– లారీ కాంట్రాక్టర్, పౌరసరఫరాల అధికారుల కుమ్మక్కు
– 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలించే యత్నం
– బియ్యం సరఫరా, దిగుమతి అంతా కాగితాల్లోనే
– విజిలెన్స్ అధికారుల అప్రమత్తతో లక్ష్మిపురం వద్ద చిక్కిన లారీ
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 05 : పేదలకు సర్కారు ఇచ్చే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు దొడ్డిదారిలో దోచుకుంటున్నారు. ఉచితంగా వచ్చే బియ్యమే కదా, అందులో సర్కారు బియ్యమే కదా అదే సర్కారు వాళ్లతో జతకడితే మనకు అడ్డు ఎవరూ ఉండరని లారీ కాంట్రాక్టర్ సివిల్ సైప్లె ఉద్యోగులతో చేతులు కలిపి 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను లారీలో తరలించి చివరికి విజిలెన్స్ బృందానికి చిక్కారు. పక్కదారి పట్టిన రేషన్ బియ్యంపై అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం ఐడీఓసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం మల్లూరు బఫర్ పాయింట్ నుండి ఈ నెల 2వ తేదీన పాల్వంచకు సరఫరా అయ్యే 300 క్వింటాళ్ల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్‌కు రావాల్సి ఉంది. అక్కడి నుండి రేషన్ షాపులకు వెళ్లాలి. కానీ ఈ లారీ మణుగూరులో బయల్దేరి ఎక్కడా ఆగకుండా నేరుగా బూర్గంపాడు మండలం లక్ష్మిపురం వద్దకు చేరింది.
కాని లారీ ఎటు వెళ్లిందనేది అధికారులకు తెలియడం కోసం ప్రతీ లారీకి జీపీఎస్ ను అమర్చుతారు. కాని అక్కడే మోసం జరిగింది. లారీ కాంట్రాక్టర్ లారీకు ఉన్న జీపీఎస్‌ను ఒక టూవీలర్ బైకుకు అమర్చాడు. జీపీఎస్ అమర్చిన బైక్ ద్వారా ఒక వ్యక్తి పాల్వంచలో బియ్యం దిగుమతి చేసే గోదాము వద్దకు వచ్చి అక్కడ ఉన్న గోదాము ఇన్చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను కలిసి వారి వద్ద లారీ దిగుమతి చేసినట్లు కాగితాలపై లెక్కలు రాసుకున్నారు. తర్వాత రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం కూడా రేషన్ షాపులకు చేరినట్లు కాగితాల్లో లెక్కలు రాసుకున్నారు. గోదాముకు బియ్యం లారీ రాలేదు. పల్సర్ బైక్‌పై వచ్చిన వ్యక్తిని అదే గోదాము గేటు వద్ద కాపలా వ్యక్తి ఆపడంతో అసలు గుట్టు రట్టయింది.
వెంటనే సమాచారం తెలుసుకున్న హైదరాబాద్ విజిలెన్స్ బృందం స్థానిక పౌర సరఫరాల అధికారులతో అక్కడకు చేరుకుని బైక్‌పై వచ్చిన వ్యక్తిని ప్రశాంత్ గా గుర్తించారు. ఇతను లారీ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తిగా తేలింది. రంగంలోకి దిగిన పౌర సరఫరాల బృందం స్టాక్ పాయింట్ లో ఉన్న ఇన్చార్జి, డేటా ఎంట్రీ ఆపరేటర్ వద్ద కీలక సమాచారాన్ని తీసుకుని లారీ వెళ్తున్న ప్రదేశాలను గుర్తించి బూర్గంపాడు మండలం లక్ష్మిపురం వద్ద ఆగి ఉన్న లారీను పట్టుకుని పాల్వంచ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. లారీ కాంట్రాక్టర్‌తో పాటు డ్రైవర్, బైక్‌పై ప్రయాణించిన వ్యక్తి ప్రశాంత్, పౌర సరఫరాల ఉద్యోగులపై ఫిర్యాదులు చేయగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. పాల్వంచ పోలీసుల విచారణలో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికి నాలుగు లారీల బియ్యాన్ని గతంలో లోడుకు రూ.50 వేలు ఇచ్చి తరలించినట్లు డ్రైవర్ ద్వారా తెలిసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ సమావేశంలో సివిల్ సైప్లె డీఎం త్రినాద్ బాబు, జిల్లా అధికారి ప్రేమ్‌కుమార్, విజిలెన్స్ అధికారులు అంజయ్య పాల్గొన్నారు.

Bhadradri Kothagudem : సినీ పక్కీలో రేషన్ బియ్యం లారీ మాయం