Aditya Dicky Singh | అతను ‘కిక్’ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. చదువులో ఉందనుకొని పుస్తకాల్లో వెతికాడు, దొరకలేదు. ఉన్నతోద్యోగంలో ఉందేమోనని ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యాడు. రెండో ప్రయత్నంలోనే సాధించాడు. రెండేండ్ల శిక్షణాకాలంలో.. ఉన్న సంతోషం కాస్తా ఆవిరైంది. కెమెరా పట్టుకొని భార్యతో కలిసి అరణ్యానికి బయల్దేరాడు. అక్కడ పెద్దపులితో ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు ఏకంగా ఓ అడవినే సృష్టించాడు.
Aditya Dicky Singh and Poonam singh Couple
రాజస్థాన్‌లోని రణ్థంభోర్ రిజర్వ్ ఫారెస్ట్ ( Ranthambore Reserve Forest ) కు ఆనుకొని ఉన్న సవాయ్ మాధోపూర్ ప్రాంతమది. సేద్యం చేయాలంటేనే స్థానిక రైతులు గడగడా వణికిపోతున్న రోజులు. విత్తులు నాటగానే జింకలు ఆగమాగం చేసేవి. పంట పెరిగే కొద్దీ అడవిపందుల దాడి మొదలయ్యేది. పంట చేతికొచ్చే సమయంలో ఏ పిట్టలో, జంతువులో మాటువేసేవి. ఆ శాకాహార జంతువుల కోసం పులులు రంగంలోకి దిగేవి. దీంతో ఎంతోమంది తమ పొలాలను బీళ్లుగా వదిలేశారు. సరిగ్గా అదే సమయంలో ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చి మాధోపూర్(1998)లో కాపురం పెట్టారు ఆదిత్య, పూనమ్‌సింగ్ దంపతులు. ఆ ఇద్దరూ నెల రోజులు సేదతీరేందుకు.. అక్కడికి అతిథులుగా వచ్చారు. తర్వాత, ఏకంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ ప్రయత్నంలో ఆదిత్య తన ఐఏఎస్ కొలువుకు రాజీనామా చేశాడు. ఆ హోదాను, జీతాన్ని త్రుణప్రాయంగా వదిలేశాడు. ప్రొటోకాల్ ఇవ్వని ఆనందాన్ని పచ్చదనంలో వెదుక్కున్నాడు.
Aditya Dicky Singh and Poonam singh Couple
స్థానిక రైతుల స్థితిగతులను అర్థంచేసుకున్న ఆదిత్య దంపతులు తాము పొదుపు చేసుకున్న డబ్బుతో పొలాలు కొనడం ప్రారంభించారు. అలా ముప్పై ఎకరాలు సమీకరించారు. అందులో అడవిని పెంచాలన్నది ఆ ఇద్దరి ఆలోచన. ఆ భూమికి కంచెపెట్టి, చుట్టూ గోడకట్టి చెట్లు పెంచడం మొదలుపెట్టారు. ఆ క్షేత్రానికి ఆనుకొనే ఓ టూరిస్ట్ రిసార్ట్‌ను ప్రారంభించారు ఆదిత్య సింగ్ దంపతులు. ప్రస్తుతం ఆ అడవి ఏకంగా 50 ఎకరాలకు విస్తరించింది.
ఆదిత్యసింగ్ దంపతులు ప్రాణంపోసిన చిట్టడవి 15 ఏండ్లకే ‘కాకులు దూరని కారడవిలా.. ’ మారింది. వన్యప్రాణుల రాక మొదలైంది. జింకలు, అడవిపందులు, కుందేళ్లు, నెమళ్లు, పక్షులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. వాటిని వేటాడేందుకు చిరుత పులులు కూడా రావడం మొదలుపెట్టాయి. వన్యప్రాణుల కోసం అడవులబాట పట్టిన ఈ జంతు ప్రేమికుడిని ముద్దుగా ‘డిక్కీ సింగ్’ అని పిలుచుకుంటారు స్థానికులు.
ఐఏఎస్ ఉద్యోగం ఇవ్వలేని ఆత్మ సంతృప్తిని అడవి అందించింది. నేనూ, నా కుటుంబం అరణ్యానికే అంకితం. నిత్యం సీసీ కెమెరాలు పహరా కాస్తుండటంతో వన్య ప్రాణుల వేట తగ్గింది. అడవులను నరికేవారూ జంకుతున్నారు. జీవ వైవిధ్యం మళ్లీ పురుడుపోసుకుంది. చుట్టుపక్కల పరిసరాలు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. ఈ మనోహర దృశ్యాలను చూస్తుంటే మనసు పులకరిస్తున్నది. ఇక్కడి జంతువులను రక్షించడానికి, వాటి బాగోగులు చూసుకోవడానికి అటవీశాఖతో కలిసి పనిచేస్తున్నాను. నేను ఎప్పుడూ డబ్బును ప్రేమించలేదు.. ప్రకృతితో నాకున్న మమకారం అలాంటిది.
– ఆదిత్యసింగ్, మాజీ ఐఏఎస్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్