Road accident : కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం మధుర జిల్లా (Mathura district) లోని మాగోర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువ (canal) లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులను రాహుల్ (23), అమిత్ (22), మోహిత్ (22) గా గుర్తించారు. మరో వ్యక్తిని వారి స్నేహితుడిగా గుర్తించినట్లు తెలిపారు. వారంతా రాజస్థాన్లోని డీగ్కు ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయించి పోస్టు మార్టానికి పంపించారు.
ఘటనపై రూరల్ ఎస్పీ సురేశ్ మాట్లాడుతూ.. ‘నలుగురు యువకులు మహావన్ నుంచి డీగ్కు బైపాస్ ద్వారా గోవర్ధన్ మీదుగా కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మలుపు తిరుగుతున్న సమయంలో కారు అదుపుతప్పి లోతైన కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురూ చనిపోయారు. క్రేన్ సాయంతో కారును వెలికితీసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నాం’ అని చెప్పారు.