Rasamayi Balakishan | తెలంగాణ ఉద్యమంలో ఒక భాగమైన ‘ధూం ధాం’ మళ్లీ గజ్జె కడుతున్నది. ఆటపాటలతో తెలంగాణవాదాన్ని వాడవాడకూ తీసుకెళ్లిన ‘ధూం ధాం’ మరోసారి గొంతు సవరించుకుంటున్నది. సమైక్యకాలం నాటి దుర్భర ఛాయలు మళ్లీ కనిపిస్తుండటంతో వాటిని సమూలంగా పాతరేసేందుకు, దగాపడ్డ చెల్లెళ్ల ఆశలు నిలబెట్టేందుకు, కల్లంలో గింజలున్నా.. పళ్లెంలో మెతుకులేని రైతన్నల వెతలు బాపేందుకు, బతుకమ్మను మన నుంచి విడదీసే కుట్రను బయటపెట్టేందుకు, సాంస్కృతిక విధ్వంసానికి అడ్డుకట్ట వేసేందుకు తన పోరాటం అంటున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు రసమయి బాలకిషన్. మార్పు పేరిట తెలంగాణను అరిగోస పుచ్చుకుంటున్న కాంగ్రెస్‌ను ప్రశ్నించడానికి రాష్ట్రవ్యాప్తంగా ‘ధూం ధాం’ నిర్వహిస్తానని అంటున్నాడు. చార్సౌబీస్ హామీలిచ్చి మాట తప్పినోడిపై.. మడమ తిప్పని పోరాటం చేస్తానంటున్న రసమయి బాలకిషన్ ‘జిందగీ’తో పంచుకున్న ‘ధూం ధాం’ ముచ్చట్లు..
ఉద్యమ కాలం నుంచి తెలంగాణతో మమేకయ్యారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి మార్పులు గమనించారు? రాష్ట్రంలోని ప్రజలు ఆశలు వదులుకున్నారు. ‘నమ్మి నాన బోస్తే.. పుచ్చి బుడాలైనట్లు’ ఉంది రాష్ట్రంలో పరిస్థితి. అందుకే ‘నమ్మి నానబోస్తే’ అని షార్ట్‌ఫిల్మ్ తీశాం. ప్రజలు ఏమనుకుంటున్నారో అవే చెప్పాం. ‘మోసపోయి గోస పడుతున్నాం’ అని అందరూ బాధపడుతున్నారు. ‘పాలిచ్చే బర్రెను వదిలేసి, తన్నే దున్నపోతును తెచ్చుకున్నామ’ని ఆవేదన చెందుతున్నారు. నేను ఏ ఇంటికి పోయినా.. ఇవే కథలు, ఇవే వెతలు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై అబద్ధాలను ప్రజల్లో ఎండగట్టేందుకే మళ్లొక పోరాటం చేయాల్సిన అవరసమొచ్చింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎలా ఆవిర్భవించిందో.. అలాగే 2002లో సెప్టెంబర్ 30న ‘తెలంగాణ ధూంధాం’ను ఏర్పాటుచేశాం. స్వరాష్ట్ర సాధన కోసం విభిన్నమైన కళాకారులను ఒక వేదికమీదకు తీసుకొచ్చాం. ఆటాపాట నిషేధించిన రోజుల్లో కూడా ‘ధూంధాం’ రాష్ట్రమంతా మార్మోగింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆకాంక్షలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. పదేండ్లపాటు వందేండ్ల అభివృద్ధి చూసి, గడిచిన ఏడాదిగా వేళ్లూనుకుంటున్న నాటి ‘సమైక్య’ పరిస్థితులు చూడలేక మళ్లీ గజ్జె కడుతున్నాం. ‘ధూంధాం’ పోరాట పంథాలోనే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాం.
తెలంగాణ ఏర్పాటే ‘ధూంధాం’ లక్ష్యంగా ఉండేది. గతంలో ‘పండగేడిది పబ్బమేడిది? తల్లి పిల్లలనక, అయ్యో పొద్దుబాపు కష్టమని, మక్కజొన్నలాంటి మట్టిపాటలేడివి?’ అని, ‘చేదానమేడుందిరా తెలంగాణ చేలన్నీ బీడురా’ అంటూ కన్నీళ్ల పాటలు పాడుకున్నం. ‘ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ.. బొంబాయి పోతుండు’ అనే వలస పాటలు ఎత్తుకున్నం. కేసీఆర్‌గారి పోరాట దీక్షతో తెలంగాణ కల సాకారమైంది. వారి నాయకత్వంలో దశాబ్దాల గోస తీరింది. నాడు ఆవేదనతో పాడుకున్న పాటలను మర్చిపోయేలా వారి పాలన సాగింది. పదేండ్లలోనే ఊహించని మార్పు చోటుచేసుకుంది. ఎక్కడ చూసినా పల్లెపల్లెనా పచ్చని చేన్లు.. నిండుగా కుంటలు, చెరువులు, నీళ్ల నిండా చేపలు, ప్రాజెక్టులు, చేన్లలో పుట్లకొద్ది ఒడ్లు యావత్ తెలంగాణ ఇవే దృశ్యాలు కనిపించాయి. కానీ, ఏడాదిలోనే అంతా తలకిందులైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిరంకుశ వైఖరి, సమైక్యవాదన వల్ల మళ్లీ పాతకాలం నాటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మా ధూంధాం.
