e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home ఆరోగ్యం కష్టాల్లో.. కాలేయం!

కష్టాల్లో.. కాలేయం!

కష్టాల్లో.. కాలేయం!
 • జాగ్రత్తలు తప్పనిసరి..
 • ఊబకాయులు బరువును క్రమంగా తగ్గించుకోవాలి.
 • మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించుకోవాలి.
 • చెడు కొవ్వు పేరుకుపోయిన వారు కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి.
 • హెపటైటిస్‌-సి బాధితులు తగిన చికిత్స తీసుకుని కాలేయంపై ఉన్న కొవ్వును వదిలించుకోవాలి.
 • రోజూ కనీసం 45 నిమిషాలపాటు నడక, తేలికపాటి వ్యాయామం, యోగా చేయాలి.

కాలేయానికి కొత్త కష్టాలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ మద్యానికి బానిసలైన వారికే ‘ఫ్యాటీ లివర్‌’ సమస్య వచ్చేది. ఇప్పుడు జీవనశైలి రుగ్మతలనూ అది వదలడం లేదు. ఆరోగ్యకరమైన జీవన విధానం, తక్షణ అప్రమత్తత మాత్రమే కాలేయాన్ని కాపాడగలవని నిపుణులు చెబుతున్నారు. అతి తీపికూడా ప్రమాదకరమేనని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

కాలేయం.. శరీరంలోని ఒక పెద్ద అవయవం. జీర్ణవ్యవస్థలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. వివిధ భాగాలకు కావలసిన రసాయనాలను తయారు చేసి, అవసరమైనంతమేర సరఫరా చేసే కార్ఖానా కూడా. మనం తీసుకునే ఆహారంలోని, వివిధ ఔషధాల్లోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరుగకుండా కాపాడే గరళకంఠుడి పాత్రా పోషిస్తుంది కాలేయం. ఆహారం నుంచి శక్తిని గ్రహించి శరీరానికి అందజేస్తుందికూడా. కాలేయం కనుక పని చేయకపోతే, విషపదార్థాలు నేరుగా శరీరంలోని ఆయా భాగాలకు చేరుకొని.. మనిషి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గుండె నిరంతరం కొట్టుకున్నట్టే, కాలేయం కూడా అహరహం శ్రమిస్తూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం మానేస్తే మనిషి మరణిస్తాడు. కాలేయం పని చేయడం మానేసినా, సక్రమంగా పని చేయకపోయినా జీవి ఆయువు తీరినట్లే. మారుతున్న జీవనశైలితోపాటు రకరకాల కారణాలవల్ల కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. ఇందులో ప్రధానమైంది, ప్రమాదకరమైంది ఫ్యాటీ లివర్‌ సమస్య. సాధారణంగా, ఇది 90 శాతం సందర్భాల్లో ఆల్కహాల్‌ సేవించేవారికే వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆల్కహాలిక్స్‌తో సమానంగా నాన్‌-ఆల్కహాలిక్‌ వ్యక్తుల్లోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు తెలుస్తున్నది.

ఫ్యాటీ లివర్‌ అంటే?

- Advertisement -

ఒక్కమాటలో చెప్పాలంటే.. కాలేయంలో కొవ్వు అధికంగా చేరడాన్నే ‘ఫ్యాటీ లివర్‌’ అంటారు. నిజానికి, కాలేయంలో 5 శాతం కంటే తక్కువ కొవ్వు ఉండటాన్ని సాధారణంగానే పరిగణిస్తారు. 5 శాతానికి మించి 10 శాతం వరకూ ఉంటే ‘ఫ్యాటీ లివర్‌’గా పరిగణిస్తారు. తీవ్రత ఆధారంగా గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3గా విభజిస్తారు.

ఎలా గుర్తించాలి?

సాధారణంగా ఫ్యాటీ లివర్‌ను కిడ్నీ ఇకో టెక్చర్‌తో పోలుస్తారు. ఒక వ్యక్తిలోని కుడి కిడ్నీ ఇకో-టెక్చర్‌కు కాలేయం ఇకో-టెక్చర్‌ సమానంగా ఉండాలి. ఇలా ఉంటే, ఫ్యాటీ లివర్‌ సమస్య లేదని భావిస్తారు. కుడి కిడ్నీ ఇకో-టెక్చర్‌ కంటే, కాలేయం ఇకో-టెక్చర్‌ ఎక్కువగా ఉంటే.. సదరు రోగి ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నట్లు నిర్ధారిస్తారు.
ఎలాస్టోగ్రఫీ ఇకో సెన్సెస్‌ లేదా ఫైబ్రోస్కాన్‌
ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌..
…తదితర పరీక్షలద్వారా సమస్యను నిర్ధారిస్తారు.

