బుధవారం 20 జనవరి 2021
Adilabad - Nov 26, 2020 , 00:22:28

సమ్మెకు సై...

సమ్మెకు సై...

 • కేంద్ర సర్కారుపై కార్మికలోకం సమరశంఖం
 • సంఘటిత, అసంఘటిత కార్మికుల ఆందోళన బాట  
 • నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా నిరసనలు
 • పాల్గొంటున్న సింగరేణి కార్మికులు
 • టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం మద్దతు

కేంద్రం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సిద్ధమైంది. కార్మికుల హక్కులను కాలరాసేలా తెచ్చిన విధానాలను, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా తెచ్చిన వ్యవసాయ బిల్లులు, బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే నిర్ణయాలను, 12 గంటల పని విధానాలను, నూతన విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగబోతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు రంగాలకు చెందిన సంఘటిత, అసంఘటిత కార్మికులు మొదలు రైతులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు సుమారు 2.65 లక్షల మంది పాల్గొననుండగా, వామపక్ష పార్టీల అనుబంధ సంఘాలతోపాటు టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం కూడా కదం తొక్కనున్నది. 

నిర్మల్‌/ ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, రైతులను నిర్వీర్యం చేసే నూతన వ్యవసాయ విధానాన్ని, విద్యుత్‌ బిల్లును, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్మి క, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఎన్నో దశాబ్దాలపాటు పోరాటాలు చేసి సాధించుకున్న తమ హక్కులను కాలరాస్తూ అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కార్మికులు సాధించుకున్న హక్కులో ప్రధానమైనది సంఘటితం. ఇందుకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి సంఘటితం కాకుండా కేంద్రం చట్టాలు చేసింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఉన్న నూతన వ్యవసాయ విధానాన్ని రద్దు చేయాలని రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన స్వేచ్ఛ మార్కెట్‌, గిడ్డంగుల్లో నిల్వలు, ఒప్పంద వ్యవసాయం పేరిట తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు సమ్మెలో పాల్గొంటున్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఇటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా ఏకమయ్యారు. 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించనున్నారు. 

సంఘటితంగా సార్వత్రిక సమ్మె

సార్వత్రిక సమ్మెలో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగంతోపాటు వామపక్ష పార్టీలైన అనుబంధ సంఘాలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నాయి. సింగరేణి మొదలుకొని ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, రక్షణ శాఖ బ్యాంకింగ్‌ ఫెడరేషన్‌, రైల్వే ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్‌ మినహా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ వంటి ట్రేడ్‌ యూనియన్లు సమ్మెను విజయవంతం చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులకు కూడా సమ్మెపై అవగాహన కల్పించి వారిని సమీకరిస్తున్నాయి. బ్యాంకులను ప్రైవేటీకరించి కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ సమ్మెలో అన్ని బ్యాంకులు పాల్గొంటున్నాయి. నూతన విద్యుత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగులు, నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాహనాల యజమాలు కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో సమ్మెను విజయవంతం చేసేందుకు అందరూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 2.65 లక్షల మంది రైతులు, కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు జైకొట్టారు. గురువారం భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

ప్రధానమైన డిమాండ్లు ఇవే..  

 1. కార్మిక వ్యతిరేక కోడ్‌లను, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి.
 2. కనీస వేతనం రూ.21వేలుగా నిర్ణయించి అమలు  చేయాలి. 
 3. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. సమాన పనికి  సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి. 
 4.  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలి. 
 5. బీమా, బ్యాంకింగ్‌, బొగ్గు, రైల్వే, రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను ప్రైవేటీకరించరాదు. 
 6. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు తదితర స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించాలి.
 7. ఎస్‌ఎంఎస్‌ఈలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. కార్మిక ఉపాధికి భద్రతనివ్వాలి. 
 8. అసంఘటితరంగ కార్మికులకు 3 శాతం బడ్జెట్‌ కేటాయింపుతో సమగ్ర శాసనాన్ని అమలు చేయాలి. 
 9. ప్రభుత్వ విద్య, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. 
 10. కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలందరికి  ఉచితంగా ఇవ్వాలి.
 11. నిరుపేద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 10 కిలోల  బియ్యం నిరంతరాయంగా అందించాలి.
 12. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి. పాత పెన్షన్‌  విధానాన్ని పునరుద్ధరించాలి. 
 13. అందరికీ పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి. 
 14. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వేతనాలు రూ.600  పెంచుతూ ఏడాదికి 200 పని దినాలు కల్పించాలి.
 15. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలి. 
 16. ఆదాయ పన్ను పరిధిలోకి రాని ప్రతి కుటుంబానికీ రూ.7,500 చెల్లించాలి. 
 17. దళితులు, మైనార్టీలపై దాడులను అరికట్టాలి.
 18. మహిళల పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలి. 
 19. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి.. 
 20. నూతన మోటార్‌ వెహికల్‌ చట్టాన్ని రద్దు చేయాలి.

నేటి సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు

- మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు 

మంచిర్యాలటౌన్‌ : కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు దేశంలోని కోట్లాదిమంది కార్మికుల జీవితాలను పణంగా పెట్టిన బీజేపీపై  ఉద్యమించేందుకు జాతీయ సంఘాలతో పాటు ఆయా శాఖల ఉద్యోగులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతును తెలుపుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. బుధవారం సాయం త్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏడు దశాబ్దాలుగా దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడిన ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, రైల్వేలు, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు, బొగ్గు గనులు, బ్యాంకింగ్‌ రంగాల్లో ప్రైవేటీకరణ ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిందన్నారు. మరోవైపు కార్మికులు, కూలీలు, కాంట్రాక్టు ఉద్యోగులకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు అందించాలని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్త సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నదన్నారు. 

బొగ్గు గనులపై ప్రచారం..

శ్రీరాంపూర్‌ : దేశ వ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని కేంద్ర బీజేపీ కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సింగరేణి శ్రీరాంపూర్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, రీజియన్‌ కార్యదర్శి మల్లారెడ్డి తదితర నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులను కోరుతూ అన్ని బొగ్గు గనులపై బుధవారం ప్రచారం చేశారు. 


logo