మాకు గ్యారెంటీలు కావాలని, 420 హామీలు ఇవ్వాలని, రుణమాఫీ చేయమని ప్రజలు కోరలేదు. అన్నీ రేవంత్‌రెడ్డే చెప్పిండు. కానీ, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచేయడం చేతగాక.. కొత్తకొత్త వాగ్దానాలు చేస్తున్నడు. ఏడాదిగా ప్రజలను మభ్యపెట్టడంతో పాటు, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నడు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అలాంటిదే. తెలంగాణను మళ్లీ ఆకలి చావుల దిశగా తీసుకుపోతున్నడు!
ఏ ప్రజల కోసమైతే ఆ రోజు ‘తెలంగాణ ధూంధాం’ నిర్వహించామో.. అదే ప్రజల కోసం, తెలంగాణను తిరిగి కాపాడుకోవడం కోసం మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ‘ధూంధాం’ నిర్వహిస్తం. ఇదేమీ అక్కసుతో చేస్తున్నది కాదు. ఏడాదిలోనే శాంతిభద్రతలు అదుపు తప్పాయి, లాఠీచార్జీలు పెరిగాయి, లగచర్ల, దిలావస్పూర్ తిరుగుబాటు, రైతులకు సంకెళ్లు వేసి తీసుకుపోయేటంత దుర్భర పరిస్థితుల్లోకి తెలంగాణను నెట్టారు నేటి పాలకులు. రుణమాఫీ కాక, రైతుభరోసా లేక, ఒడ్లు కొనే నాథుడు రాక రైతులు అల్లాడుతున్నరు. ఇంతకంటే ఘోరమైన, అమానుషమైన ఘటనలు ఎన్నో ఉన్నయ్. కాంగ్రెస్‌ను ఎన్నుకొని ప్రజలు పడుతున్న గోసను ఊరూవాడా వినిపిస్తం.
పాలకుల వెనుక బానిస కవులు ఉంటే ఇలాంటివే జరుగుతాయి. అసలైన వారికి న్యాయం జరగదు. ఈ ముఖ్యమంత్రికి ఉద్యమ చరిత్ర లేదు. ఆయనకేం తెలుస్తుంది? ఆ ఎంపికకు ఏ కొలమానమో తెలియదు. రేవంత్‌రెడ్డి అనే వ్యక్తి మా అసొంటి ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన పనిలేదు. నన్ను ప్రజలు గుర్తించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా సేవ చేసే భాగ్యం కల్పించారు. కేసీఆర్ గారి నిర్ణయం మేరకు వందలాది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాం. ప్రజాభిమానం ముందు.. రేవంత్‌రెడ్డి ఇచ్చే అవార్డులు, రివార్డులు అవసరం లేదు. నేను ప్రజల్లోకి వెళ్తే.. ‘ఓ పాట పాడు బిడ్డా’ అని అంటారు. అదే నా గుర్తింపు.
నిజమైన ఉద్యమకారులెవరూ వాటిని స్వీకరించరు. ‘నువ్వేంది గుర్తించేది’ అని ఆయన తిరస్కరించిండు. ముఖ్యమంత్రి కోసం, పైసల కోసం పాటలు రాయలేదని, తెలంగాణ ఆకాంక్ష కోసం రాశానని ధైర్యంగా చెప్పిండు. కాంగ్రెస్ ఆస్థాన కవులు అని ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించాల్సింది. ప్రజలు కూడా ఆ పేర్లను చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది పాటలు పాడినోళ్లు ఉన్నారు. గద్దర్, విమలక్క, జయరాజ్, అందెశ్రీ లాంటి వారికి ‘ధూంధాం’ ఒక వేదికైంది. మలివిడత ఉద్యమంలో సాంస్కృతిక సారథిగా నిలిచింది. ‘ధూంధాం’ ద్వారా వారందరినీ ప్రజల్లోకి తీసుకెళ్లాం. వాళ్లనూ, వారి పాటలనూ నిలబెట్టాం. కానీ, ఆ వేదికను నిలబెట్టిన వారిని గుర్తించలేకపోతున్నారు.
ఓ మూర్ఖుడు, తెల్విలేని కాంగ్రెస్ నాయకుడు.. ‘తెలంగాణలో బతుకమ్మను పెత్తందార్లు, దొరసానులు ఆడతారు’ అని అంటున్నడు. అదీ కాంగ్రెస్ వాళ్ల అహంకారం. రెండ్రోజులు పోతే.. ‘బతుకమ్మ ఇక్కడి పండుగ కాదు.. ఇక్కడ ఆడరు’ అని చెబుతారు. ఆ కుట్ర కూడా జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన బతుకమ్మను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం.
