నిర్మల్, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీల్లో భాగంగా అర్హులైన పేదలకు అందజేస్తామన్న రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా.. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. వేలాది మంది ఎదురు చూస్తున్నా రేషన్ కార్డుల పంపిణీ ప్రహసనంగా మారింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 10,192 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు మరో 30,973 మంది దరఖాస్తులు అందించారు.
ఇలా 41,165 మం ది అర్హులైన వారు ప్రభుత్వం అందజేసే రేషన్ కార్డుల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్ర భుత్వ ఆదేశాల మేరకు రీ-సర్వే పేరిట అధికారులు దరఖాస్తుదారుల ఇళ్ల చుట్టూ తిరుగుతుండడంతో ఇప్పట్లో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందే పరిస్థితి కనిపించడం లేదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, తన సిబ్బందితో కలిసి దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి విచారణ చేస్తున్నారు.
ఆదాయ ధ్రువీకరణ పత్రంతోపాటు ఎల్పీజీ కనెక్షన్ వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఆర్ఐ లాగిన్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాలను ఆయా మండలాల పరిధిలోని తహసీల్దార్లు పరిశీలించి డీఎస్వో(జిల్లా పౌర సరఫరాల అధికారి) లాగిన్‌కు ఫార్వర్డ్ చేయాలి. ఆ తర్వాత అన్ని వివరాలు సక్రమంగా ఉంటే అప్పుడు డీఎస్వో అప్రూవల్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అర్హులైన వారి వివరాలు సేకరించిన తర్వాతనే ప్రభుత్వం కొత్త కార్డులను జారీ చేసే అవకాశం ఉన్నది. అప్పటి వరకు ఎదురుచూపులు తప్పేలా లేవు.
నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం 2,08,606 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో అంత్యోదయ 12,827, సాధారణ 1,95,747, అన్నపూర్ణ 32 కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల ద్వారా జిల్లా వ్యాప్తంగా 6,30,242 మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతున్నాయి. వీరి కోసం ప్రతి నెల 412 రేషన్ దుకాణాల ద్వారా 39,957 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇటీవల రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో అర్హులు రేషన్‌కార్డు లేకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలమై ఉండి కూడా బహిరంగ మార్కెట్లో రూ.30 నుంచి రూ.40లకు కిలో బియ్యాన్ని కొనుక్కుంటున్నామని వాపోతున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పథకం అమలుకు రేషన్ కార్డునే ప్రామాణికం చేయడంతో అర్హులైన వేలాది మంది పేదలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు దరఖాస్తులను స్వీకరించింది. మళ్లీ తాజాగా రీ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఇప్పటికే జాబితాలో పేర్లున్న వారు ఆందోళన చెందుతున్నారు. పాత జాబితా ప్రకారం ఉన్న కుటుంబాలపై మరింత లోతుగా సూక్ష్మ శోధన చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకే ప్రభుత్వం రీ సర్వే అంటూ డ్రామాలు ఆడుతున్నదని పేదలు మండిపడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం, మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే సిలిండర్ వంటి పథకాలన్నింటికీ రేషన్ కార్డే ఆధారం కావడంతో ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు లేకుండా కనీసం ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందలేని పరిస్థితి నెలకున్నదని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్వేల పేరిట కాలయాపన చేయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాది కుభీర్ మండలంలోని చొండి గ్రామం. మాకు దాదాపు పదేండ్ల కిందట పెళ్లి కాగా, నాది, మా భర్త పేరు మీద తెల్ల రేషన్ కార్డు ఉంది. మాకు 9, 5 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. మాది చాలా పేద కుటుంబం. కార్డులో మా ఇద్దరి పేర్లే ఉండడంతో 12 కేజీల బియ్యం మాత్రమే వస్తున్నాయి. మా పిల్లల పేర్లు రేషన్‌కార్డులో ఎక్కించాలని ఆఫీసుల చుట్టూ తిరిగినం. అయినా పని కాలేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము గెలిస్తే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తమన్నరు. 15 నెలలుగా ఎదురు చూస్తున్నం. ఇప్పటి వరకు మూడు సార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న. అయినా పిల్లల పేర్లు ఎక్కలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి మా పిల్లల పేర్లను రేషన్‌కార్డులో చేర్చి అదనంగా బియ్యం వచ్చేటట్లు చూడాలి.
-సంగోజి కల్యాణి, రేషన్‌కార్డు దరఖాస్తుదారు, చొండి, కుభీర్ మండలం.
