Harish Rao | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో తమ్ముడు సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీసీ బిడ్డ ఆత్మబలిదానానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎన్నటికీ క్షమించదని తెలిపారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అధికార దాహానికి బలైన ప్రాణం ఇది అని పేర్కొన్నారు.
సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి కూరాలని ఆ దేవుడిని హరీశ్‌రావు ప్రార్థించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సాయి ఈశ్వర్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నను కలవడానికి వెళ్లిన సాయిఈశ్వర్ గురువారం సాయంత్రం.. ఆయన ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఫైరింజన్, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న వారు మంటలను ఆర్పివేసి సాయిఈశ్వర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయిఈశ్వర్ ప్రాణాలు కోల్పోయాడు.