అదో డొల్ల కంపెనీ..పేరు టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్.. రూ. లక్ష పెట్టుబడితో మొదలై.. ఓ గోదాములో నడుస్తున్న ఈ కంపెనీలో పట్టుమని పది మంది కూడా ఉద్యోగులు లేరు. అయితే, ఈ కంపెనీకి కారుచౌకగా భూములను కట్టబెట్టడానికి రేవంత్ ప్రభుత్వం తెగ ఉవ్విళ్లూరిపోయింది. కలెక్టర్ కార్యాలయానికి దగ్గర్లో.. బహిరంగ మార్కెట్లో రూ. 210 కోట్లకు పైగా విలువ చేసే భూములను కారుచౌకగా అంటే రూ. 7 కోట్లకే ధారాదత్తం చేసేసింది. భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తే, ఏకంగా బుల్డోజర్లతో భయపెట్టింది. ఊరూ-పేరూ లేని ఓ కంపెనీ కోసం రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇదంతా చేసింది అంటారా?ఆ కంపెనీ ఛైర్మన్ స్వయానా సీఎం రేవంత్ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి. సీఈవో ఆయన కుమారుడు నయన్రెడ్డి. అందుకే తమ్ముడి కోసం రూ. వందల కోట్ల విలువైన భూములను రేవంత్ పప్పు బెల్లంలా పంచిపెట్టారు.
(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): ‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘సీఎం స్వయానా సోదరుడైతే.. దోచుకొని.. దాచుకోవడానికి హద్దూపద్దూ ఉండదు’ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొత్త సామెత. తమ్ముడికి అయాచిత ప్రయోజనం చేకూర్చేందుకు రేవంత్ ప్రభుత్వం రైతు ల భూములను స్వాధీనం చేసుకున్నది. నేరుగా కట్టబెడితే, వివాదం చెలరేగుతుందని భావించిందో ఏమో.. ఓ ఊరూపేరూలేని కంపెనీని తెరపైకి తెచ్చింది. అలా బహిరంగ మార్కెట్లో రూ.210 కోట్లకు పైగా విలువైన భూమిని రూ.7 కోట్లకే కట్టబెట్టింది. భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటే వాళ్ల మీదకు ఏకంగా బుల్డోజర్లనే ప్రయోగించింది. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పిటిషన్ ద్వారా తీగ లాగితే, మొత్తం డొంక కదిలింది.
బయటపడింది ఇలా..
2014 నుంచి 2025 వరకూ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు కేటాయించిన భూముల వివరాలను తెలియజేయాలంటూ ఓ వ్యక్తి టీజీఐఐసీని నిరుడు ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడిగాడు. గత నెలలో సమాధానం వచ్చింది. అయితే, టీజీఐఐసీ భూములు కేటాయించిన కంపెనీల్లో ఓ కంపెనీ వివాదాస్పదంగా కనిపించింది. పైగా రాష్ట్రవ్యాప్తంగా నిరుడు సంచలనం సృష్టించిన ‘రావిర్యాల రైతులపై బుల్డోజర్’ ఘటన జరిగిన మరుసటి రోజునే సదరు కంపెనీకి కారుచౌకగా సర్కార్ ఆ భూమినే కట్టబెట్టడం అనుమానస్పదంగా మారింది. దీంతో ఆ కంపెనీ ఎవరిది? అనే విషయాలను లోతుగా విశ్లేషిస్తే, సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
కారుచౌకగా కట్టబెట్టారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఐదెకరాల(20,234.3 చదరపు మీటర్లు) భూమిని రూ.7కోట్లకు (చదరపు మీటరుకు రూ.3,707) టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించారు. ఈ మేరకు ఆర్టీఐ సమాధానంలో టీజీఐఐసీ పేర్కొన్నది. 2025 జూన్ 12వ తేదీన ఈ కేటాయింపులు జరిగినట్టు వెల్లడించింది. అయితే, రావిర్యాల గ్రామ శివార్లలో గజం భూమి ధర రూ. 86,500గా ఉన్నట్టు గత మేలో టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ కే శశాంక ఓ సమావేశంలో పేర్కొన్నారు. అంటే ఎకరం ధర రూ.41.86 కోట్లుగా ఉన్న ది. ఐదెకరాల భూమి విలువ బహిరంగ మా ర్కెట్లో రూ.210 కోట్లకు పైమాటే. అయితే, రేవంత్ ప్రభుత్వం.. టెస్సెరాక్ట్ కంపెనీకి కేవలం రూ.7 కోట్లకే కట్టబెట్టడం అనుమానాలు పెంచుతున్నది. పోనీ, ఈ కంపెనీ ఆ ప్రాంతంలో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేసి స్థానిక యువతకు వందలాది ఉద్యోగాలను ఇస్తుందా? అంటే అదీ లేదు. కారణం ఆ కంపెనీ ట్రాక్ రికార్డ్.
గోదాములో కార్యకలాపాలు
