Sai Dhansika | తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో అభిమానులకు దగ్గరైన అందాల నటి.. సాయి ధన్సిక. ఆ ముద్దుగుమ్మ ‘ఆహా’ ఓటీటీ వేదికగా ‘షికారు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నది. ఈ సందర్భంగా ధన్సిక ముచ్చట్లు..
అందరి జీవితాల్లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటన్నిటినీ సమర్థంగా దాటినప్పుడే మనమేమిటో ప్రపంచానికి తెలుస్తుంది. నా జీవితంలోనూ చాలా మలుపులు ఉన్నాయి. చిన్నప్పటినుంచీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ అంటే ఇష్టం. చూడ్డానికి టామ్‌బాయ్‌లా ఉండేదాన్ని. ఆ డేరింగ్ లుక్ వల్లే తొలి సినిమా అవకాశం వచ్చింది.
మాది తంజావూర్. కుటుంబంలో ఎవరూ పరిశ్రమలో లేరు. ఒకరిద్దరు దూరపు చుట్టాలు మాత్రం ఉన్నారు. ఒకసారి కుటుంబమంతా కలిసి ఓ సినిమా ఎగ్జిబిషన్‌కు వెళ్లాం. అక్కడ మా బంధువు నన్ను చూశారు. తాము తీయబోయే సినిమాలో చేయమని అడిగారు. నాకు నటన తెలియదు. ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. ముందు కాస్త తడబడినా ఓకే చెప్పాను. నా నిర్ణయాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించలేదు కానీ, బంధువుల నుంచి మాత్రం నిరసన వచ్చింది. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. చదువు మధ్యలో వదిలేసి సినిమాలేమిటని కోప్పడ్డారు. తొలిచిత్రం ‘పెరన్మై’ తర్వాత నాకెందుకో సినిమాలే నా భవిష్యత్తు అని అనిపించింది. దీంతో చదువు మానేసి వెండితెరపై దృష్టిపెట్టా.
‘కబాలి’.. ఎన్ని సినిమాలు చేసినా నా జీవితంలో ప్రత్యేకంగా నిలిచే చిత్రం. రజనీకాంత్ సర్‌తో కలిసి నటించడం నిజంగా అదృష్టం. ఆయన ఓ లైబ్రరీలాంటి వారు. ఓ విద్యార్థిలా చాలా విషయాలు నేర్చుకున్నా. ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించా. నేరుగా తెలుగులో చేసిన సినిమా ‘షికారు’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా మీ ముందుకు రాబోతున్నా. ఈ సినిమా కథ విన్నప్పుడు కచ్చితంగా అందరికీ నచ్చుతుందని అనిపించింది. ఒక సాధారణ మహిళ జీవితాన్ని మంచి కథగా మలిచారు. కామెడీ ఓరియెంటెడ్‌గా తెరకెక్కించారు. త్వరలోనే మీతో ‘షికారు’ చేయడానికి వస్తున్నా.. సిద్ధమేనా?
ఆహారం ఏదైనా ఇష్టంగా తింటా. ఎక్కడికి వెళ్లినా స్థానిక రుచుల్ని ఆస్వాదిస్తా. హైదరాబాద్‌లో రాగిసంగటి, ఉలవచారు బాగా నచ్చాయి. నాకు చైనీస్ ఫుడ్ ఇష్టం. రోజూ ఉదయాన్నే తప్పకుండా వర్కవుట్ చేస్తా. ఫిట్‌గా ఉండాలంటే కష్టపడకతప్పదు. అయితే, తిండి విషయంలో మాత్రం మొహమాటపడను. ప్యారిస్ వెళ్లాలనేది నా కోరిక. వరల్డ్ టూర్ ఆలోచనలూ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నా. తమిళంలో ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. యాక్షన్, కమర్షియల్ చిత్రాల్లో నటించాలని ఉంది. నాకు డైరెక్టర్ రాజమౌళి గారంటే ఇష్టం. ఆయన డైరెక్షన్లో నటించాలని కోరిక. మహేశ్‌బాబు అంటే ప్రత్యేక అభిమానం. హీరోయిన్లలో సాయిపల్లవి నటన ఇష్టం.
…✍ ప్రవళిక వేముల
Rashmika Mandanna | తొలిసారి ఢిల్లీకి రష్మిక..ఈ విజిట్ చాలా స్పెషలట