ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల లెక్క తేలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 102 వ్యవసాయ క్లస్టర్లలో వివరాలు సేకరించారు. వర్షాధారం, సాగు నీటి వనరుల కింద ఎన్ని ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయో వివరాలు నమోదు చేసుకున్నారు. వానకాలం సీజన్లో 5.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారని తేలింది. ఇందులో వర్షాధారంపై 3.63 లక్షల ఎకరాలు, నీటి పారుదల కింద 1.72 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు నిర్ధారించారు.
– ఆదిలాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ రంగానికి పలు పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు రెండు పంటలు సాగు చేసుకునేలా సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలను నిర్మించడంతోపాటు మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నది. దీంతో రైతులకు రెండు సీజన్లకు గాను అవసరమైన సాగునీరు అందుతున్నది. సాగులో రైతులకు ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏఏ పంటలు సాగు చేస్తున్నారని, వర్షాధారంపై సాగయ్యే పంటల వివరాలు, సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉందనే వివరాలను అధికారులు సేకరించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 102 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలోని 691 గ్రామాల్లో వ్యవసాయశాఖ, విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. జిల్లాలో వానకాలం సీజన్లో 5.36 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయా, వరి, ఇతర పంటలను రైతులు సాగు చేస్తారు. యాసంగిలో 1.60 లక్షల ఎకరాల్లో శనగ, జొన్న, పల్లి పంటలు పండిస్తారు. వానకాలంలో అధికంగా వర్షాలపై ఆధారపడి, యాసంగిలో సాగునీటి వనరుల ద్వారా పంటలకు నీటిని అందిస్తారు.
1.72 లక్షల ఎకరాలకు సాగునీరు
మూడు శాఖల అధికారులు నిర్వహించిన సర్వేలో నీటి పారుదల, వర్షాలపై సాగయ్యే పంటల విస్తీర్ణం నిర్ధారణ అయింది. సాగునీటి పథకాల ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో పంటలకు నీటి సరఫరా అవుతుండగా.. వర్షాధార సాగు 3.63 లక్షల ఎకరాల్లో ఉంది. 516 చెరువుల ద్వారా 17,188 ఎకరాలకు, ప్రాజెక్టు కాలువల ద్వారా 41,157 ఎకరాలకు, 7,090 సాగునీటి బావుల ద్వారా 27,426 ఎకరాలకు, 19,077 బోర్‌వెల్స్ నుంచి 86,613 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వానకాలంలో వర్షాలపై ఆధాపడి రైతులు పంటలు సాగు చేస్తుండగా, యాసంగిలో సాగునీటి పథకాల ద్వారా రైతులు పంటలు పండిస్తారు. రెండు సీజన్లలో పంటలకు అవసరమైన నీటిని వినియోగించుకుంటారు. జిల్లాలోని జైనథ్ మండంల సాత్నాల, తాంసి మండలంలోని మత్తడి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వారబందీ పద్ధతిలో అధికారులు నీటిని విడుదల చేస్తారు. జిల్లాలో 30 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా రైతులు ఓపెన్ వెల్స్, బోర్వెల్స్లకు మోటర్లు బిగించుకుని నీటిని వాడుకుంటారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయడం రైతులకు వరంగా మారింది. సర్వే వివరాలను ప్రభుత్వానికి పంపనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.