మంచిర్యాలటౌన్, మార్చి 6 : ఆస్తి పన్ను చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు ప్రత్యేక బృందాలను నియమించింది. ఒక్కో బృందంలో పది మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించింది. వీరికి ప్రత్యేకంగా వాహనాలు సమకూరుస్తున్నది. వాటికి జప్తు వాహనం అని బోర్డులను తగిలించనున్నారు.
పెద్ద మొత్తం లో ఆస్తి పన్ను చెల్లించాల్సిన భవన య జమానులతో పాటు మొండి బకాయిదారులుగా ముద్రపడ్డ వారి ఇండ్లకు ఈ ప్రత్యేక బృందాలు వెళ్లి.. మర్యాదపూర్వకంగా పన్ను చెల్లించాలని కోరుతారు. వీలును బట్టి వారికి కొంత సమయాన్ని ఇస్తున్నారు. గడువులోగా పన్ను చెల్లించకపోతే ఇంట్లోని విలువైన వస్తువులు, పరికరాలను జప్తు చేయనున్నారు. తమ వెంట తీసుకువెళ్లిన వాహనంలో జప్తుచేసిన వస్తువులను ప్రదర్శనగా తీసుకెళ్లనున్నారు. మొండి బకాయిదారుల జాబితాను ఇప్పటికే తయారు చేసుకున్న అధికారులు ముందుగా వారికి రెడ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45,373 భవనాలుండగా, వాటినుంచి ఈ ఏడాది ఆస్తిపన్ను రూపేణా పాత బకాయిలు కలుపుకొని మొత్తం రూ. 26.28 కోట్లు వసూలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 40 శాతం మాత్రమే వసూలు చేశారు. మిగిలిన రూ. 15.67 కోట్లు వసూలు చేసేందుకు ఇంకా 24 రోజులు మా త్రమే గడువు మిగిలి ఉంది. ఈలోగా పూర్తి స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేయడమే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పడున్న బిల్ కలెక్టర్లతో పాటు అన్ని విభాగాల్లోని సిబ్బంది, అధికారులు పన్ను వసూళ్లకోసం ఉపయోగిస్తున్నారు. ఏరోజుకారోజు వసూళ్ల పురోగతిని సమీక్షిస్తున్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని భవన యజమానులు సకాలంలో ఆస్తిపన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. మార్చి 31లోగా ఆస్తిపన్నులు చెల్లించాలి. అన్ని వార్డుల్లో తమ సిబ్బంది పన్నులు వసూలు చేస్తున్నారు. వారికి చెల్లించవచ్చు. కార్పొరేషన్ కార్యాలయానికి కూడా వచ్చి కౌంటర్లో చెల్లించవచ్చు. మొండి బకాయిదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. రెడ్ నోటీసులు జారీచేసి వారి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
– తౌటం శివాజీ, కార్పొరేషన్ కమిషనర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను మొండి బకాయిదారుల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసిన అధికారులు వాటికి స్పందించని యజమానుల ఆస్తులను జప్తుచేసేందుకు పూనుకున్నారు. గురువారం పట్టణంలోని శ్రీనివాస టాకీసు ఏరియాకు చెందిన దూలం గురువయ్యకు చెందిన దుకాణానికి సిబ్బంది తాళం వేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఆస్తిపన్ను మొత్తం కలిపి రూ. 46104 చెల్లించాలని రెడ్ నోటీసు జారీ చేసినా, యజమాని స్పందించకపోవడంతో కమిషనర్ శివాజీ ఆదేశాల మేరకు మున్సిపల్ మేనేజర్ విజయ్‌కుమార్, బిల్ కలెక్టర్లు, సిబ్బంది కలిసి వెళ్లి దుకాణానికి తాళం వేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చారు.