International Menstrual Hygiene Day | నిత్యావసరాలంటే.. ఉప్పు, పప్పు, బియ్యమే అనుకుంటాం. కానీ నెలసరి సమయంలో ఆడవాళ్లకు ఉపయోగపడే శానిటరీ ప్యాడ్స్ నిత్యావసరాలే కాదు, అత్యవసరాలు కూడా. మారుమూల పల్లెలతో పాటు హైదరాబాద్‌లాంటి మహానగరాల్లోనూ నిరుపేద మహిళలు నేటికి కూడా ఆకులు, గుడ్డలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వాళ్ల కోసం శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందిస్తూ .. నెలసరి మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ ( Dignity Drive Foundation ). ఆ సంస్థ స్థాపకురాలు రెనే గ్రేస్ ( Reene Grace ) తన సేవా ప్రస్థానాన్ని ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
ఇద్దరు ఆడవాళ్లు కూడా నేరుగా మాట్లాడుకోలేని అంశం.. రుతుక్రమం. తమ జీవితంలో ముఖ్య భాగమైన ఈ విషయాన్ని నలుగురిలో చర్చించడానికి, ఎదుటివారితో పంచుకోవడానికి కూడా బిడియపడతారు. ఆ అవగాహనా లోపం కారణంగా.. సరైన పరిశుభ్రత పాటించకుండా తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నవారు ఎందరో. భారతదేశంలో నెలసరి వచ్చే ఆడవాళ్ల సంఖ్య దాదాపు 40 కోట్లు ఉండగా, అందులో 20 శాతం మంది మాత్రమే న్యాప్కిన్లు వాడుతున్నారు. చదువు లేకపోవడం, పేదరికం.. కారణమేదైనా కావచ్చు. కానీ, కొందరినైనా ఆరోగ్యవంతమైన అలవాట్ల వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో ‘డిగ్నిటీ డ్రైవ్’ను స్థాపించానని చెబుతున్నారు రెనే గ్రేస్.
“ప్రతి ఆలోచనా ఏదో ఒక సంఘటనతోనే మొదలవుతుంది. నా ఆలోచన వెనుక మా పనిమనిషి కూతురికి ఎదురైన ఓ సమస్య ఉంది. ఒక రోజు ఆమె తన పదమూడేండ్ల కూతురిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు డబ్బు అడిగింది. ఏమైందని అడిగితే చెప్పడానికి మొదట బిడియపడింది. పాపకు అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, చీము పట్టిందనీ.. చెప్పలేక చెప్పింది. వెంటనే నా స్నేహితురాలి ఆసుపత్రికి తీసుకెళ్లాను. నిజంగా చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ అది. అంత చిన్నపిల్ల ఆ బాధను ఎలా భరించిందో కూడా అర్థం కాలేదు. రుతు సమయంలో అపరిశుభ్రతే దీనికి కారణమని తేలింది. అప్పటినుంచీ నేను మా పనిమనిషితో పాటు వాళ్ల అమ్మాయికి కూడా నెలనెలా శానిటరీ న్యాప్కిన్లు కొనివ్వడం మొదలు పెట్టాను. కానీ ఆ సంఘటన మాత్రం, తర్వాత కూడా నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు. వాళ్లు ఉంటున్న బస్తీలో అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు, అవసరమైన వాళ్లకు న్యాప్కిన్లు పంచాలని నిర్ణయించుకున్నాను. ఆ విషయాన్ని ఫేస్బుక్లో పెట్టాను. మేమూ ఇస్తామని చాలామంది ముందుకొచ్చారు. మొదట బండ్లగూడకు వెళ్లాం. కానీ ఎవరూ తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఆ తర్వాత దేశంలో అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన రసూల్‌పురాలో నెలసరి అలవాట్లు, పరిశుభ్రత గురించి సర్వే నిర్వహించాం. సమాజసేవ పట్ల ఆసక్తి ఉన్న జయ్శ్రీరాంలాంటి మిత్రుల సహకారంలో ‘డిగ్నిటీ డ్రైవ్’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆరోజు నూటాయాభై మందికి శానిటరీ న్యాప్కిన్లను అందించాం. రుతుక్రమ సమయంలో ఎలాంటి ఆహారం తినాలి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, నొప్పులనూ, అసౌకర్యాలనూ ఎలా అధిగమించాలి?.. తదితర విషయాలన్నీ చర్చించాం. ప్యాడ్ వెండింగ్ మెషీన్ కూడా పెట్టాం.
మా మొదటి కార్యక్రమమైన ‘డిగ్నిటీ డ్రైవ్’ పేరుతోనే ఓ ఫౌండేషన్ స్థాపించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మారుమూలలకూ సేవలు విస్తరించాం. దాదాపు 30 వేల మందికి అవగాహన సదస్సులు నిర్వహించాం. మురికివాడలు, పాఠశాలలు, కళాశాలలు, అనాథ శరణాలయాలు తిరిగాం. అవసరమైన చోట్ల ప్యాడ్లను పంపిణీ చేశాం. మా సంస్థ పనితీరు నచ్చి ఒక్క హైదరాబాద్‌లోనే రెండువేల మంది వలంటీర్లుగా చేరారు. మూడు రాష్ట్రాల్లో మొత్తం ఐదువేల మంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. తొలుత మాతో కలిసి పని
చేసిన జయ్శ్రీరాం తదితరులు ఇప్పుడు మా బోర్డు మెంబర్లుగా వ్యవహరిస్తున్నారు. నెలనెలా 200 నుంచి 300 మందికి శానిటరీ ప్యాడ్లను ఉచితంగా ఇస్తున్నాం. మా కృషికి మెచ్చి
తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ వారియర్ అవార్డును అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ మా సేవలను గుర్తించింది” … అంటూ తన స్వచ్ఛంద సంస్థ ప్రయాణం గురించి చెబుతారు రెనే. ఇవన్నీ చేస్తూనే ఓ ఐటీ సంస్థ మానవ వనరుల విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారామె. చాలామంది ఆడపిల్లలు బడి మానేయడానికి, చదువుల్లో వెనకబడటానికి కారణం.. రుతుక్రమ సమస్యలే. వీటిపట్ల అవగాహన పెంచుకుని చక్కని పరిశుభ్రత పాటిస్తే బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొంది, జీవితాల్లో స్థిరపడతారు. సమాజంలో సగం అయిన ఆడపిల్లలు ఎదిగితే మొత్తం సమాజమే ఉన్నతంగా మారుతుందని బలంగా విశ్వసిస్తారు గ్రేస్.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి,
ఫొటోలు : చిన్న యాదగిరి గౌడ్
“Animall | పశువుల కోసం మాల్ స్టార్ట్ చేసిన ఇద్దరమ్మాయిలు”