ముఖంపై ముడతలకు నిద్రలేమి, ఒత్తిడి కారణం అవుతున్నాయి. సొగసు.. చిన్నవయసులోనే ముఖం చాటేస్తున్నది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. చర్మంపై వృద్ధాప్యపు ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూర, తోటకూర, అవకాడో, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి లాంటివి ఎక్కువగా తినాలి. నీళ్లు కూడా బాగా తాగాలి.
ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. ముఖంపై సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు.. చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, చలికాలంలో కూడా ఎస్పీఎఫ్ 30కిపైగా ఉండే లోషన్‌ను రాసుకోవాలి.
పొడిచర్మం ఉంటే.. ముడతలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే, తరచూ ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. దీనివల్ల దుమ్మూధూళితో మూసుకుపోయిన స్వేద రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం కాంతిమంతం అవుతుంది. ముఖం తేమగా ఉండేందుకు మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి.
ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయాలి. నిత్యం ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. శరీర ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యమూ మెరుగుపడుతుంది. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్స్ లాంటి ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ లాంటివి తగ్గుతాయి. దీంతో చర్మంపై ముడతలు తొందరగా ఏర్పడవు.
ప్రతిరోజూ ఎనిమిది గంటలు నిద్రపోవాలి. కంటి నిండా నిద్రవల్ల ఒత్తిడి తగ్గుతుంది. చర్మానికి కావాల్సినంత సాంత్వన లభిస్తుంది.