సోమవారం 01 మార్చి 2021
Zindagi - Jan 17, 2021 , 00:25:49

ముందు కథ..తర్వాతే హీరో!

ముందు కథ..తర్వాతే హీరో!

ఒకప్పుడు ‘ఒకే ఒక్క చాన్స్‌' కోసం ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాడు.  ఏండ్ల తరబడి స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఇప్పుడు ఆయన డేట్స్‌ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.  ఎంతోమంది కొత్తవారికి తన సినిమాల్లో అవకాశమిస్తున్నాడు. ఆ దర్శకుడు, నటుడు మరెవరో కాదు.. సముద్ర ఖని. సహజత్వం, విలక్షణత కలబోసిన అభినయంతో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా సామాజిక ఇతివృత్తాలతో సినిమాల్ని తెరకెక్కిస్తూ  సృజనాత్మకతను చాటుకుంటున్నాడు.  సముద్ర ఖని ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ..

నటుడిని అవ్వాలనే సంకల్పంతో పదో తరగతి కాగానే 1987లో చెన్నై వెళ్లా. ఇండస్ట్రీలో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. బస్‌ కండక్టర్‌ను అడ్రస్‌ అడిగి ఓ స్టూడియో ముందు దిగా. వారం రోజులపాటు స్టూడియోల చుట్టూ తిరిగాను. అప్పటికి గానీ, అవకాశాలు రావడం సులభం కాదని అర్థం కాలేదు. ఇక లాభం లేదనుకొని మళ్లీ మా ఊరికి వెళ్లిపోయి చదువు కొనసాగించా. గణితంలో బీఎస్సీ చేసి.. ఐదేండ్ల తర్వాత 1992లో మళ్లీ చెన్నై వెళ్లిపోయా. ఫొటో ఆల్బమ్స్‌ పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ రౌండ్స్‌ కొట్టడం మొదలుపెట్టా. అప్పుడూ అవకాశాలు రాలేదు. చీత్కారాలు తప్ప.. ఆదరించిన వాళ్లు లేరు. సినిమాలపై ఉన్న ఇష్టంతో అన్నీ భరించా.

తలరాత మార్చిన.. రాత

నా చేతిరాత చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసి దర్శకుడు సుందర్‌ నాకు కాపీరైటర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. నటుడిగా నిలదొక్కుకోవడం కష్టమని తేలిపోవడంతో.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాపీ రైటర్‌ పని చేయడానికి అంగీకరించా. ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్‌ గారితో పరిచయం ఏర్పడింది. ఆయన రూపొందించిన పలు సీరియల్స్‌కు సహాయకుడిగా పనిచేశా. ఆయన ప్రోద్బలంతోనే ‘అన్ని’ అనే సీరియల్‌కు మొదటిసారి దర్శకత్వం వహించా. ఆ సీరియల్‌ నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. తొలినాళ్లలో నన్ను అవమానించిన వారే ఆ తర్వాత నన్ను సాయమడిగారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నటి రాధిక బుల్లితెరపై రూపొందించిన గేమ్‌షోలకు దర్శకత్వం వహించాను. ఈ గేమ్‌షోలకు నాకు అసిస్టెంట్స్‌గా పనిచేసిన వారంతా.. ఇప్పుడు బుల్లితెరపై అగ్రస్థానంలో ఉన్నారు.

దర్శకుడిగా తొలి అవకాశం

2003లో ‘ఉన్నై చరణదయ్యిందే’ అనే సినిమాతో దర్శకుడిగా వెండితెరపై అరంగేట్రం చేశా. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. రచయితగా నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టింది. కానీ, ఆ సక్సెస్‌ ఇచ్చిన ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు. రెండో చిత్రం పరాజయం పాలు కావడంతో నాలోని తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనతో దర్శకుడు అమీర్‌ దగ్గర ‘పరత్తివీరన్‌' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. నా కథల్లో ఉండే సున్నితత్వాన్ని మార్చుకుంటూ మాస్‌ కోణంలో ఎలా రాసుకోవాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆ అనుభవం అనేక పాఠాలు బోధించింది.

‘అప్పా’ రీమేక్‌


నటనతో పోలిస్తే దర్శకత్వమే ఎక్కువగా సంతృప్తినిచ్చింది. నాలోని సృజనాత్మకతను పరిపూర్ణంగా వినియోగించే అవకాశం డైరెక్షన్‌లోనే దొరుకుతుంది. ఖాళీగా ఉండటంనాకు  నచ్చదు. సెట్స్‌లో విరామం దొరికితే కథలు రాసుకుంటా. ప్రస్తుతం తెలుగులో ‘అయ్యప్పానుమ్‌ కోషియమ్‌' రీమేక్‌తో పాటు ‘ఆకాశవాణి’ సినిమాలు చేస్తున్నా. తమిళంలో నేను దర్శకత్వం వహించిన ‘అప్పా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచన ఉంది.  ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌ నిర్మించబోతున్నారు. ఆ తర్వాత ‘అప్పా’కు సీక్వెల్‌ చేస్తా.

సుబ్రహ్మణ్యపురంతో నటుడిగా..

