బాసర, ఆగస్టు 29 : మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మ ల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది. దారికి ఇరువైపులా లోతట్టు ప్రాంతాల్లోని భవనాలు, ప్రైవేట్ లాడ్జీలు, ఆలయ సమీపంలోని దుకాణాల్లోకి నీరు చేరింది. స్థానికులు, భక్తులు చిక్కుకపోయారు. నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు సీఐ మల్లేశ్, ఎస్ శ్రీనివాస్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని పడవలు, ట్రాక్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
బాసర గోదావరి వద్ద గల రైల్వే బ్రిడ్జి దగ్గరలో గోదావరి విజృభించడంతో రైల్వే అధికారులు అప్రమత్తమై బాసర మీదుగా వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేశారు. బాసర మండలంలోని బిద్రెల్లి వద్ద వాగు పొంగి పొర్లడంతో భైంసా- నిజామాబాద్ రహదారిపై రాకపోకలు నిలిపిపోయాయి. బాసర నుంచి ఓని, కౌట, సాలాపూర్, సావర్గం, కిర్గుల్ వెళ్లే మార్గంలో గల వాగు పొంగి పొర్లడంతో ఇక్కడ కూడా రాకపోకలు నిషేధించారు.
బాసర, బిద్రెల్లి రాటి, దౌడాపూర్, ఓని, కిర్గుల్, కౌట, సాలాపూర్, గ్రామాల్లోని దాదాపు వెయ్యి ఎకరాలు నీటమునిగాయి. ఎకరానికి రూ. 30వేలు అందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
బాసర వద్ద గోదావరి నదికి ఇంత పెద్ద వరద 1984 సంవత్సరం వచ్చిందని ఆ తర్వాత ఇప్పుడేని స్థానికులు తెలిపారు. అప్పట్లో దాదాపు బ్రిడ్జి ఎత్తు వరకు నీరు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు గోదావరి తల్లికి శాంతిపూజలు, సౌభాగ్య ద్రవ్య సమర్పన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక సిబ్బంది, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.