ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మా!’ అని బిడ్డ చేసిన సైగలు ఆమె కండ్లలో తిరుగుతూనే ఉన్నాయి. ఏ అండాదండా లేని ఆ తల్లి వేదన నుంచే ఓ పోరాటం పురుడుపోసుకుంది. ఇటీవల కోదాడలో పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా మృతి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేశ్ తల్లి లలితమ్మ డీజీపీని కలిసింది. ‘నా కొడుకును పొట్టన పెట్టుకున్న పోలీసులపై మర్డర్ కేసు పెట్టాలి’ అని మొరపెట్టుకున్నది. గుండెకోతను పంటిబిగువున అదిమిపెట్టి పోరుబాట పట్టింది. ఆ తల్లి దీనగాథ ఆమె మాటల్లోనే…
నా కొడుకు బంగారమయ్యా! నా కోసమని కోదాడల్నే పనికి కుదిరిండు. నా పెనిమిటి కండ్లు మూసినాంక.. ఇద్దరు కొడుకులను చూసుకుంట బతుకుతున్న. పెద్దోడు రాజేశ్. ఉన్నంతల బతుకుడు అలవాటైన జీవితాలు మాయి. ఏదో జరిగిపోతుంది అనుకుంటుండగా.. పోలీసోళ్ల కండ్లు మా మీద వడ్డయ్. నవంబర్ నాలుగో తారీఖు.. సాయంత్రం పొద్దు.. బండి మీద పోలీసులొచ్చిండ్రు. ‘ఏయ్ లలితమ్మా,, నీ బిడ్డ ఎక్కడ.. పిలువ్ వాణ్ని..’ అన్నడు ఓ పోలీసాయన.
‘అయ్యా.. ఇంట్లనే ఉన్నడు.. ఓ రాజేసు.. పోలీసులొచ్చిరేంద్రా..’ అంటే.. ‘ఓ అమ్మా.. ఎందుకు ఒర్లుతున్నవ్. ఏం లేదు.. స్టేషన్‌కు తీస్కపోయి.. మళ్లీ వెంటనే తీస్కొస్తాం. అరవకు నీ కొడుకును సీఐ గారు తీస్కరమన్నారు. రెయ్ నువ్ బండెక్కు..’ అంటూ నా కొడుకును పోలీసులు బైకు మీద తీస్కవోయిన్రు. రాత్రంతా ఆడనే ఉంచుకుని పంపిన్రు. మళ్లీ తెల్లారే స్టేషన్‌కు రమ్మన్నరు. కాయిదం లేదు, ఏం లేదు మర్నాడు పోలీస్ స్టేషన్‌కు తీస్కవోయిన నా కొడుకును ఐదు దినాలు ఆడనే పెట్టుకున్నరు. చిత్రవధ చేశారు. చెక్కలు ఎక్కించిన్రట. ఆ రోజు సంధి నా బిడ్డను గొడ్డును బాదినట్టు కొట్టారయ్యా. నేను రోజూ స్టేషన్‌కు అన్నం తీస్కపోయినప్పుడు.. ‘అయ్యా! బిడ్డను ఒక్కపాలి చూస్తా.. అన్నం తినిపిస్తా!’ అని కనిపించిన ప్రతి పోలీసునూ అడిగిన. బువ్వ పెట్టుడు సంగతి దేవుడెరుగు.. కనీసం నా కొడుకు మొహం కూడా చూడనియ్యలేదు! పొద్దున కోదాడ స్టేషన్ల కొడితే.. సాయంత్రం చిలుకూరుకు తీస్కవోయి మళ్లీ కొట్టేటోళ్లు. ఒక్కసారైనా నా బిడ్డను చూడనియ్యండ్రయ్యా అని మొత్తుకుంటే.. ఓ రోజు చూపించిన్రు.