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ)కి ఇచ్చిన సమాచారం ప్రకారం.. టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మూడేండ్ల కిందట అంటే 2023 ఏప్రిల్ 11న పటాన్చెరు ప్రాంతంలో ప్రారంభమైంది. రూ. లక్ష పెయిడ్ అప్ క్యాపిటల్‌తో మొదలైన ఈ కంపెనీ తర్వాత జీడిమెట్లలోని ఓ చిన్న గోదాములో నడుస్తున్నట్టు సమాచారం. కంపెనీలో పట్టుమని పది మంది కూడా ఉద్యోగులు లేరని తెలుస్తున్నది. అయితే, ఈ కంపెనీకి చైర్మన్‌గా సీఎం రేవంత్ సోదరుడు అనుముల కొండల్‌రెడ్డి, సీఈవోగా ఆయన కుమారుడు అనుముల నయన్రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ఈ మేరకు టెస్సెరాక్ట్ కంపెనీకి తానే చైర్మన్ అంటూ కొండల్‌రెడ్డి తన అధికారిక లింక్డ్ఇన్ ఖాతాలో స్వయంగా పేర్కొన్నారు. ఏవియేష న్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన విడిభాగాలను తయారుచేస్తామంటూ టెస్సెరాక్ట్ కంపె నీ వెబ్సైట్లో పేర్కొన్నది. అయితే, క్లయింట్ల వివరాలు, వార్షిక రిపోర్టులు సహా ఆఫీసు అడ్రస్, మేనేజ్మెంట్ వివరాలు వంటివేమీ వెబ్సైట్లో పేర్కొనకపోవడం గమనార్హం. దీంతో ఇదో నకిలీ కంపెనీ అంటూ సోషల్‌మీడియాతో పాటు పలువురు గూగుల్ రివ్యూస్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డ్ కలిగిన కంపెనీకి రావిర్యాలలో రూ.210 కోట్ల విలువైన భూమిని రేవంత్ ప్రభుత్వం కట్టబెట్టడం ముమ్మాటికీ తమ్ముడు కొండల్‌రెడ్డికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రైతులపై దమనకాండ
టీజీఐఐసీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2025 జూన్ 12వ తేదీన టెస్సెరాక్ట్ కంపెనీకి రావిర్యాలలో ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ కేటాయింపులు జరుగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు.. అంటే జూన్ 11న.. రేవంత్ ప్రభుత్వం రావిర్యాల రైతులపై దమనకాండకు దిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలోని ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, పోలీసు, హౌసింగ్ బోర్డు, టీజీఐఐసీ అధికారులు మూకుమ్మడిగా రైతులపై బలప్రయోగానికి దిగారు. తాము ఎన్నో ఏండ్లుగా ఈ భూముల నే సాగు చేసుకుంటున్నామని, తమకు అన్యా యం చేయవద్దని రైతులు ఎంత మొత్తుకున్నా అవేమీ పట్టించుకోకుండా వాళ్లను ఈడ్చిపారేసింది. అడ్డొచ్చిన రైతుల మీదకు బుల్డోజర్లను ఉసిగొల్పి బెదిరింపులకు దిగింది. అయితే, తమ్ముడి కంపెనీ కోసం రేవంత్ సర్కార్ ఇదం తా చేస్తున్నదని అప్పుడు ఎవరికీ తెలియదు. టీజీఐఐసీ భూ కేటాయింపులు, రైతులపై సర్కార్ దమనకాండ పరిణామాలను విశ్లేషిస్తే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తంగా సోదరుడికి ఆర్థిక లబ్ధి చేకూర్చడానికి సీఎం రేవంత్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని తప్పదారి పట్టించారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
చైర్మన్ హోదాలో బడాయి..
టెస్సెరాక్ట్ కంపెనీ ద్వారా వందల కోట్లు దండుకోవడమే కాదు.. ఈ కంపెనీని అడ్డుపెట్టుకొని అనుముల కొండల్‌రెడ్డి బడాయికి పోతున్నట్టు సోషల్‌మీడియాలో పోస్టులను బట్టి అర్థమవుతున్నది. టెస్సెరాక్ట్ కంపెనీ రక్షణ, వైమానిక రంగంలో కీలకంగా మారిందని, ఈ కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న తాను దేశ రక్షణ, వైమానిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొండల్‌రెడ్డి తనకు తానుగా చెప్పుకొంటున్నట్టు తెలిసింది. పైగా ఈ సమాచారాన్ని యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు ఇవ్వగా.. ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో కొండల్‌రెడ్డి పేరును వాళ్లు చేర్చడం గమనార్హం. అయితే, ఊరూ-పేరూలేని ఓ కంపెనీని ఇలా ప్రముఖ కంపెనీగా చిత్రీకరించడం, తప్పుడు వివరాలు ఇవ్వడంఏమిటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

జీడిమెట్లలోని ఫేజ్-1లో ఓ గోదాంలో టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రై.లి ఆఫీస్

ఏండ్లుగా సాగుచేసుకొంటున్న తమ భూములను లాక్కోవద్దని 2025 జూన్ 11న నిరసనకు దిగిన రావిర్యాల మహిళా రైతులు

రైతులపై సర్కార్ దమనకాండను నిరసిస్తూ రైతులను పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (జూన్ 11, 2025)

టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన భూకేటాయింపులపై టీజీఐఐసీ ఇచ్చిన ఆర్టీఐ సమాధానం