నోటి వెనకభాగంలో గొంతుకు రెండువైపులా ఉండే లింఫ్ (శోషరస) గ్రంథులను టాన్సిల్స్ అంటారు. వాటికి సమీపంలో నోటి పైభాగంలో, ముక్కు రంధ్రంలో ఉండే లింఫ్ గ్రంథులు.. ఎడినాయిడ్స్. శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే సూక్ష్మజీవుల నుంచి లింఫ్ గ్రంథులు రక్షిస్తాయి. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ రెండూ కూడా నాలుగు నుంచి పది సంవత్సరాల వయసులో చాలా చురుగ్గా ఉంటాయి. యుక్త వయసు తరువాత ఆ పరిమాణం క్రమంగా తగ్గుతుంది. టాన్సిలైటిస్ ఎక్కువగా బడి వయసు పిల్లలకు వస్తుంది. కొన్ని రకాల వైరస్లు, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఈ వ్యాధికి ప్రధాన కారణాలు.
లక్షణాలు
గొంతు తడారిపోవడం, ఆహారం మింగినప్పుడు నొప్పి, చెవినొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, చలిజ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు ముందు భాగంలో లింఫ్ గ్రంథుల వాపు.. ప్రధాన లక్షణాలు. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిలో తీవ్రత ఎక్కువ. వ్యాధి ఎక్కువ రోజులు ఉంటే నోటి దుర్వాసన, గొంతులో ఏదో చిక్కుకున్న భావన ఇబ్బంది పెడుతుంది.
నోరు తెరిచి చూస్తే వెనకభాగాన రెండువైపులా వాచిపోయిన టాన్సిల్స్ ఎర్రగా ఉంటాయి. రెండుమూడు రోజుల తర్వాత టాన్సిల్స్‌పై ఒక చీముపొర ఏర్పడుతుంది. ఎడినాయిడ్స్ వాచినప్పుడు ముక్కు మూసుకుని పోయి నోటిద్వారా గాలి పీలుస్తారు. వాసన గ్రహించే శక్తి తగ్గిపోతుంది. నిద్రలో గురక, అకస్మాత్తుగా లేచి ఏడవడం.. తదితర లక్షణాలు కనిపిస్తాయి. పక్క తడుపుతారు. నిద్రలో కలవరిస్తారు.
వైద్యం
బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధికి యాంటీబయాటిక్స్ అవసరం. అశ్రద్ధ చేస్తే మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన రుగ్మతల పాలవుతారు. గొంతు నొప్పికి ఉప్పు వేసిన నీటితో పుక్కిలించాలి. దీర్ఘకాలంగా సమస్య వేధిస్తే టాన్సిల్స్ తీయడానికి ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఎడినాయిడ్స్ బాగా వాచి శ్వాసలో ఇబ్బంది కలిగించినా, తరచుగా ముక్కు, సైనస్, చెవి ఇన్ఫెక్షన్ వచ్చినా ఎడినాయిడ్స్ తీసివేయాల్సి రావచ్చు.
– డాక్టర్ కర్రా రమేశ్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు