e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home ఆదిలాబాద్ ఎరువులు ఫుల్‌

ఎరువులు ఫుల్‌

ఉమ్మడి జిల్లాలో 17.50 లక్షల ఎకరాల్లో సాగు
4,32,100 మెట్రిక్‌ టన్నుల అంచనా
అన్నదాతల అవసరాల మేరకు పంపిణీ

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 15 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు అరిగోస పడ్డారు. పగలనకా.. రాత్రనకా.. ఎండనకా.. వాననకా.. గజగజ వణికంచే చలిలో వేకువజాము నుంచే పిల్లాపాపలతో దుకాణాల ఎదుట కిలోమీటర్ల మేర క్యూలు కట్టేవారు. అయినా దొరకని దుస్థితి.. స్వరాష్ట్రంలో పంట కాలానికి ముందుగానే సాగు అంచనా వేయడం.. ఎరువులు, విత్తనాలు ఎంత మేర అవసరం అవుతాయో ప్రణాళికలు రూపొందించడం, స్టాకు తెప్పించి గోదాముల్లో భద్రపరచడం వంటివి సర్కారు చేసింది. వీటిని పీఏసీఎస్‌, దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ వానకాలంలో 17.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా.. 4,32,100 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అన్నదాతలకు ఇబ్బంది లేకుండా పంపిణీ కూడా చేపట్టారు. ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎరువుల పంపిణీకి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యేటా సీజన్‌కు ముందుగానే సరిపడా ఎరువులను సరఫరా చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వానకాలంలో 17.50 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది, సోయాబీన్‌, పెసర, ఇతర పంటలను సాగు చేస్తారు. ఇందుకోసం 4,32,100 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దానికనుగుణంగా ఎరువులను తీసుకువచ్చి మార్క్‌ఫెడ్‌, ఇతర గోదాముల్లో నిల్వ చేశారు. ఏటా వానాకాలం పంటలకు ఏప్రిల్‌ నుంచి ఎరువుల విక్రయాలు ప్రారంభిస్తారు. గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, రైతు ఆగ్రో సేవా కేంద్రాల ద్వారా ఎరువులను సరఫరా చేశారు. ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ స్టాక్‌, అమ్మకాలు, రైతుల వివరాలను పరిశీలించి అమ్మకాల్లో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు.

- Advertisement -

కొరత లేకుండా చర్యలు
సరిపడా ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు ముందుగానే పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. బఫర్‌ స్టాక్‌ ఉండడంతో పాటు ర్యాక్‌లు క్రమంగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు తరలించండం, నిల్వలను జాగ్రత్తగా ఉంచడం లాంటి వాటిల్లో సైతం ముందుస్తు జాగ్రత్తలు చేపట్టారు. వానకాలంలో ఆరు నెలల వ్యవధిలో వరి, పత్తి, సోయాబీన్‌, కంది, పెసర పంటలను సాగు చేస్తారు. నెలల వారీగా ఎరువులను అధికారులు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, దుకాణల నుంచి రైతులు కొనుగోలు చేస్తారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో…
ఆదిలాబాద్‌ జిల్లాలో వానకాలం సీజన్‌లో 94,00 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరవుతాయని అంచనా వేసిన అధికారులు 69,433 మెట్రిక్‌ టన్నులను విక్రయించారు. ఇందులో యూరియా 31071 మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉండగా, 27,032 మెట్రిక్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. డీఏపీ 10,343 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌ ఉండగా, 9,607 మెట్రిక్‌ టన్నులను అమ్మారు. ఎంవోపీ 1000 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌పీకేఎస్‌ 36000 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 4000 మెట్రకి టన్నులను సైతం కొరత లేకుండా పంపిణీ చేశారు.

మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో యూరియా 47,470 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 16,180 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 27,080 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 12,300 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 4,070 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేశారు.

నిర్మల్‌ జిల్లాలో…
నిర్మల్‌ జిల్లాలో 96 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. 30 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 12 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను సరఫరా చేశారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో…
కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 1,35,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. 46 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, 23వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 23వేల మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ, 23 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 20 వేల మెట్రిక్‌ టన్నుల ఎస్‌ఎస్‌పీ ఎరువులను పంపిణీ చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana