రాత్రి హాయిగా నిద్రపోయినప్పటికీ చాలామంది ఉదయం లేవగానే అలసటగా, నీరసంగా ఫీలవుతుంటారు. అలా అనిపించిందంటే కచ్చితంగా మీ రోజువారీ అలవాట్లు కొన్ని మీ స్లీప్ సైకిల్ని దెబ్బతీస్తున్నాయని అర్థం. అలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
స్థిరమైన సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం వల్ల మీ సరెడియన్ రిథమ్ నియంత్రణలో ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మీరు మరింత ఉల్లాసంతో మేల్కొంటారు.
కాంతిని తగ్గించండి: కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే, పడుకునే ముందు లైట్లను డిమ్ చేయడం మంచి నిద్రకు దోహదం చేస్తుంది.
గది ఉష్ణోగ్రతలు: సీజన్లకు అనుగుణంగా గది ఉష్ణోగ్రతలు మార్చుకోవాలి. నిద్రకు సహకరించే విధంగా గది వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటేనే ఆ సంకేతాలు మెదడుకు
చేరి చక్కటి నిద్రకు సహకరిస్తాయి. అప్పుడే మెదడు రిలాక్స్ అవుతుంది.
స్విచాఫ్ అయ్యేలా: మంచంపైకి వెళ్లడం అంటే నిద్రపోవడమే అని మీ మెదడును ప్రిపేర్ చేయడం వల్లనే త్వరగా నిద్రలోకి జారుకుంటారు. మంచంపై పని చేయడం, చదవడం, ఫోన్ స్రోల్ చేయడం వంటివి అస్సలు చేయవద్దు. మెదడును స్విచాఫ్ చేసే సాధనంగా మంచాన్ని వాడుకోండి.
సమయానికి ఆహారం: పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనాన్ని ముగించండి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో జీర్ణక్రియ కోసం అదనపు పని చేయాల్సి వస్తుంది. త్వరగా భోజనం చేస్తే పడుకునే వేళకు జీర్ణక్రియ పూర్తయి, శరీరం ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది.
10 నిమిషాలు నిలబడి: పడుకునే ముందు 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఏ కార్యకలాపాలను చేయకుండా నిలబడి ఉండటం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఇది గాఢమైన, ప్రశాంతమైన నిద్ర మూడ్లోకి తీసుకెళ్తుంది.