బరువు తగ్గండి నేటితరాన్ని ‘ఊబకాయం’ పట్టిపీడిస్తున్నది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో.. ‘బరువు’ చేయిదాటి పోతున్నది. ఫలితంగా, అనేక రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉన్నది. ఈ క్రమంలో బరువును అదుపులో పెట్టుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందుకోసం నానా తిప్పలు పడుతుంటారు. అదే సమయంలో లేనిపోని అపోహలకు చాలామంది గురవుతున్నారు. వాటిని పక్కన పెడితేనే.. బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.
భోజనం మానేయాల్సిందేనా?
ఇది అచ్చంగా అపోహే! భోజనం మానేయడం వల్ల బరువు తగ్గడం అటుంచి.. కొన్ని సందర్భాల్లో బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. భోజనం మానేస్తే జీవక్రియ మందగిస్తుంది. కొన్నాళ్లకు ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. అదే స్థిరమైన భోజన అలవాటు.. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది.
కొవ్వు మంచిది కాదు..
కేవలం బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే బరువు పెంచుతుంది. అవకాడో, గింజలు, ఆలివ్ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు.. నిజానికి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.
కార్బోహైడ్రేట్లు బరువు పెంచుతాయి..
ఈ అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే, ప్రతి కార్బోహైడ్రేట్.. ఆరోగ్యానికి హానికరం కాదు. బియ్యం, మైదా, చక్కెర లాంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తింటే.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అదే పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాల నుంచి వచ్చే కార్బోహైడ్రేట్లు.. ఫైబర్, పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
వ్యాయామం ఒక్కటే చాలదు
బరువు తగ్గడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. అదొక్కటే సరిపోదు. చాలామంది భోజనం తక్కువ తీసుకుంటూ.. ఎక్కువ వ్యాయామాలు చేస్తుంటారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో ఇది బరువును పెంచేస్తుంది. అందుకు బదులుగా, వ్యాయామానికి తగ్గట్టుగా పోషకాహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకుంటే.. మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం ఉండదు.