సిద్దిపేట, మార్చి 15: అంగన్వాడీ సిబ్బంది సమస్యలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు గత ఎన్నికల్లో ఇచ్చిన ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్‌రావును కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఎన్నికలప్పుడు కాంగ్రెస్ తమకు ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని, తమ న్యాయమైన డిమాండ్లు పరిషరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హరీశ్‌రావుకు అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని అసెంబ్లీలో ఎండగడుతానని అంగన్వాడీలకు హామీఇచ్చారు. కనీసం వేతనం రూ. 18వేలు ఇవ్వడం, ఉద్యోగ భద్రత కల్పించడం, అంగన్వాడీ టీచర్లను ప్రీ-ప్రైమరీ టీచర్లుగా గుర్తించి, ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హరీశ్‌రావు పేర్కొన్నారు.