నా బిడ్డను అట్ల చూసి తట్టుకోలేకపోయిన. నేను ఏనాడూ నా కొడుకు మీద చెయ్యెత్తింది లేదు. స్టేషన్ల కౌకు దెబ్బలతో ఒళ్లు హూనమైన బిడ్డను చూసి నా పానం పోయినంత పనైంది. ఒళ్లంతా దెబ్బలతో కుదేలైండు బిడ్డ. ‘నన్ను ఈడ్నుంచి తీస్కవో అమ్మ..’ సైగలతోనే చెప్పి కండ్లనీళ్లు వెట్టుకుండు పిల్లగాడు. వాడట్లా ఏడుస్తుంటే నా గుండె నిలువునా కోసినంత పనైంది. దళితులుగా పుట్టడమే మేం చేసిన నేరమా? చెయ్యని నేరానికి నా బిడ్డను ఠాణాకు తీస్కవోయిన్రు. చిత్ర హింసలు పెట్టిన్రు. ‘నా బిడ్డను ఇడ్సిపెట్టండి సారూ’ అని అక్కడున్నోళ్లందరి కాళ్ల మీద వడ్డా కనికరించలేదు. పోలీసోళ్లు నా కొడుకును ఆగం చేస్తరని ఆనాడే అనిపించింది.
ఐదో తారీఖు స్టేషన్‌కు తీస్కవోతే.. పదో తారీఖు వరకు కొట్టిన్రు. కోర్టుకు తీస్కపోయినంక.. నా బిడ్డ నడవలేకున్నడు. పోలీసులు కోర్టు హాల్లోనే ఏదో సూది మందు ఇప్పించిన్రట. తుంటెకు ఇయ్యాల్సిన సూది కుడి చేతి నరాలకు ఇచ్చిన్రట. అట్ల ఇంజెక్షన్ ఇప్పించి కోర్టుకు తొల్కవోయిన్రు. మళ్లీ స్టేషన్‌కు తీస్కొచ్చి నాలుగైదు రోజులు మళ్లీ కొట్టిన్రు. దీంతో బిడ్డ ఆగమైండు. హుజూర్నగర్, కోదాడ ఆస్పత్రులకు తీస్కవోయినా వాడ్ని బాగు చేయలే. ‘మేం ప్రైవేటు దవాఖాన చూపించుకుంటం సారూ’ అని బతిమిలాడినా.. ఇడ్సిపెట్టలే. గాంధీ ఆస్పత్రికి తీస్కవోయిన్రు. అక్కడ వైద్యం ప్రారంభించకముందే నా కొడుకు పానాలు గాల్లో కలిసిపోయినయి. పదిహేడో తారీఖు నాడు నా కొడుకు శవాన్ని ఇచ్చిన్రు.
దొంగ కేసుల ఇరికించి.. వాడి బతుకు అన్యాయం చేసిన్రు. మా ఆయన నాగయ్య 2019లో అనారోగ్యంతో పోయిండు. పెద్ద కొడుకు రాజేశ్ ఇంటర్ చదివిండు. అదేదో ఓపెన్ డిగ్రీ అట. అది చేసేటోడు. నేను ఆస్పత్రిల స్వీపర్‌గా చేస్తా! ఇండ్లళ్ల పనికి పోతుంట. నా కొడుకు హుజూర్‌నగర్‌లో పని చేసేటోడు. నా పానం బాగాలేదని కోదాడకొచ్చి.. ఈడనే పెట్రోలు బంక్‌ల పనికి చేరిండు. కొన్నాళ్లకు వాడి దోస్తు శేఖర్ కలిసిండు. ఎవరికో నా కొడుకు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చిండట. వాళ్లెవరో రాజేశ్ అకౌంట్ల లక్ష జమ చేసిండ్రట. ఆ పైసలు శేఖర్‌కు ఇచ్చేసిండు కూడా! దీనెనక పెద్ద మతలబు ఉందని తర్వాత గానీ ఎర్కకాలే! గదేదో సీఎంఆర్ఎఫ్ కేసు అని చెప్పి గా పైసలు నా కొడుకు అకౌంట్ల వడ్డయని అరెస్టు చేసిన్రు. ‘గా లక్ష రూపాయలు ఆడి దోస్తుకు ఎప్పుడో ఇచ్చేసినం సార్!’ అని ఎన్నిసార్లు చెప్పినా.. ఇనలే! దీనెనక పెద్ద రాజకీయ కుట్ర ఉంది. ఆ కుట్రకు నా కొడుకు బలైండు.