నాన్‌ ఆల్కహాలిక్‌..

కొంతకాలం క్రితం వరకు, ఎవరికైనా ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చిందంటే, సదరు వ్యక్తి మద్యపాన వ్యసనపరుడని ఠక్కున చెప్పేవారు. ముందు మద్యం మానేయమని హెచ్చరించేవారు. కానీ, ఇప్పుడు ఆల్కహాల్‌ సేవించని వారిలో కూడా సమస్య ఉత్పన్నమవుతున్నది.

అందుకు ప్రధాన కారణాలు..

 • ఊబకాయం
 • మధుమేహం
 • చెడు కొవ్వు
 • హెపటైటిస్‌-సి
 • ఔషధాల దుష్ప్రభావాలు

అతిగా తీపి పదార్థాలు తినేవారి కాలేయంలో డీ-నోవో లిపోజెనెసిస్‌ కారణంగా కొవ్వు పేరుకు పోతున్నట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా స్థూలకాయ చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిర్లక్ష్యం వద్దు

ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌తో పోలిస్తే నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ సమస్యను గుర్తించడం కొంత కష్టం. నిర్లక్ష్యం చేస్తే, ‘నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ (NAFLD) అనేది ‘నాన్‌-ఆల్కహాలిక్‌ స్టిటోహెపటైటిస్‌’ (NASH)గా మారుతుంది. అప్పటికీ సరైన చికిత్స అందకపోతే ‘సిరోసిస్‌’గా పరిణమిస్తుంది. అంటే, కాలేయ కణాలు క్షీణించి, కాలేయంపై మచ్చలు లేదా కంతులు ఏర్పడుతాయి. లివర్‌ గట్టిపడి పూర్తిగా దెబ్బతింటుంది. క్రమంగా పని చేయడం మానేస్తుంది. సాధారణంగా నాన్‌ ఆల్కహాలిక్‌ వారిలో లక్షణాలు త్వరగా బయటపడవు. చాలా నెమ్మదిగా ప్రభావం చూపుతుంది. విషయం తెలిసేసరికి సమస్య సిరోసిస్‌కు చేరుకుంటుంది. రుగ్మత చివరిదశకు వచ్చేసి కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. కాలేయం పని చేయకపోతే, రోగి మృత్యువాత పడతారు. కాబట్టి, లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.

ఇవీ లక్షణాలు.

 • ఆకలి మందగించడం
 • వాంతులు, వికారం
 • ఉదరంలో నొప్పి
 • కామెర్లు

చికిత్సా పద్ధతులు

నాన్‌-ఆల్కహాలిక్‌ వారిలో కాలేయవాపు సమస్యకు చికిత్స అందించాలంటే ముందు వ్యాధి కారకాన్ని గుర్తించాలి. అంటే కాలేయంపై వాపు దేనివల్ల వచ్చిందో నిర్ధారించాలి. వ్యాధికి కారణమైన ఏజెంట్‌నుబట్టి చికిత్స చేస్తారు. వ్యాధి ముదిరితే తీవ్రత ఆధారంగా కొన్నిసార్లు కాలేయమార్పిడి చేయాల్సి వస్తుంది. సాధారణంగా ఫ్యాటీ లివర్‌ సమస్యను చికిత్సద్వారా నయం చేయవచ్చు. కాలేయంపై పెరిగిన కొవ్వును తగ్గించవచ్చు. కాకపోతే, సమస్యను సకాలంలో గుర్తించాలి. నిర్ధారణ జరిగిన వెంటనే మూలకారణాన్ని నియంత్రించాలి. దీంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. సమర్థమంతమైన చికిత్స లభిస్తే రోగి 3 నుంచి 6 నెలల్లో సమస్యనుంచి బయట పడతారు.

మహేశ్వర్‌రావు బండారి

కష్టాల్లో.. కాలేయం!డాక్టర్‌ భాష్యకార్ల రమేశ్‌
గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి
ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ హైదరాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కష్టాల్లో.. కాలేయం!
కష్టాల్లో.. కాలేయం!
కష్టాల్లో.. కాలేయం!

ట్రెండింగ్‌

Advertisement