా ద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతులు ఎక్కువగా వర్షాలతో పాటు సాగునీటి వనరులపై ఆధారపడి వివిధ పంటలు పండిస్తారు. ఈ సీజన్‌లో ఎక్కువగా పత్తి, కంది, సోయాబీన్‌, వరి సాగు చేస్తారు. వానకా లం పంటల సాగుకు ప్రభుత్వం రైతుబంధు డబ్బులను అన్నదా తల బ్యాంకు ఖాతాల్లో వేసింది. పంట పెట్టుబడి సాయం చేతిలో ఉండడంతో రైతులు తమకు నచ్చిన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి సకాలంలో పంటలు వేశారు. సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు పంటల సాగుకు అనుకూలంగా పడుతుండడంతో వేసిన విత్తనాలు మొలకెత్తాయి. దీంతో రైతులకు రెండో సారి విత్తనాలు వేసే ఇబ్బందులు లేకుండా పోయాయి. వర్షాల కారణంగా పంటల్లో గడ్డి బాగా పెరిగిపోయింది. మరో వైపు వానలు వారం రోజులుగా కొంత తెరిపి ఇవ్వడంతో, రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. కలుపు తీయడంతో పాటు పంటలకు అవసరమైన ఎరువులు వేస్తున్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ సీజన్‌లో పంటలసాగుకు వర్షాలు అనుకూలంగా మారడంతో దిగుబడులు కూడా అధికంగా వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సాధారణం కంటే అధికం
రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 534.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా, 851.5 మి.మీ వర్షం పడింది. నిర్మల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 429.5 మి.మీ సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా, 753.1 మి.మీ వర్షం కురిసింది. అన్ని మండలాల్లో అధిక వర్షపాతం రికాైర్డెంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కారణంగా రెండు జిల్లాల్లో సాగునీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు నిర్మల్‌ జిల్లాలో కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకున్నాయి. రెండు జిల్లాల్లో వేయి పెద్ద, చిన్న చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. సాగునీటి బావుల్లో కూడా నీటిమట్టం బాగా పెరిగింది. జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలనీటిమట్టం అత్యధిక స్థాయికి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేదన్నారు. రెండు జిల్లాల్లో ఇప్పటికే ప్రాజెక్టులు, చెరువులు నిండిపోగా, పంటలకు అవసరమైన సమయంలో నీటిని విడుదలు చేయనున్నారు. కాగా, యాసంగి పంటలకు కూడా సాగునీటికి ఢోకా లేకుండా పోయింది.

సర్కారు సాయంతోటి ఎవుసంకు ఎలుగు ..
మా కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమి ఉన్నది. ఈ యేడు సుతా రూ,12,500 రైతుబంధు అచ్చింది. గీ పైసలతోని విత్త నాలు కొన్నం. ఇగ ఆనలు మంచిగ ఉండ వట్టి పత్తి,తొగరి మంచి గచ్చింది. కలుపు తీస్తున్నం. అప్పట్ల ఏఈవోలు చెప్పుడుకు చేనుల కల్లం కూడా కట్టుకున్నం. ఇగ పంటలకు ఏ సమయంల ఏ మందులు ఎయ్యాల్నో ఏఈవో సార్లు చెప్తున్నరు. గీ యేడు ఆనలు మంచిగ ఉండి ఇంకా ధైర్యమచ్చింది. నిరుటి కంటే పంటలు మంచిగ అస్తయని అనిపిస్తాంది. రైతులకు సర్కారు అన్ని తీర్ల సాయం చేసుడుకు నేకే కాదు అందరు రైతులల్ల ధైర్యం అచ్చింది. ఎవుసం మనుసు వెట్టి చేసుకుంటున్నం.

  • రుద్ర విలాస్‌, రైతు,అర్లి(టి), భీంపూర్‌ మండలం

రెండు పంటలు తీయగలుగుతున్నాం
ఈ వానకాలం వర్షాలు బాగుండడంతో పత్తి , కంది, సోయా, తృణ ధాన్య మొక్కలన్నీ పచ్చగా ఎదుగుతున్నాయి. మా గ్రామ శివారు గుండా పెన్‌గంగ నిండుగా ప్రవహిస్తున్నది. భూగర్భ జలాల వృద్ధితో యాసంగి పంటలకు కూడా ఢోకా లేకుండా అయింది. ఇక మా ఉమ్మడి కుటుంబానికి ఉన్న 40 ఎకరాల భూమిలో సర్కారు సూచనతో మొత్తంగా పత్తి వేసినం నిరుటి తీరే ఈ యేడు కూడా పత్తి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ఇపుడు ప్రతి క్లస్టరుకు ఏఈవో ఉండడంతో మా కు సరైన సమయంల విలువైన సమాచారం అందుతున్నది. వీలైనప్పుడల్లా రైతులమం తా సమీప రైతు వేదికలో కూర్చొని పంటల స్థితిగతులపై చర్చించుకుంటున్నాం. రైతు కల్లాలు కూడా నిర్మించుకున్నాము. సర్కారు ఉచిత విద్యుత్‌,చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, పంట ల కొనుగోలు తదితర పనులతో ఈ తరం వ్యవసాయం లాభసాటిగా మారుతున్నది.

  • అశోక్‌యాదవ్‌, రైతు, వడూర్‌, భీంపూర్‌ మండలం

సంతోషంగా ఎవుసం చేస్తున్నం..
ఈ యేడు ఆనలు మంచిగ ఉండడంతో మా 15 ఎక్కర్ల బర్కం భూములల్ల పత్తి, సోయా, తొగరి మొక్కలు మంచిగ ఎదుగుతున్నయి. ఇప్పటికే రెండుసార్లు డౌర అరకలు కట్టి కలుపు తీయించిన. ఎవుసం సార్లు ఎట్లచెప్తే అట్ల మొక్కలకు మందులేస్తున్నం. గడ్డిమందులు వాడుతలేం. ఇగ సర్కారు అసలు సమయంల రైతు బంధు ఇచ్చుడు తోటి ముందటి తీరు దళార్ల దగ్గరికి పోయేటి పని లేకుండా అయింది. మా గ్రామం శివారంలో తుమ్మలకుంట చెరువు నిండుడుతోని రెండో పంట సుతా(కూడా) ఏస్తమనుకుంటున్న. సీఎం కేసీఆర్‌ సారు శ్రద్ధతోటి మా గ్రామంలనే రిజర్వాయర్‌ అవుతున్నది. ఈ యేడు మాకు పత్తి ,తొగరి ,సోయా పంటలు నిరుటి కంటే ఎక్కువస్తయని నమ్మకమున్నది.

  • తోనుపు అశోక్‌ , రైతు, పిప్పల్‌కోటి, భీంపూర్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana