e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిందగీ బ్రిటన్‌లో లార్డ్‌ మేయర్‌..ఇందూరు చంద్రుడు!

బ్రిటన్‌లో లార్డ్‌ మేయర్‌..ఇందూరు చంద్రుడు!

బ్రిటన్‌లో లార్డ్‌ మేయర్‌..ఇందూరు చంద్రుడు!


విజిటింగ్‌ వీసాపై విదేశాలకు వెళ్లడం ఓ కల. పాశ్చాత్య దేశాల్లో మనవాళ్లు స్థిరపడటం కుటుంబానికి పెద్ద గౌరవం. పర్మినెంట్‌ వీసా దక్కించుకోవడం మహాదృష్టం. అలాంటిది, విదేశంలో కీలక పదవిని అలంకరిస్తే, ప్రథమ పౌరుడిగా ప్రజల జేజేలు అందుకుంటే.. అద్భుతం! మహాద్భుతం!!ఉపాధికోసం బ్రిటన్‌కు వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన డాక్టర్‌ చంద్ర కన్నెగంటి ఇలాంటి ఘనతనే సాధించారు. వైద్యునిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఆయన, అక్కడి ‘కన్జర్వేటివ్‌ పార్టీ’లో కీలక నేతగా ఎదిగారు. ‘స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌’ సిటీకి డిప్యూటీ మేయర్‌గా, ఆ తర్వాత లార్డ్‌ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. బ్రిటన్‌లో తెలంగాణ కీర్తి పతాక ఎగుర వేసిన ఇందూరు చంద్రుడ్ని ‘జిందగీ’ పలకరించింది.

అది 2002. ఉపాధి కోసం బ్రిటన్‌కు పయనమయ్యారు డాక్టర్‌ కన్నెగంటి చంద్ర. విమానం గాల్లోకి ఎగిరింది. కాక్‌పిట్‌ నుంచి వస్తున్న సూచనలేవీ చెవిన పడటం లేదు. మనసు చెబుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఓ మధ్య తరగతి తల్లిదండ్రుల త్యాగాల ఫలితమే ఈ ప్రయాణమని అతడికి తెలుసు. చంద్ర తండ్రి దామోదరరావు, తల్లి సరోజిని. దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి బ్యాంకులో చిరుద్యోగి. చాలీచాలని సంపాదన. అయినా, పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు. ముగ్గురు పిల్లల్లో చంద్ర రెండోవాడు. తన తక్షణ కర్తవ్యం ఒక్కటే.. ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలి.

నిమ్స్‌లో పీజీ

నిజామాబాద్‌లోని నిర్మల్‌ హృదయ పాఠశాలలో చంద్ర ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. తర్వాత కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. వివేకానంద సెంటినరీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. ప్రజ్ఞ్ఞ కళాశాలలో ఇంటర్‌ పూర్తయింది. తండ్రికొచ్చే జీతం రెండు వేలే! ముగ్గురు పిల్లలున్న కుటుంబం, పైగా నగర జీవనం. అడుగడుగునా ఆర్థిక ఆంక్షలే. వాటన్నిటినీ తట్టుకొని, ఎంసెట్‌ మెడిసిన్‌ విభాగంలో 500వ ర్యాంక్‌ సాధించారు చంద్ర. గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. తర్వాత, హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పీజీ సీటు దక్కించుకున్నారు. నిమ్స్‌లో ఉన్నప్పుడే బ్రిటన్‌కు వెళ్లాలన్న కోరిక కలిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా.. ప్రొఫెషనల్‌ లింగ్విస్టిక్‌ అసెస్‌మెంట్‌ బోర్డు (పీఎల్‌ఏబీ) పరీక్ష రాశారు. నూటికినూరు మార్కులు వచ్చాయి. బ్రిటన్‌కు పయనమయ్యారు. సూర్యాపేటకు చెందిన వైద్యురాలు సాయి ప్రవీణను చంద్ర ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు యథీన్‌, అమర్‌, జయచంద్ర.

