– స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబుదాం
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 05 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రెండో విడత జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లందరూ విజయం సాధించాలని పిలపునిచ్చారు. శుక్రవారం పాల్వంచలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా బరిలో ఉన్నవారితో అయన మాట్లాడారు. గెలుపు కోసం కార్యకర్తలందరూ రాత్రింబవళ్లు సైనికుల వలె పనిచేసి పార్టీ బలపరుస్తున్నటువంటి సర్పంచులను, వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే తమందరి ధ్యేయం అన్నారు. ఈ క్రమంలో తన అండదండలు ఎల్లప్పుడు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల, పట్టణ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.