Niharika NM | సూపర్ స్టార్లను నిలబెట్టి మరీ.. రీల్స్ చేయమంటే చేస్తారా? మనకంత టైమ్ ఇస్తారా? మనకేమోగాని.. నిహారికకు మాత్రం ఠక్కున ఓకే చెబుతారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్.. ఏ హీరో అయినా కాదనలేరు. కారణం.. నిహారికకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్!
పాన్ ఇండియా స్టార్.. కేజీఎఫ్ కింగ్ యష్‌తో డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేసిన నిహారిక ఎన్ఎమ్.. ఇరవై నాలుగు గంటల్లోనే ఇన్‌స్టా రీల్లో మూడున్నర మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. తనకున్న ఫాలోయింగ్‌ను, హీరోల స్టార్‌డమ్‌ను సమర్థంగా వాడుకోవడంలో నేర్పరి నిహారిక. ఇప్పటికీ తన సూత్రం ఒక్కటే ‘తక్కువగా ఆలోచించండి.. ఎక్కువగా మాట్లాడండి’. చెన్నైలో పుట్టి, బెంగళూరులో పెరిగిన నిహారిక ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఎంబీఏ చదువుతున్నది. లాక్డౌన్ కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన రోజుల్లో కాలక్షేపానికి షార్ట్ వీడియోలు చేయడం మొదలు పెట్టింది. తర్వాత ఫన్నీ వీడియోలకు రూపం ఇచ్చింది.
స్టార్స్‌ను అనుకరించడంలో తనకు సాటి లేదు. యూఎస్‌లోని కొత్త ప్రదేశాలను పరిచయం చేయడంలోనూ నేర్పరే. దీంతో అనూహ్యంగా ఫాలోవర్లు పెరుగుతూ వచ్చారు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 2.1 మిలియన్స్ ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 849కే సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్‌తో చేసిన రీల్ కూడా మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉంది. ‘క్రియేటర్స్ ఫర్ చేంజ్’, ‘యూట్యూబ్ ఇనీషియేటివ్’ వంటి అవార్డులకు ఎంపికైన ఏకైక భారతీయురాలు నిహారిక. ఆన్లైన్ వేదికగా సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంలోనూ తను దిట్ట. జిమ్ క్యారీ నుంచి బ్రహ్మానందం వరకూ ప్రతి కమెడియన్ నుంచీ స్ఫూర్తి పొందానని అంటున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో నిహారిక బంధుగణం ఎక్కువే. దీంతో సెలవుల్లో ఆయా రాష్ట్రాలు వెళ్లి, ప్రాంతీయ భాషలు నేర్చుకుంటున్నది. తెలుగు, తమిళం, కన్నడం మిక్స్ చేసి.. ఫాలోవర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే కంటెంట్‌ను వండివారుస్తున్నదీ మాటల మాంత్రికురాలు.
అమెరికా వర్జీనియాలో వ్యవసాయం చేస్తున్న తెలంగాణ మహిళ”
ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివి ఛాయ్ అమ్ముకుంటున్న యూత్.. ఎందుకింత క్రేజ్ !!”
“వ్యాపారంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ముఖేశ్ అంబానీ గారాలపట్టి చెప్పిన విజయసూత్రాలివే..”
అన్నదాతలకు అండగా నిలబడిన హైదరాబాదీ ఆడబిడ్డ.. ఆమె ఏం చేస్తుందంటే..”