భారతదేశ యువతలో ఆందోళన, నిరాశ స్థాయులు నానాటికీ పెరుగుతున్నాయట. అనేక సమస్యలు చుట్టుముట్టి.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారట. దేశంలో ప్రతి గంటకూ కనీసం ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాతో పాటు వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
భారతదేశంలో 10 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న జనాభా 38 కోట్లు. అంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద యువత భారత్ సొంతం. అయితే, దేశ యువత శారీరకంగా, మానసికంగా అంత ఆరోగ్యంగా లేరన్నది పలు సర్వేల సారాంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. 2021లో భారతదేశ ఆత్మహత్య రేటు 1,00,000 మందికి 12.6గా ఉంది. ఇది ప్రపంచ సగటు 9.2 కంటే చాలా ఎక్కువ.
ఇక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-2022 నివేదిక ప్రకారం.. ఆ సంవత్సరంలో 13వేల మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో దాదాపు రెండువేల మంది.. పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా తనువు చాలించారు. ఈ సంఖ్య చదువు, పని, కుటుంబ జీవితం, సామాజిక అంచనాలతో నిండిన అతిపెద్ద వ్యవస్థాగత సమస్యను ప్రతిబింబిస్తున్నదని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, మనదేశ విద్యా వ్యవస్థ పరీక్షలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నది.
దాంతో, విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతున్నది. ఈ క్రమంలో ఫెయిల్ అయితే చాలామంది విద్యార్థులు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు. 2019 – 2023 మధ్య.. ఐఐటీలు, ఎన్ఐటీలు సహా.. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో 98 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఐఐటీ విద్యార్థులతో ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనూ.. 61% మంది తాము చదువుకు సంబంధించి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇక దేశంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగానే ఉన్నది. ఎవరికీ అంత సులభంగా ఉద్యోగాలు దొరకడం లేదు. దాని ఫలితంగా కలిగే నిరాశ.. నిరుద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. ఇది క్రమంగా ఆత్మహత్యకు దారితీస్తున్నది.
అంతేకాకుండా కెరీర్, వివాహం, ఆర్థిక బాధ్యతలు మొదలైన సామాజిక, కుటుంబ ఒత్తిళ్లు కూడా యువతలో ఆత్మహత్యలకు కారణాలుగా మారుతున్నాయి. యువత బలవన్మరణాల్లో దాదాపు 48% కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, వివాహ సంబంధిత ఇబ్బందులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతున్నది. ఈ క్రమంలో యువతలో నిరాశ నిస్పృహలు తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధ్యయనకారులు కోరుతున్నారు. ముఖ్యంగా.. వారిలో మానసిక ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. విద్య, కుటుంబ వ్యవస్థలతోపాటు ప్రజా సంబంధ సంస్థలు కూడా ఇందుకోసం పనిచేయాలని చెబుతున్నారు.