మా ఇంట్లో భర్త నర్సయ్యతోపాటు 7,5 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు వికలాంగుడైనా వికలాంగ పింఛన్ కూడా అస్తలేదు. రేషన్ కార్డు లేకుంటే పింఛన్ కూడా ఇయ్యరట. కొత్త రేషన్ కార్డు కోసం ఇప్పటి వరకు మూడు సార్లు దరఖాస్తు చేసినం. మీ సేవల దరఖాస్తు చేసినట్లు రిసిప్ట్ కూడా ఇచిన్రు. ఆరు నెలల కింద పంచాయతీ ఆఫీసర్లు ఇంటికి వచ్చి అన్ని వివరాలు రాసుకున్నరు. గుడిసెలో ఉండే మాలాంటి పేదలకు రేషన్ కార్డు ఇయ్యరా సార్ అని అడిగినం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డులు ఇస్తమని అంటున్నరు. తొందరలోనే అస్తయ్ అని చెప్పి వెళ్లిపోయిన్రు. ఆరు నెలలు దాటింది. ఇప్పటిదాకా రాలేదు. ఎవరిని అడిగినా ఎప్పుడు అస్తయో తెల్వదంటున్నరు. మా భర్త నర్సయ్య పొద్దంతా అడవికి పోయి పశువులు కాస్తడు. వచ్చే కూలీ పైసలతో నూకలు కొనుక్కొని తింటున్నం. మా పిల్లలకు బియ్యంతో వండిన అన్నం తినిపించే అదృష్టం కూడా మాకు లేదా? వెంటనే రేషన్ కార్డు ఇచ్చి మా కుటుంబానికి న్యాయం చేయాలి.
– అల్లెపు వెంకవ్వ, దరఖాస్తుదారు, తర్లపాడ్, ఖానాపూర్ మండలం.
మాది చాలా పేద కుటుంబం. మా ఇంట్లో భర్తతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా భర్త రోజు కూలి పనికి వెళ్తేనే కుటుంబం గడుస్తుంది. అలాంటింది మాకే రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తు చేసుకోమని చెప్పిన్రు. రేషన్ కార్డుతోపాటు మహాలక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసిన. ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదు. మళ్లీ కుల గణన సర్వే చేసినప్పుడు కూడా రేషన్ కార్డు లేదని రాసుకున్నరు. మాలాంటి పేదలకు రేషన్‌కార్డు అందజేసి ఆదుకోవాలి. మళ్లీ సర్వే చేసేందుకు అధికారులు వస్తరని చెబుతున్నరు. ఇప్పుడు సర్వే చేస్తే ఇంకెన్ని రోజులకు రేషన్ కార్డులు ఇస్తరో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం పేదల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.
– బోయినపెల్లి లహరి, రేషన్‌కార్డు దరఖాస్తుదారు, చొండి గ్రామం, కుభీర్ మండలం
నా భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తే వచ్చే కూలీ పైసలతోనే మా ఇల్లు గడుస్తుంది. మాకు ఏడేళ్ల కూతురు ఉంది. మా పెళ్లికంటే ముందు మా అత్తమ్మ నర్సవ్వ, భర్త నరేశ్ పేర్ల మీద (తల్లి, కొడుకులకు) ఇద్దరిది కలిపి ఒకే రేషన్ కార్డు ఉండే. కొద్ది రోజుల తర్వాత మా అత్తమ్మ చనిపోయింది. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుందామని మీ సేవకు వెళితే.. మీ భర్త పేరు మీద ఇప్పటికే రేషన్ కార్డు ఉంది. దాంట్లోనే మీ కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కియ్యచ్చని చెప్పిన్రు. దీంతో పాత రేషన్ కార్డులోనే నాది, మా కూతురి పేరు ఎక్కించాలని సంవత్సరం కింద మీ సేవలో దరఖాస్తు చేసినం. రిసిప్టు పట్టుకుని ఆఫీసుల పొంటి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుం టలేరు. పంచాయతీ సెక్రటరీని కలిసి అడిగితే మేమేం చేయలేం ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంటున్నరు. కార్డులో ఒక్కడి పేరే ఉండడంతో నెలకు ఆరు కిలోల బియ్యమే అస్తున్నయ్. ఒక పూట తింటే ఇంకో పూట ఉపాసం ఉంటున్నం. మా పేర్లు కూడా రేషన్ కార్డులో ఎక్కిస్తే నెలకు 18 కిలోల బియ్యం అస్తయ్.
– అల్లెపు లావణ్య, రేషన్‌కార్డు దరఖాస్తుదారు, తర్లపాడ్ గ్రామం, ఖానాపూర్ మండలం