దర్శకుడిగా కుదురుకున్న తర్వాత కూడా.. నటుడిగా నన్ను నేను తెరమీద చూసుకోవడానికి పదహారేండ్లు పట్టింది. బుల్లితెరపై గేమ్‌షోలతో బిజీగా ఉన్న సమయంలో తమిళంలో ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకోసం దర్శకుడు శశికుమార్‌ నన్ను సంప్రదించారు.  దర్శకుడిగా మంచి పేరు వస్తున్న తరుణంలో నటనవైపు వెళ్లడం కరెక్ట్‌ కాదనిపించింది. ‘నటుడవ్వడం సులభం కాదు. దేవుడి ఆశీస్సులు, అదృష్టం ఉంటేనే అవకాశాలు వరిస్తాయి. మంచి సినిమా కాబట్టి ఏం ఆలోచించకుండా ఒప్పుకో’ అని సీనియర్‌ నటి లక్ష్మి, ఆమె భర్త సలహా ఇవ్వడంతో ఓకే చెప్పాను. ఆ సమయంలో నా అకౌంట్‌లో రెండేండ్లపాటు కుటుంబాన్ని పోషించుకోవడానికి సరిపడా డబ్బులున్నాయి. అవి ఖర్చయ్యేలోపు నటుడిగా చిత్రసీమలో నిలదొక్కుకోవాలనుకున్నా. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా హిట్టవ్వడంతో నటుడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇమేజ్‌ పట్టింపులు లేవు

రోల ఇమేజ్‌లకు అనుగుణంగా కథలు రాయడం నాకు రాదు. కథ సిద్ధమయ్యాకే హీరోల గురించి ఆలోచిస్తా. నటుడు, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా ‘అప్పా’ అనే సినిమా చేశా. ఆ కథతో సినిమా చేయాలని చాలామంది నిర్మాతల్ని కలిశా. ఎవరూ ముందుకు రాకపోవడంతో నటుడిగా నేను సంపాదించుకున్న డబ్బులతో సొంతంగా సినిమా నిర్మించా. తెలుగులో కూడా ‘నాలో’ అనే సినిమాకు దర్శకత్వం వహించా. కానీ, అది విడుదల కాలేదు. ఆ తర్వాత తమిళంలో నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌'ను తెలుగులో రవితేజతో ‘శంభో శివ శంభో’గా తెరకెక్కించా. 

లాక్‌డౌన్‌లో కుటుంబంతో..

లాక్‌డౌన్‌ సమయంలో, గతంలో మిస్సయిన సినిమాలన్నీ చూశా. కొత్త కథలు రాసుకున్నా. మూడు నెలల తర్వాత ఆ పనులు బోర్‌ కొట్టడంతో పక్కనపెట్టేసి కుటుంబంతో సంతోషంగా సమయాన్ని ఆస్వాదించా. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి లెవెన్త్‌ స్టాండర్డ్‌ , పాప ఏడో తరగతి. బిజీలైఫ్‌ కారణంగా కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. లాక్‌డౌన్‌తో ఆ లోటు తీరింది. 

సామాజిక ఇతివృత్తాలతో..

రచయితగా, దర్శకుడిగా సామాజిక ఇతివృత్తాల్ని వెండితెరపై ఆవిష్కరించడానికి ఇష్టపడుతా. సమకాలీన సమాజంలో జరిగే సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ కథల్ని రాసుకుంటా. నా ప్రతి కథలో ఏదో ఒక సందేశం ఉండేలా జాగ్రత్తపడుతా. ప్రస్తుతం విద్యావ్యవస్థ నేపథ్యంలో ఓ కథ రాస్తున్నా. ఇతర దర్శకులతో పనిచేస్తున్నప్పుడు వారికి ఎలాంటి సలహాలూ ఇవ్వను. నాలోని దర్శకుడిని ఇంట్లోనే వదిలిపెట్టి, కేవలం ఓ నటుడిగానే సెట్స్‌లోకి వస్తా. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేస్తా. వారి పనిలో జోక్యం చేసుకోను.

దర్శకుడిగా నాపై బాలచందర్‌ ప్రభావం చాలా ఉంది. కథను తయారుచేసుకునే విధానం, పాత్రల రూపకల్పన.. ఇలా ప్రతీ అంశం ఆయన దగ్గరే నేర్చుకున్నా. ‘నటీనటుల్లోని మైనస్‌ పాయింట్లేమిటో మొదట తెలుసుకో. అది తెలిస్తేనే వారిలోని ప్లస్‌లను స్క్రీన్‌పై ఆవిష్కరిస్తూ మంచి సినిమా చేయగలుగుతావు’ అని  ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ విషయాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటా. అలాగే ‘ఫలితం గురించి ఆలోచించకుండా కష్టపడు. అదే ఏదో ఒకరోజు నీకు పేరు తెచ్చిపెడుతుంది’ అనేవారు నాతో. ఆ మాట నిజమవ్వడం ఆనందంగా ఉంది. ఆయన నుంచే క్రమశిక్షణ అలవడింది. షూటింగ్‌ ప్రారంభానికంటే పది నిమిషాల ముందు బాలచందర్‌గారు సెట్స్‌లో ఉండేవారు. ఇప్పటికీ నేను అదే సమయపాలన పాటిస్తున్నా.

‘ఆర్‌ఆర్‌ఆర్‌' తొలి సినిమా

తెలుగులో తొలుత ‘ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాను అంగీకరించా. కానీ, ‘అల వైకుంఠపురములో’ నా మొదటి తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం. త్రివిక్రమ్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయన్ని గురువుగా భావిస్తాను. ‘అల వైకుంఠపురములో’ సినిమా గురించి చెప్పి ‘చిన్నదే అయినా నీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు. ఆయన అడగటంతోనే వెంటనే అంగీకరించా. రాజమౌళితో పదకొండేండ్లుగా పరిచయముంది. నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌' సినిమా చూసి, ఫోన్‌ చేసి ప్రశంసించారు. తాజాగా విడుదలైన ‘క్రాక్‌' చిత్రంలోనూ మంచి పాత్ర పోషించా.

VIDEOS

logo