జీవనశైలి లోపాలు, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. రక్తపోటు బాధితులు పెరుగుతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం.. 128 కోట్ల మంది ఈ సైలెంట్ కిల్లర్ బారినపడ్డారు. ఫలితంగా గుండె జబ్బులతోపాటు గుండెపోటు ప్రమాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రక్తపోటును తగ్గించి, మరణ ముప్పును తప్పించే ‘డ్యాష్ డైట్’ పాటించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
‘డ్యాష్ డైట్’ ఇప్పటిది కాదు. 1997లోనే దీని మీద పరిశోధనలు జరిగాయి. ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను స్వీకరించడమే.. డ్యాష్ డైట్! ఇందులో రక్తపోటును సహజంగా నియంత్రించే అధిక పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు ఉంటాయి. తాజా పండ్లతోపాటు కూరగాయలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఆరోగ్యానికి కీలకమైన పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం లాంటివి అధికంగా లభిస్తాయి.
ఫలితంగా, గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అధిక రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. ‘డ్యాష్ డైట్’ను ఫాలో అయ్యేవారిలో కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ కేలరీలు, అధిక పోషకాలతో నిండిన ఈ ఆహారంతో బరువు నియంత్రణలో ఉంటుంది. టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్నీ తగ్గిస్తుంది. డ్యాష్ డైట్లో భాగంగా శరీరానికి క్యాల్షియం ఎక్కువగా అంది.. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.