ఆదిలాబాద్ : ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆరోపించారు. కాంగ్రెస్ అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసుల అధికారులపై చట్టపరంగా ( Legal Action ) చర్యలు తీసుకుంటామని, రాబోయేది బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వమేనని, వదిలి పెట్టబోమని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ( Balka Suman ) ను గురువారం పరామర్శించారు. అనంతరం జైలు బయట హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్లో 22 స్థానాలకు గాను 14 స్థానాలను బీఆర్ఎస్ గెలిస్తే, ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించకుండా, చైర్మన్ ఎన్నిక రోజు కావాలనే పోలీసు బందోబస్తు లేకుండా చేసి, చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడేలా చేశారని ఆరోపించారు.
అధికారులు, పోలీసుల సమక్షంలో, మంత్రి వివేక్ చూస్తుండగానే దళిత, గిరిజన, మహిళా కౌన్సిలర్లపై దౌర్జన్యంగా, అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. బాల్క సుమన్, కోవ లక్ష్మిలను లోపలికి పంపించకుండా కేవలం కాంగ్రెస్ మంత్రిని ఎలా పంపిస్తారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులే దాడులు చేశారంటూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బాల్క సుమన్‌ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాతన్‌పల్లి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ లో బీఆర్ఎస్ నాయకులను, కౌన్సిలర్లను పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. జనగామలో ఓటింగ్ కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్ చేతి పైకెత్తితే, వెనుక నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్లు చేతులు పట్టి లాగి బెదిరించే ప్రయత్నం చేశారని, అందులో దళిత మహిళ చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నంలో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నా ఎన్నికను అడ్డుకునే ప్రయత్నం చేశారని, అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెజారీటీ ఉన్నా గాని తాము అరాచకానికి పాల్పడలేదని వెల్లడించారు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.