ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం సిటీలో తీవ్ర దుమారం రేపుతున్నది. సిటీ ప్రజలతో పాటు బ్యాంకర్లు కూడా ఆందోళనలో పడ్డారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఇండ్లు, ప్లాట్లకు పలు బ్యాంకులు రూ.కోట్లలో లోన్లు ఇచ్చాయి. మరికొన్ని స్థలాలు, ఆస్తులను మార్ట్‌గేజి చేసుకుని లోన్లు మంజూరు చేశాయి. ఇప్పుడు బ్యాంకులు, ఫైనాన్సియల్ సంస్థలు అంతర్మథనంలో పడ్డాయి. సిటీలోని మెజారిటీ ఇండ్లు, భూములు, ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చర్చడంతో బ్యాంకర్లు తమ లోన్లు తిరిగి వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే తమ కషార్జితంతో కొనుగోలు చేసిన ఇండ్లు, స్థలాలు, నిర్మాణాలను ఉన్నపలంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తమ ఆస్తులపై హక్కులను కోల్పోయి ఆందోళనలో ఉన్న ప్రజలు వాటిపై ఉన్న లోన్లు కడతారా? అనే మీమాంసలో బ్యాంకర్లు ఉన్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : మరోవైపు తమకు హక్కేలేని ఆస్తులకు లోన్లు ఎందుకు కడతామని సిటీ ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. ఇప్పటికే పలు అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తేలడంతో వాటిపై ఉన్న లక్షలాది రూపాయాల లోన్లు ఎలా తీర్చాలనే గందరగోళంలో బాధితులున్నారు. ఈ క్రమంలో తమ లోన్లు తిరిగి రావడం కష్టమేననే ఆందోళనలో బ్యాంకర్లున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టాల పాలు కావాల్సి వస్తున్నదని భావిస్తున్నారు. అటు నిషేధిత జాబితాలోకి వెళ్లిన నిర్మాణాలు, భూముల్లో చాలావరకు బయటకు రావడం కష్టమేనని రెవెన్యూ అధికారులు చెప్తుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది.
కాగా, సిటీలోని మెజారిటీ ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. జిల్లాలోని 16 మండలాలతో పాటు శివార్లలోని బహుళ అంతస్థుల భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఈ జాబితాలో చేరాయి. మరోవైపు నిర్మాణంలో ఉన్న వేలాది భవనాలు, ఇండ్లు, ఖాళీ స్థలాలు కూడా 22ఏ జాబితాలో ఉన్నాయి. దీంతో ఆయా ఆస్తులకు రిజిస్ట్రేషన్లు గత నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ప్రతాలు అందుబాటులో లేకపోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడంలేదు. లోన్లు రాకపోవడంతో స్థలాలు, ఇండ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రజలు స్థలం, ఇండ్లు కొనుగోలు చేయాలన్నా జంకుతున్నారు. అటు ఇప్పటికే ఇచ్చిన లోన్లు రికవరీ అవుతాయో లేదోననే ఆందోళనలో బ్యాంకులు ఉన్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో సగానికి పైగా భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఇండ్లు, స్థలాలను అమ్మినవారు, కొన్నవారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాకా వెళ్లి తమ అవి నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిసి షాక్ అవుతున్నారు. రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే పైకి సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నప్పటికీ 80 శాతం ప్రాపర్టీస్‌ను వెనక్కి తీసుకురావడం కష్టమేనని అభిప్రాయ పడుతున్నారు. నిషేధిత జాబితాలో చేర్చినంత సులువుగా.. బయటకు తీయడం కాదని స్పష్టంచేస్తున్నారు. దీంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.