మంచిర్యాల, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగి అనారోగ్యానికి గురికావడం ఆందోళన కలిగిస్తున్నది. బాలికలు పూర్తిగా కోలుకోకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్‌కు తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, తాజాగా.. శుక్రవారం వాంతులు.. కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరిని మరోసారి హాస్పిటల్‌కు తరలించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
వైద్యం చేసి డిశ్చార్జి చేశాక.. మరోసారి అస్వస్థతతో హాస్పిటల్‌కు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సర్కారు సరైన వైద్యమందించడంలో విఫలమైందని వారు మండిపడుతున్నారు. వాంకిడిలో ఫుడ్ పాయిజన్ జరిగి ముగ్గురు విద్యార్థులు సీరియస్ కండీషన్లోకి వెళ్లిన ఘటన సంచలనంగా మారిన మరుసటి రోజే మంచిర్యాలలో మరో ఫుడ్ పాయిజన్ జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్నారు.
ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటల్లో చేరిన 12 మంది విద్యార్థినులకు ఒకే రోజు చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. కానీ డిశ్చార్జి చేసిన రోజు సాయంత్రమే హాస్టల్‌కు తిరిగి వెళ్లిన 12 మందిలో నలుగురు విద్యార్థినులు వాంతులు చేసుకున్నారని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. పూర్తిగా నయం కాకుండానే హాస్టల్‌కు తీసుకొచ్చారని వాపోతున్నారు. శుక్రవారం హాస్టల్లో అందరి కోసం చేసిన టమాట బాత్‌నే వారికి కూడా పెట్టినట్లు అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు మరోసారి అస్వస్థతకు గురికావడానికి అదే కారణం కావచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌పాయిజన్ ఘటన నేపథ్యంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు శుక్రవారం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. హాస్టల్లోని కిచెన్‌ను, కూరగాయాలు, వంట సామగ్రిని పరిశీలించారు. క్వాలిటీ తక్కువగా ఉన్న పప్పుల శాంపిళ్లను తీసుకున్నారు. వాటిని ఐటీడీఏ పీవోకు పంపిస్తామని చెప్పారు.
ఈ సమయంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు సిక్ రూమ్‌లో ఉన్నారని తెలిసి వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇంకా వాంతులు అవుతున్నాయంటూ విద్యార్థినులు చెప్పారు. ఇంటి నుంచి తెచ్చిన పచ్చడి తినడంతో జరిగిందంటున్నారు.. నిజమేనా అని ఆయన అడుగగా.. అలాంటిది ఏం లేదు సార్. హాస్టల్ ఫుడ్ మాత్రమే తిన్నామని పిల్లలు చెప్పారు. మాజీ ఎమ్మె ల్యే రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వాంతులు చేసుకుంటున్న విద్యార్థినితో పాటు కడుపునొప్పితో బాధపడుతున్న మరో విద్యార్థిని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. దివాకర్‌రావు వచ్చే వరకు పిల్లలను హాస్పిటల్‌కు తీసుకుపోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యార్థినులు మరోసారి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా శుక్రవారం సాయం త్రం పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. మీడియాను, విద్యార్థి సంఘాల నాయకులకు ఎవరినీ లోపలికి అనుమతించకుండా, గేట్ వేసి మరి దాదాపు గంట పాటు విచారించారు. దీంతో అక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బయటికి వచ్చిన ఐటీడీఏ పీవోకు గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, నిరంతరం స్వయంగా పర్యవేక్షించాలని వారు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా మీడియాతో మాట్లాడారు. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా విద్యార్థిని వాంతులు చేసుకుందన్నారు. రెండు, మూడు రోజులు ఇన్ఫెక్షన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారని తెలిపారు. ఫుడ్, వాటర్ రిపోర్లు అన్నీ బాగానే ఉన్నాయని తెలిపారు. అన్ని విభాగాల నుంచి ఎంక్వైరీ చేయిస్తున్నామని, రిపోర్ట్ వచ్చాక తదుపరి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. శుక్రవారం ఉదయం ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన విద్యార్థినులకు సైతం టమాటా బాత్ పెట్టిన విషయమై ఐటీడీఏ పీవో స్పందిస్తూ.. వారికి లైట్ ఫుడ్ పెట్టాలని వార్డెన్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో విద్యార్థుల మరణాలు, ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టం. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు గిరిజన కో ఆపరేటివ్ సొసైటీలు సరఫరా చేసే కందిపప్పు, పెసరపప్పు నాణ్యతగా లేదు. చేతిలోకి తీసుకుంటే ఆ పప్పు పుచ్చిపోయాక వచ్చే దుమ్ము నా చేతులకు అంటుకుంది. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దు. విద్యార్థులకు అందించే ఫుడ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నాసిరంక వస్తువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– దివాకర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే