డిగ్రీ పట్టా కోసం అమ్మాయిలు కష్టపడి చదువుతారు. తర్వాత ఇంటర్వ్యూలను ఎదుర్కొని మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అంతలోనే పెండ్లి సంబంధాల వేటలో పడతారు తల్లిదండ్రులు. ఆ వచ్చేవాళ్లు ‘పెండ్లయ్యాక అమ్మాయి ఉద్యోగం మానెయ్యాలి’, ‘..చేసుకోవచ్చు కానీ, పిల్లలు పుట్టాక రాజీనామా చేయాలి’ అంటూ సవాలక్ష షరతులు పెడతారు. తప్పనిసరై అమ్మాయిలు ఒప్పేసుకుంటారు. కట్ చేస్తే.. కొన్నేండ్ల తర్వాత జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రం కావాలనిపిస్తుంది. మళ్లీ ఉద్యోగం చేయాలనుకుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే ‘షీ జాబ్స్.ఇన్’ను ప్రారంభించిన స్వాతి నేలభట్ల ను ‘జిందగీ’ పలకరించింది.
నేను ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి పెరిగాను. చెన్నైలో ఇంజినీరింగ్ చదివాను. అక్కడే ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశాను. కొన్నేండ్లకు అమెరికా వెళ్లిపోయాను. అందరూ ఉద్యోగం వచ్చిందని అమెరికా వెళ్తే, నేను అక్కడికి వెళ్లాక ఉద్యోగాల వేటలో పడ్డాను. ఆ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చిన్నచిన్న కంపెనీల్లో పనిచేశాను. తర్వాత ఒక ఐటీ కంపెనీ పెట్టాను. అది బాగా నడుస్తున్నప్పుడే.. రెండేండ్ల క్రితం అమెరికాలో ‘షీ జాబ్స్. ఇన్’ అనే స్టార్టప్ మొదలుపెట్టాను. రకరకాల కారణాలతో ఉద్యోగం మానేసినవాళ్లు, చదువుకున్నా అప్పటివరకూ ఏ ఉద్యోగమూ చేయనివాళ్లు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మా సహకారం తీసుకోవచ్చు. అమెరికాలో మంచి స్పందన వచ్చింది. ఆ ఉత్సాహంతో మన దేశంలోనూ ప్రారంభించాం. గత అనుభవం లేనివాళ్లకు కూడా అర్హతనుబట్టి శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పిస్తాం.
చదువు కాగానే ఏ అమ్మాయి అయినా మంచి ఉద్యోగం చేయాలనే అనుకుంటుంది. కష్టపడి సంపాదించుకుంటుంది కూడా. కానీ చాలామంది పెండ్లి, పిల్లల కారణంగా మధ్యలోనే మానేస్తారు. అలా కొన్నేండ్లు గడిచిపోతాయి. కంఫర్ట్‌జోన్ నుంచి బయటికొచ్చి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టినా, ‘ఇన్నేండ్లు ఎందుకు ఉద్యోగం చేయలేదు?’, ‘మీ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎందులో ఉంది?’ మొదలైన ప్రశ్నలు ఎదురవుతాయి. చేతిలో డిగ్రీ అంటూ ఉంటుంది కానీ, ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ లోపిస్తాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే మా స్టార్టప్ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న మహిళలు షీ జాబ్స్ వెబ్సైట్లో తమ రెజ్యూమే అప్లోడ్ చేస్తే చాలు. మేమే వాళ్లను సంప్రదించి వీలైనంత సహకారం అందిస్తాం. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలపైనే దృష్టి పెడుతున్నాం. త్వరలో అన్నిరకాల ఉద్యోగాలనూ అందుబాటులోకి తెస్తాం. ఇదంతా స్వచ్ఛందంగానే చేస్తున్నాం. మా సేవలు పూర్తిగా ఉచితం.
