Nutreat Life | కాలం మారుతున్నది. తినే ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నది. ఇప్పటికే చాలామంది రాగులు, సజ్జలు, జొన్నలు, సామల జపం చేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ వదిలి పొలాలబాట పడుతున్నారు. పురుగు మందుల ఎవుసాన్ని కాదనుకొని.. స్వచ్ఛమైన సేంద్రియ సేద్యాన్ని కండ్లకు అద్దుకుంటున్నారు. ప్రజల్లో వస్తున్న ఈ ఆహార చైతన్యాన్ని ఒడిసిపట్టుకునేందుకు రంగంలోకి దిగారు జ్యోతిశ్రీ పప్పు ( Jyothi Sri Pappu ). ‘న్యూట్రీట్ లైఫ్ ( Nutreat Life )’ పేరుతో ఉగ్గు, ఉక్కిరి, రాగి జావ, జొన్న జావ తదితర ‘సిరి ధాన్య’ ఆహారాన్ని అందిస్తున్న జ్యోతిశ్రీ స్టార్టప్ ప్రయాణం ఆమె మాటల్లోనే..
ఫార్మసీలో మాస్టర్స్ చేశాన్నేను. ఏ ఆహారంలో ఎలాంటి రసాయనాలు కలుపుతారు? వాటివల్ల జరిగే నష్టం ఏమిటి? అన్నది నాకు బాగా తెలుసు. నా బిడ్డకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాల్లో ముంచితేల్చిన ఆహారాన్ని ఇవ్వొద్దని నిర్ణయించుకున్నా. బాబు అన్నప్రాశనకు మా నానమ్మ ప్రత్యేకంగా ఉగ్గు, ఉక్కిరి పిండి చేసి తీసుకొచ్చింది. దాన్ని నేనూ రుచి చూశాను. అద్భుతంగా అనిపించింది. నా స్నేహితులకూ ఇచ్చాను. మాకంటే మాకు కావాలని అడిగారు. ఇదంతా చూసి మావారు సతీశ్‌కుమార్ ‘పాతకాలం ఆహారాన్ని కొత్తగా పరిచయం చేస్తే బావుంటుందేమో’ అని ప్రోత్సహించారు. అలా ‘న్యూట్రీట్ లైఫ్’ (www.nutreatlife.com) పేరుతో ఓ స్టార్టప్ రిజిస్టర్ చేయించాను. పాతికవేల రూపాయల పెట్టుబడి అందించారు మావారు. కుటుంబసభ్యులు, స్నేహితులు కొంత సాయం చేశారు. మొదట్లో రెండు ఉత్పత్తులు మార్కెట్లోకి తీసు కొచ్చాం. అవి బాగానే అమ్ముడయ్యేవి. దీంతో కొంత ధైర్యం వచ్చింది.
నా అధ్యయనంలో ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం గురించి తెలిసింది. అక్కడ సేంద్రియ పద్ధతిలో చిరుధాన్యాలు పండిస్తారు. బియ్యం, కొర్రలు, సామలు, రాగి, జొన్నలు చేతితో దంచుతారు. నేరుగా వెళ్లి స్థానిక ఆదివాసీ, గిరిజన మహిళలతో మాట్లాడాను. వారి సహకారంతో పదిహేను ఉత్పత్తులు మార్కెట్లో విడుదల చేశాను. మంచి స్పందన వచ్చింది. ఈ ప్రయాణంలో స్నేహితురాళ్లు భావన, శ్వేత నాతో కలిసొచ్చారు. దేశమంతా తిరిగి పాతతరం వంటల గురించి తెలుసుకున్నాం. వాటన్నిటికీ ఓ కొత్త రూపం ఇచ్చాం. దీంతో దేశ, విదేశాల నుంచి ఆర్డర్స్ రావడం మొదలైంది. ఎక్కడెక్కడివారో.. తమకు తెలిసిన ఆహారాన్ని మాకు పరిచయం చేశారు. వాళ్లు కోరినట్టే తయారు చేసిచ్చాం. అలా, కస్టమైజేషన్ కింద.. 80కి పైగా ఉత్పత్తులు సిద్ధం అయ్యాయి. ఇప్పటివరకు 20వేల మంది కస్టమర్లకు మా ఉత్పత్తులు చేరవేశాం. ఇప్పుడు మా దగ్గర పసిబిడ్డల నుంచి 90 ఏండ్ల వృద్ధుల వరకు.. అందరికోసం వివిధ పోషకాహారాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉగ్గు, ఉక్కిరి, రాగిజావ, మల్టీ గ్రెయిన్ పౌడర్‌తో పాటు.. రాగి ఆల్మండ్ దోశ ప్రీమిక్స్, కిచిడి ప్రీమిక్స్, ఇడ్లీ మిక్స్ వంటివి విరివిగా అమ్ముడవుతున్నాయి. వీటితో పాటుగా స్వచ్ఛమైన వెన్నతో కుకీస్ చేస్తున్నాం. మా వెబ్‌సైట్‌తోపాటు వివిధ ఈ కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్నాం. కెనడా, యూఎస్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో మాకు కస్టమర్లు ఉన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ ఓ కెఫే ప్రారంభిస్తున్నాం.
…✍ రవికుమార్ తోటపల్లి, 📷జి.భాస్కర్
ShuShu Babies | ఓ అమ్మ ప్రయాణం షుషు బేబీస్!”