ఉద్యమ బాటలో, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో 2006లో తెలంగాణ తల్లిని రూపొందించుకున్నం. ప్రజల కోరిక మేరకు, మేధావుల సూచనలతో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రజలంతా ఊరూరా ఆ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నరు. ఆ తల్లిని అవమానిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేయడం దారుణం. ఈ కొత్త విగ్రహంలో బతుకమ్మను తీసేసి మొండిచేయి పెట్టి, కొలవండ్రా అంటే.. కొంతమంది అర్భక కవులు, మూర్ఖులు, పెద్దకవి అనుకునేటోళ్లు ఏవేవో చెబుతున్నరు. అవార్డుల కోసం తెలంగాణ బతుకును, మన బతుకమ్మను వక్రీకరించి, తల్లిని అవమానిస్తున్నరు.
డిసెంబర్ 9 సోనియాగాంధీ పుట్టినరోజు. ఆమె బర్త్‌డే తర్వాతనే మలివిడత ఉద్యమంలో మరణాలు మొదలయ్యాయి. అదే రోజు తెలంగాణ ఇస్తామని చిదంబరం ప్రకటించారు. ఆ మాట వెనక్కి తీసుకోవడం వల్లే వెయ్యిమందికిపైగా తెలంగాణ బిడ్డలు బలవన్మరణం పాలయ్యారు. ఉద్యమంలో ‘జై తెలంగాణ’ అనని పార్టీ కాంగ్రెస్. అనేకమంది ప్రాణాలు పోవడానికి మూల కారణం కాంగ్రెస్. తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న ఆ పార్టీ.. దొడ్డిదారిన డిసెంబర్ 9న ఉత్సవాలు జరపడం హేయం.
తెలంగాణ సంస్కృతిపై జరిగిన దాడి గురించి పాటలు పాడితే.. మన బిడ్డలు నిజం చెప్పావని అభినందించారు. కొందరు సమైక్యవాదులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. సమైక్య పాలకులను, ఆంధ్రా పెట్టుబడిదారులను పాటలతోనే ప్రశ్నించాం. ఆనాడే బెదిరింపులకు, అరెస్టులకు వెరవలేదు. ఇప్పుడెందుకు భయపడతాం? బయటోడు ద్రోహం చేస్తే.. తరిమికొట్టినం. ఇక్కడోడు ద్రోహం చేస్తుండు.. ఈడనే బొందవెడ్తం. కాళోజీ కలం సాక్షిగా.. ‘ధూంధాం’ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తం. తెలంగాణను దోపిడీ చేస్తూ, మన బతుకులను చిన్నాభిన్నం చేస్తున్న వారిని ఇక్కడ పాతిపెట్టే వరకూ మా ఆటా, పాటా ఆగవు.
పాటలనే తూటాలుగా, అక్షరాలనే ఆయుధాలుగా.. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో ‘ధూంధాం’ దుమ్మురేపింది. ఇప్పుడు అదే అస్త్రంతో ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. మరో మార్పు కోసమే ఈ ప్రయత్నం. గతంలో ‘అయ్యోనివా నువ్వు అవ్వోనివా.. తెలంగాణనోనికి తోటి పాలోనివా?’ అని ఎట్ల ప్రశ్నించినమో.. ఆరు గ్యారెంటీలపై, 420 హామీలపై రేవంత్‌రెడ్డిని నిలదీస్తాం. రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం, రైతు భరోసాపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఉత్తముచ్చటని తేలిపోయింది. ఎక్కడికి వెళ్లినా ‘అన్ని ఉత్తయే.. అన్ని ఉత్తయే’ అని ప్రజలు చెబుతున్నరు. ఆ మాటల్లోంచి కట్టిందే ‘అన్ని ఉత్తయే’ అన్న పాట. తెలంగాణను కాపాడుకోవడం కోసం.. మరిన్ని కళారూపాలతో ప్రజల్లోకి వెళ్తాం.
విత్తు ఒక్కటైతే.. చెట్టు ఇంకోటైతదా? గతంలో ‘మా నాయన పోలీసు పటేల్.. మేము భూస్వాములం, మాకు అన్నీ ఉన్నాయి’ అని సీఎం చెప్పాడు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఇప్పుడు వీడియో గేమ్ ఆడినట్లు బూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తూ.. రాక్షసానందం పొందుతున్నాడు. ఆయనకు అదో సరదా. ‘రక్తం పారంది ఎన్నడో నా తెలంగాణలో.. నేలకు రాలందెన్నడో నా తెలంగాణలో’ అని పాట పాడాం. అవార్డు అందుకున్న అర్భక కవి ఈ బూటకపు ఎన్కౌంటర్లపై ఏం రాస్తడు? అవార్డు అందుకోగానే ఆయన రాసిన రక్తపు మరకల రాతలన్నీ మాయమైనయేమో! ‘రాజ్యహింస పెరుగుతున్నాదో’ అనే పాటలు ఇప్పుడేం గావాలె? ఈ ఎన్కౌంటర్లకు ఏమని సమాధానం చెప్పాలె?