– – నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్
కొండామల్లేపల్లి, ఫిబ్రవరి 19 : నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి బత్తాయి సాగు ద్వారా అధిక లాభాలు ఆర్జించేందుకు, బత్తాయి సాగులో మెలకువలు, మార్కెటింగ్ విధివిధానాలు, అధ్యయనాలు, క్షేత్రస్థాయి సందర్శనలు చేయాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర అన్నారు. గురువారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయనున్న రైతు ఉత్పాదక సంస్థలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ జిల్లా బత్తాయి సాగుకు మంచి పేరు పొందిందన్నారు. అయితే కాలానుగుణంగా వివిధ కారణాల వల్ల జిల్లాలో బత్తాయి సాగు 41 వేల ఎకరాలకు పడిపోయిందన్నారు. ఇందుకు గల కారణాలను తెలుసుకోవడమే కాకుండా, బత్తాయి మార్కెటింగ్ విధానాలు ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా జిల్లాలోని బత్తాయి రైతులందరూ భూసార పరీక్షలను చేయించుకోవాలని చెప్పారు. బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంఘటితంగా రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా మార్కెటింగ్, అలాగే లాభాలు పొందేందుకు నాబార్డు సహకారం అందించేందుకు ముందుకు రావడంతో రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసుకుని వాటిని సమర్థవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. మండలాల్లో రైతులు సంఘటితంగా ముందుకు వస్తే ఎఫ్పీఓ ఏర్పాటుకు నాబార్డు పరిశీలిస్తుందన్నారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో 2011లో లక్షకు పైగా ఎకరాల్లో బత్తాయి పంటలు సాగయ్యాయని, ఇప్పుడది 41 వేల ఎకరాలకు పడిపోయిందన్నారు. మార్కెట్ సమస్యలు, దళారీల బెడద, తదితర కారణాల వల్ల బత్తాయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే మార్కెట్ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రధాన్యత ఇస్తున్నదని తెలిపారు. ఉద్యాన పరిశోధనలో భాగంగా భవిష్యత్లో బత్తాయికి ఎదురయ్యే సమస్యలపై కూడా సైంటిస్టులు దృష్టి సారించాలని కోరారు. బత్తాయిలో ఉత్తమ నిర్వహణ ఫలితాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. అధిక దిగుబడులు సాధిస్తున్న రైతులతో ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయించి శిక్షణ ఇప్పించాలని సూచించారు. లాభాలు అర్పించేందుకు రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేయడం, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కొండమల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రంలో నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని జిల్లా కలెక్టర్కు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఆర్గానిక్ ఫర్టిలైజింగ్ సర్టిఫికేషన్ డైరెక్టర్ కిరణ్ కుమార్, నాబార్డ్ సిజిఎం గణపతి, ప్రొఫెసర్ ఆరీఫ్ ఖాన్ తదితరులు మాట్లాడుతూ పలు సూచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తాయి రైతులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, పద్మారెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. బత్తాయి అమ్ముకోవడానికి ఉన్న సమస్యలను తొలగించాలని, మార్కెట్లో స్వేచ్ఛగా బత్తాయి అమ్ముకునేలా చూడాలని, బత్తాయికి ప్రత్యేకంగా సూచనలు, సలహాలు ఇచ్చేందుకు అధికారులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం వినయ్ కుమార్, ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు రాజా గౌడ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిని, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.