మహిళలు కేవలం పిల్లల పోషణ, కుటుంబ బాధ్యతల కోసమే ఉద్యోగాలు మానేస్తుంటారు. రెండు బాధ్యతలనూ బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంటే.. ఎవరూ కెరీర్‌ను వదులుకోరు. ఐదేండ్ల కిందట ‘లైవ్ మైండ్స్’ అనే ఐటీ కంపెనీని స్థాపించినప్పుడే ఈ విషయం గురించి ఆలోచించాను. మా కంపెనీలో 95 శాతం మహిళా ఉద్యోగులే. షిఫ్ట్‌ల విషయానికొస్తే, మహిళలు తమ వీలునుబట్టి రావచ్చు. ముఖ్యంగా ఇలాంటి వెసులుబాటు విషయంలో ఆటిజం పిల్లల తల్లులకు, దివ్యాంగుల అమ్మలకు ప్రాధాన్యం ఇస్తాం. ఎందుకంటే, అలాంటి పిల్లలకు తల్లుల అవసరం ఎంతో ఉంటుంది. ఇంటి బాధ్యతలన్నీ పూర్తయ్యాక రాత్రిళ్లు పని చేస్తామన్నా అభ్యంతరం లేదు. నెలనెలా సెమినార్లు, వెబినార్లు నిర్వహించి, తోటి మహిళలను ప్రోత్సహించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు షీ జాబ్స్ కోసం కూడా కొంతమందిని రిక్రూట్ చేసుకుంటున్నాం. ఆసక్తిగల మహిళలు ‘www.shejobs.in’ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. ప్రస్తుతం మేం ఒక యాప్‌ను రూపొందిస్తున్నాం. ఉద్యోగార్థులైన మహిళలంతా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ పని, ఈ పని అని కాదు.. విద్యార్హత, ఆసక్తిని బట్టి కొలువులను ఎంచుకోవచ్చు. కుటుంబం, బాధ్యతలు ఏ మహిళ ఎదుగుదలకూ అవరోధాలు కాకూడదు.
మా నాన్న నేలభట్ల దుర్గారావు జర్నలిస్ట్‌గా పనిచేశారు. అమ్మ సుజాత తహశీల్దారు హోదాలో పదవీవిరమణ పొందారు. నా పదిహేడేండ్ల వయసులో నాన్న చనిపోయారు. మహిళల కోసం ఏదో ఒకటి చేయలన్న నా తపనకు నాన్నే స్ఫూర్తి. ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా, నన్ను నిద్రలేపి కొద్దిసేపు ముచ్చటించేవారు. మహిళల విజయాల గురించి చెప్పేవారు. ఆయన చదివిన, రాసిన మహిళల కథనాల గురించి చర్చించేవారు. నాకెందుకు ఇవన్నీ చెబుతున్నారు? అనిపించేది ఒక్కోసారి. కానీ ఆరోజు నాన్న నా మెదడులో వేసిన బీజాలే ఇవన్నీ అని ఇప్పుడు అర్థం అవుతున్నది. నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో, సెక్యూరిటీలో పనిచేసే ఒక మహిళ నన్ను రోజూ చూసేది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి, ‘మేడం, నేను ఎప్పటికైనా మీలాగా ల్యాప్‌టాప్ పట్టుకుని ఆఫీసుకు వెళ్లగలనా?’ అంది. ఆ సంఘటన నాకు మనసులో నిలిచిపోయింది. ఇప్పుడు ఆవిడ మా టీమ్‌లో టెక్ ట్రెయినీగా ఉందని గర్వంగా చెప్పగలను. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు.
… నిఖిత నెల్లుట్ల
Vedaant Madhavan | సెలబ్రెటీ పిల్లల్లో మాధవన్ తనయుడి రూటే సపరేటు”
ఏడు పదుల వయసులో పెయింటింగ్ నేర్చుకుని అవార్డులు అందుకుంటున్న బామ్మ”
టాలీవుడ్ మొదలు బాలీవుడ్ స్టార్స్ అందరితో ఇన్‌స్టా రీల్స్ చేయించగలిగే ఈ అమ్మాయి ఎవరో తెలుసా!!”
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”