అధిక కాలుష్యం.. వ్యాయామ ప్రయోజనాలను దెబ్బతీస్తుందట. నిత్యం శారీరక శ్రమ చేసినా.. దీర్ఘకాలికంగా కాలుష్యానికి గురికావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదట. ఈ విషయాన్ని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. యూకే, తైవాన్, చైనా, డెన్మార్క్తోపాటు అమెరికా వంటి దేశాలలో వీరు ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా దశాబ్దానికి పైగా ట్రాక్ చేసిన సుమారు 15 లక్షల మంది డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా అందించిన నివేదికలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అధిక కాలుష్య ప్రాంతాలలో నివసించేవారికి, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే రక్షణ ప్రభావాలు తగ్గినట్లు వెల్లడించారు. వారానికి కనీసం రెండున్నర గంటలు వ్యాయామం చేసే వ్యక్తులు.. ఏదైనా ఆరోగ్య సమస్యతో మరణించే ప్రమాదం 30 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే, ఈ కేటగిరీలోని వ్యక్తులు.. అధిక కాలుష్యం ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే మాత్రం.. వారు చనిపోయే ప్రమాదం 40 నుంచి 45 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. ఇక అధ్యయనంలో భాగంగా గాలిలో సూక్ష్మకణ పదార్థాల స్థాయులనూ పరిశీలించారు.
2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన ‘పీఎం 2.5ఎస్’ అని పిలిచే చిన్న కణాలు ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తించారు. అతి సూక్ష్మమైన ఈ కణాలు ఊపిరితిత్తులలో చిక్కుకుని.. రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయట. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తాయట. ప్రపంచ జనాభాలో దాదాపు సగం (46 శాతం) మంది.. ఈ సూక్ష్మ కణాల ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు వెల్లడించారు. ఇక కలుషిత వాతావరణంలో చేసే వ్యాయామం.. పూర్తిస్థాయి ప్రయోజనం అందించదని అంటున్నారు.
గాలి నాణ్యతను మెరుగుపరిస్తేనే.. ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా, చలికాలంలో ఉదయపు వ్యాయామం పెద్దవాళ్లకు ఏమాత్రం మంచిదికాదని హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యతను తనిఖీ చేయడం, పరిశుభ్రమైన మార్గాలను ఎంచుకోవడం, కాలుష్యం ఎక్కువగా ఉండే రోజుల్లో వ్యాయామానికి విరమణ ఇవ్వడం.. ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి స్వచ్ఛమైన గాలి, శారీరక శ్రమ రెండూ ముఖ్యమైనవేనని అంటున్నారు.