మనిషి బతకాలంటే.. ‘తిండి – నిద్ర’ అత్యవసరం. వీటిలోనూ కడుపు నిండా తిండికన్నా.. కంటి నిండా నిద్రే ముఖ్యం! లేకుంటే.. అనారోగ్యాల పాలవ్వడం ఖాయం! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇదే విషయం చెబుతున్నది. తాజాగా, ఆరోగ్యకరమైన నిద్రకు- గుండె ఆరోగ్యానికి మధ్య ఉండే సంబంధం గురించి ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుకు సంబంధించిన విషయాలను ‘కార్డియోవాస్కులర్ క్వాలిటీ అండ్ అవుట్ కమ్స్’లో ప్రచురించింది.
రాత్రిపూట ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? నిద్ర పట్టడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు? పగటిపూట ఎంతసేపు కునుకు తీస్తున్నారు? ఇలాంటి అంశాలన్నీ హృదయ సంబంధ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని ఈ సందర్భంగా పరిశోధకులు వెల్లడించారు. నిద్రతోపాటు శరీరంలో కొవ్వు శాతం, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటు సహా వివిధ ఆరోగ్య సమస్యలు – హృదయ సంబంధ రోగాలను పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లకు ప్రతిరోజూ రాత్రిపూట 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఇది ఎక్కువైనా.. తక్కువైనా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
రాత్రిపూట 7 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల గుండెలో దడ, కార్డియోమెటబాలిక్ సిండ్రోమ్ (టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం ఉండటం), రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అదే సమయంలో ఎక్కువ నిద్రకూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రాత్రిపూట 9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కార్డియోమెటబాలిక్ సిండ్రోమ్, ధమనులు గట్టిపడటం, పక్షవాతం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, రాత్రిపూట మాటిమాటికీ మెలకువ రావడం, రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొని ఉండటం, నిద్రాభంగం (ఎవరో ఒకరు నిద్ర లేపడం) లాంటివీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సోషల్ జెట్లాగ్ వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
అదే సమయంలో కాంతి, గాలి, శబ్ద కాలుష్యాలతోపాటు భద్రతలాంటి పర్యావరణ – సామాజిక అంశాలు కూడా నిద్ర ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయట. అందుకే, ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రాహారాలు మానేయడం మంచిదికాదని సూచిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా.. రాత్రిపూట తగినంతగా నిద్రపోవాలని చెబుతున్నారు.