మెనోపాజ్.. మహిళల్లో రుతుక్రమ ముగింపును సూచించే సహజమైన దశ. ప్రతి మహిళ జీవితంలో జరిగే ఓ సాధారణ ప్రక్రియ. అయితే, ఈ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. మానసికంగానూ తీవ్రమైన సంఘర్షణలు తలెత్తుతాయి. వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే.. ఆ తర్వాతి జీవితం సాఫీగా సాగుతుంది. లేకుంటే.. అనేక ఒడుదొడుకులకు గురవుతుంది.
సాధారణంగా మహిళలకు 45 నుంచి 50 ఏళ్ల మధ్య.. మెనోపాజ్ దశ మొదలవుతుంది. ఈ దశలో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా జీవక్రియలో క్షీణత, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ హార్మోనల్ మార్పులవల్ల చాలామందికి సరిగ్గా నిద్ర పట్టదు. ఎప్పుడూ చికాకుగా ఉంటారు. చిన్నచిన్న పనులకే అలసిపోతారు. శరీరం ఎక్కువగా వేడికి గురవ్వడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలూ కనిపిస్తాయి. కాల్షియం స్థాయులు తగ్గిపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఈ ప్రభావాలన్నీ మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మానసికంగానూ ఇబ్బంది కలిగిస్తాయి. అయితే.. మెనోపాజ్ దశకన్నా ముందు వచ్చే పెరిమోనోపాజ్ దశ నుంచే ఈ మార్పులన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. అప్పుడే జాగ్రత్తపడితే.. మెనోపాజ్ దశలో ఈ ఇబ్బందులను సులభంగా అధిగమించే అవకాశాలు ఉంటాయి.
40 ఏండ్లు దాటిన మహిళలు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మొదటగా శారీరక శ్రమ చేయడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్, యోగాతో రోజంతా చురుగ్గా ఉండొచ్చు. మెటబాలిజాన్ని పెంచుకోవచ్చు. రోజూవారీ ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ కార్బొహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా నిద్రకు కచ్చితమైన సమయాన్ని కేటాయించాలి. రోజూ నిర్ణీత సమయంలోగా నిద్ర పోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే.. మెనోపాజ్ దశలో వచ్చే సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చు.