వైద్యులకు అండ

బ్రిటన్‌లో చంద్ర ప్రస్థానం చిన్న ఉద్యోగంతో మొదలైంది. ‘ఇక్కడ ప్రతి ఏరియాకు ఒక డాక్టర్‌ ఉంటారు. ఆ ప్రాంత ప్రజల ఆరోగ్య బాధ్యతలు తనే చూసుకోవాలి. కొన్నాళ్లు ఆ విధుల్లో కొనసాగాను. తర్వాత జనరల్‌ ప్రాక్టిషనర్‌గా పనిచేశాను’ అని చెప్పుకొచ్చారు చంద్ర. స్థానికంగా పట్టు దొరికిన తర్వాత, వ్యాపారంపై దృష్టి పెట్టారు. హెల్త్‌ కాంట్రాక్ట్‌ బిడ్‌ వేయడం మొదలుపెట్టారు. ఆర్థికంగా పుంజుకోవడంతో మూడు హెల్త్‌కేర్‌ సెంటర్లు నిర్వహించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సేవా కార్యక్రమాలూ చేపట్టారు. బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌కు చైర్మన్‌గా కూడా ఎంపికయ్యారు. అసోసియేషన్‌ తరఫున డాక్టర్ల హక్కులు, సంక్షేమం కోసం పనిచేశారు. చీటికి
మాటికి వైద్యులను కోర్టులకు లాగడంపై ఉద్యమించారు.

బ్రిటన్‌లో లార్డ్‌ మేయర్‌..ఇందూరు చంద్రుడు!

అనూహ్య విజయాలు

క్రమంగా చంద్రకు అక్కడి రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. బ్రిటన్‌లో ఉండేవి రెండు రాజకీయ పార్టీలే. ఒకటి లేబర్‌ పార్టీ, మరొకటి కన్జర్వేటివ్‌ పార్టీ. అక్కడ స్థిరపడే విదేశీయులు సహజంగా లేబర్‌ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటారు. కానీ, చంద్ర మాత్రం కన్జర్వేటివ్‌ పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు అయ్యారు. పార్టీ తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. చంద్ర నిబద్ధతకు మెచ్చి, 2019 కౌన్సిల్‌ ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తను జనరల్‌ ప్రాక్టిషనర్‌గా చేసిన స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సిటీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సిటీ లేబర్‌ పార్టీకి కంచుకోట. ఎప్పుడూ ఆ పార్టీ ఓడిపోయిన దాఖలాలు లేవు. అందులోనూ తెల్లవాళ్లు అధికంగా ఉండే నియోజక వర్గం అది. లేబర్‌ పార్టీ తరఫున, స్థానిక ఎంపీ తన తల్లిని పోటీకి నిలిపారు. కానీ, చరిత్రను తిరగరాస్తూ ప్రజలంతా చంద్రకు మద్దతుగా నిలిచారు. 54 శాతం ఓట్లతో గెలిపించారు. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన జనరల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థన మేరకు చంద్ర ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. లేబర్‌ పార్టీ అభ్యర్థి చేతిలో 5,000 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సిటీ కౌన్సిల్‌కు డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా లార్డ్‌ మేయర్‌ పదవికి పోటీ చేసి.. 44 మంది ఉన్న కౌన్సిల్‌లో 25 మంది సభ్యుల మద్దతుతో విజయం సాధించారు. అలా, స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ ప్రథమ పౌరుడయ్యారు. హోదాలు పక్కన పెట్టి స్వయంగా శ్రమదానం చేస్తారు చంద్ర. లార్డ్‌ మేయరే వీధులు శుభ్రం చేస్తుంటే, తామూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ నగరాన్ని కడిగిన ముత్యంలా తీర్చిదిద్దుతున్నారు ప్రజలు.

అమ్మ వల్లే ఈ స్థాయికి

నేను ఈ స్థాయికి వచ్చానంటే.. అందుకు కారణం మా అమ్మ సరోజిని. మమ్మల్ని చదివించేందుకు అమ్మ పడిన కష్టం అంతా ఇంతా కాదు. చిన్నప్పుడు ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంది. మా చదువుల కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నేను బ్రిటన్‌కు రావడానికి కూడా అమ్మే కారణం. నిమ్స్‌లో పీజీ చేస్తున్న సమయంలో పీఎల్‌ఏబీ (ప్రొఫెషనల్‌ లింగ్విస్టిక్‌ అసెస్‌మెంట్‌ బోర్డు) పరీక్షకు తనే రూ.15 వేలు ఫీజు కట్టింది. స్వయంగా బ్యాంకుకు వెళ్లి డబ్బులు చెల్లించి రావడంతోనే, నేను పట్టుదలగా పరీక్ష రాసి అవకాశం దక్కించుకున్నాను. గత ఏడాది నాన్న మరణించారు. అన్నయ్య ఆనంద్‌ మోహన్‌ బ్రిటన్‌లోనే హెల్త్‌కేర్‌ కన్సల్టెంట్‌. అక్క కృష్ణవేణి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

జూపల్లి రమేశ్‌ రావు,నమస్తే తెలంగాణ ప్రతినిధి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్రిటన్‌లో లార్డ్‌ మేయర్‌..ఇందూరు చంద్రుడు!

ట్రెండింగ్‌

Advertisement