కొడుకు చావుకు న్యాయం చేయాలని నేను ఎక్కని పోలీస్‌స్టేషన్ మెట్టు లేదు. కోదాడ, చిలుకూరు స్టేషన్లకు పొయ్యి కంప్లయింట్ చేసిన. ఎవ్వరు పట్టించుకోలే. డీఎస్పీ సార్‌ను కలిసిన. అక్కడా నిరాశే ఎదురైంది. ఎస్పీ ఆపీసుకు పోయిన. అక్కడ కూడా ఎవరూ పెదవి మెదపలే! పోలీసోళ్ల పెద్ద సారు డీజీపీని కల్వనికి వచ్చిన. నా బిడ్డ చావుకు చిలుకూరు ఎస్సై సురేశ్‌రెడ్డి, కోదాడ రూరల్ సీఐ ప్రతాపలింగం, కానిస్టేబుళ్లు కారకులని.. వారిపై మర్డర్ కేసు పెట్టాలని, అట్రాసిటీ కేసు పెట్టాలని కోరిన. కాయిదం ముక్క లేకుండా నా బిడ్డ మీద కేసు పెట్టి.. పొట్టన వెట్టుకున్నరు. నేనేమో కాయిదం మీద పోలీసోళ్ల పేర్లు రాసిచ్చినా.. కేసు లాగూ చేయలే! నా బిడ్డ చావుకు కారణమైన వారిని జైలుకు పంపేదాకా నేను వదలను. ఎంత దూరమైన పోత.
నా కొడుకు పోయిన దుఃఖంలో ఉన్న నన్ను బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ వచ్చి పలకరించిండు. ఆ పార్టీ నాయకులు నాకు భరోసా ఇచ్చిన్రు. నేను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని చెప్పిన్రు. ఎంతమంది అడ్డుకున్నా నిలవడత. మంద కృష్ణ మాదిగ అన్న వెంట ఉంటానన్నడు. న్యాయం కోసం పోరాటానికి దిగుతున్న. నా పానం పోయేదాకా ఎన్కడుగు ఎయ్య!! నా బిడ్డకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దు. నా పోరాటానికి ప్రజలు, పార్టీలు కలిసి వస్తరని నమ్ముతున్న.
ఏం జరిగింది? 2022లో సీఎంఆర్ఎఫ్ నిధులు లక్ష రూపాయలు రాజేశ్ ఖాతల పడ్డయని గత సెప్టెంబర్‌లో పోలీసులకు మౌఖిక ఫిర్యాదు అందింది. ఆ సమాచారం స్టేషన్ నుంచి వెంటనే స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు చేరింది. 2022 నాటికి ఎమ్మెల్యేగా ఉన్నది, ఇప్పటి ప్రతిపక్షం తరఫున ఓ బీసీ బిడ్డ. కోదాడ నియోజకవర్గ అధికారపార్టీ అగ్రవర్ణాల వారికి ఆయన కొరకరాని కొయ్య. అందుకే ఆ కేసును స్కామ్‌గా మార్చే కుట్రకు పథకం రచించారు. రాజేశ్‌ని పావుగా ఎంచుకున్నారు.
బీఆర్ఎస్కు చెందిన ఆ బీసీ నేత పేరు చెప్పిస్తే.. ఆ కేసును ఓ కుంభకోణంగా మార్చొచ్చని కాంగ్రెస్ నేతల ఎత్తుగడ. రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా అనుమానాస్పద విచారణలోనే భాగంగానే లలితమ్మ కొడుకు కర్ల రాజేశ్‌ను తీసుకెళ్లారు. కేసు నమోదు, విచారణ చట్టబద్ధంగా సాగితే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. కానీ, విచారణ కోసం స్టేషన్‌కు వెళ్లిన రాజేశ్ ప్రాణాలు కోల్పోవడమే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయేలా చేస్తుంది.
– రవికుమార్ తోటపల్లి