e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides ముండ్రాయి మాలక్ష్మి!

ముండ్రాయి మాలక్ష్మి!

ముండ్రాయి మాలక్ష్మి!

ఆ ఊరికెళ్తే, ఇంటింటా సిరిదేవిని దర్శించుకోవచ్చు. ఆ గ్రామ ప‌డడుతు క‌ష్టాన్ని న‌మ్ముకున్న ధైర్య ల‌క్ష్ములు, పొలం పనుల్లో చెమ‌టోడ్చే ధాన్య ల‌క్ష్ములు, ప‌శుసంత‌తితో తుల‌తూగ సంతాన ల‌క్ష్ములు, కుట్టు మిష‌న్‌తో కుస్తీప‌ట్టే విజ‌య ల‌క్ష్ములు. ఇలా ఇంతులంతా కాయకష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మహిళా సంఘాలద్వారా అందుకున్న రుణాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. తీరొక్క వ్యాపారాలతో సంఘటిత శక్తిని చాటుతున్నారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి గ్రామ మహిళలు.


పద్మ, హసీనా, కనకవ్వ, ప్రశాంతి.. ఇంకా ఎందరో వేలమందికి ఆదర్శం అవుతున్నారు, లక్షలమందికి కొత్త లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఆర్థికంగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఊరిరాతనే మార్చేశారు. ముండ్రాయి గ్రామాన్ని సిరిసంపదలకు నెలవుగా తీర్చిదిద్దారు. గ్రామంలో మొదట్లో 180 మంది సభ్యులతో గ్రామైక్య సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పదినుంచి పదిహేనుమంది సభ్యులతో చిన్న చిన్న బృందాలుగా విభజించుకున్నారు. పొదుపు మంత్రం పఠిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రభుత్వం అందించిన రుణాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక సాధికారత సాధించారు. సాటి మహిళల ఎదుగుదలను చూసి గ్రామంలోని మిగతా స్త్రీలూ జట్టు కట్టారు. అలా, గ్రామైక్య సంఘ సభ్యుల సంఖ్య 465కు చేరింది.

రూ.42 లక్షల టర్నోవర్‌
ఈ సభ్యుల్లో నిరుపేదలున్నారు. కూలీనాలీ చేసుకునే నారీమణులూ ఉన్నారు. తమ జీవితాల్లో ఎప్పటికైనా వెలుగు రాకపోదా అని ఎదురుచూస్తున్నవాళ్లే అందరూ! సమైక్య సంఘం వారి జీవితాలకు కొత్త దిశను నిర్దేశించింది. దశనే మార్చేసింది. సభ్యులంతా కష్టసుఖాలు మాట్లాడుకోవడానికి ప్రతినెలా 12వ తేదీన సమావేశం అవుతారు. ఎన్ని పనులున్నా 36 సంఘాల సభ్యులూ వస్తారు. ఆ నెల పొదుపెంత? అప్పులెన్ని? ఖర్చులెన్ని? ఇలా ప్రతి అంశంపై చర్చిస్తారు. ఇంటి ఖర్చులకు అడిగితే మాత్రం అస్సలు ఇవ్వరు. వ్యాపార అభివృద్ధికి మాత్రం తక్షణం రుణం మంజూరు చేస్తారు. ఇప్పటికే ఒక్కో గ్రూప్‌ బ్యాంకు ద్వారా 7.50 లక్షలు, స్త్రీ నిధిద్వారా రూ.1.50 లక్షలు, గ్రామైక్య సంఘం ద్వారా మరో రూ.2.50 లక్షల రుణాన్ని పొందాయి. ఈ మొత్తాన్ని వాళ్లు సొంతకాళ్లపై నిలబడేందుకు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు. కొందరు పాడి పశువులు కొనుగోలు చేసి పాలవ్యాపారం మొదలు పెట్టారు. మరికొందరు కిరాణ దుకాణాలు, పిండి గిర్ని, హోటల్‌, చికెన్‌ సెంటర్‌, బొటిక్‌.. ఇలా రకరకాల వ్యాపారాల్లో స్థిరపడ్డారు. వచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు ముండ్రాయి మహిళలు. అంతా కలిసి ఏడాదికి సుమారు రూ.42 లక్షల టర్నోవర్‌ సాధించడం విశేషం. ఈ అద్భుత విజయానికిగాను జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామైక్య సంఘం పురస్కారాన్ని అందుకున్నారు.

ఒకరికి అందరూ
ఆర్థికంగా ఎదగడమే కాదు, దూరదృష్టితో బీమా అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారు సంఘ సభ్యులు. 2013లో గ్రామైక్య కార్యదర్శి ప్రమాదవశాత్తు చనిపోయారు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. ఇలాంటి దుస్థితి తమకే ఎదురైతే ఎలా? అని ఆలోచించారు. అప్పటికప్పుడు సమావేశమై సంఘంలోని సభ్యులు ఎవరైనా చనిపోతే, తక్షణ సాయం అందించేలా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పొదుపు పైకంతో సంబంధం లేకుండా ప్రతి నెలా ప్రత్యేకంగా రూ.20 చెల్లించాలని తీర్మానించారు. సభ్యురాలు చనిపోతే, కుటుంబానికి రూ.20వేలు అందిస్తున్నారు. సభ్యురాలి భర్త కన్నుమూస్తే రూ.10వేలు సాయం చేస్తున్నారు. అంతేకాదు, అనారోగ్యం పాలైన సభ్యులకు దవాఖాన, ఇతర ఖర్చుల కోసం తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తున్నారు. వైద్యం కోసం తీసుకున్న రుణాన్ని నెలకు రూ.500 చొప్పున సంఘానికి తిరిగి చెల్లించేలా నియమం పెట్టుకున్నారు. గతంలో నిరుపేదల ఆకలి తీర్చడానికి ఈ సభ్యులంతా తలా పిడికెడు బియ్యం దానం చేసేవారు. ఇప్పుడు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హరితహారంలో మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతనూ భుజానికెత్తుకొన్నారు. మహిళలు చేతులు కలిపితే అద్భుతాలు సాధ్యమని నిరూపించారు. ముండ్రాయి మహిళా.. జయీభవ!
… కత్తుల శ్రీనివాస్‌ రెడ్డి సిద్దిపేట

మిత్తి రూపాయి
జాతీయ అవార్డు తీసుకోవడం చాల సంతోషంగా ఉంది. కలిసికట్టుగా మేం సంఘాన్ని నడిపించుకుంటున్నాం. బ్యాంకు, స్త్రీనిధి, గ్రామ సమైక్యద్వారా తీసుకున్న రుణాలకు నూటికి రూపాయి మిత్తి చొప్పున కడతాం. ఒక సభ్యురాలు లక్ష రూపాయలు తీసుకుంటే, ప్రతి నెలా మూడు వేలు చెల్లిస్తారు. 50 వేలు తీసుకుంటే, ప్రతి నెలా పదిహేను వందలు వాయిదా చెల్లిస్తారు.
సల్లారం పద్మ, గ్రామైక్య అధ్యక్షురాలు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

పాన్ కార్డు లో అడ్ర‌స్ మార్చుకోవ‌డం ఎలా

ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్ర‌స్ మార్చ‌డ‌మెలా

మీ ఆధార్‌ను ఎవ‌రైనా వాడారా.. ఇలా తెలుసుకోండి

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

ఆధార్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా? ఇలా తెలుసుకోండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముండ్రాయి మాలక్ష్మి!

ట్రెండింగ్‌

Advertisement