ShuShu Babies | పిల్లలకు మెరుగైన చదువులు అందిస్తున్నాం. చక్కని క్రీడా వసతులు కల్పిస్తున్నాం. కొనే ప్రతీ వస్తువు ‘హాని చేస్తుందా? మేలు చేస్తుందా?’ అని ఆలోచించే బేరంచేస్తున్నాం. అలాంటిది, ‘పిల్లల చర్మాన్ని కాపాడేందుకు సహజసిద్ధమైన, మెరుగైన ఉత్పత్తులు అందించలేమా?’ అనుకున్నదో తల్లి. అంతే, ‘షుషుబేబీస్’ పేరుతో నవజాత శిశువుల నుంచి పన్నెండేండ్ల పిల్లల కోసం.. ప్రకృతిసిద్ధమైన చర్మ, కేశ సంరక్షణ ఉత్పత్తులను తీసుకొచ్చారు హైదరాబాద్‌కు చెందిన సులక్షణ రెడ్డి ( Sulakshana Reddy ).
‘పిల్లల కోసం ఇప్పటికే అనేక సేంద్రియ ఉత్పత్తులు ఉన్నాయి. మళ్లీ అలాంటివే తీసుకురావడం ఎందుకు? కొనేవాళ్లు ఎంతమంది ఉంటారు?’ అంటూ స్నేహితులు వేళాకోళం చేశారు. ‘మేడమ్ ఇవి అమ్ముడవుతాయా? మా దగ్గర ఉన్నవే కస్టమర్లు కొనడం లేదు. మళ్లీ కొత్తవా? మీరు ఇంతలా అడిగారు కాబట్టి. ఓ రెండు శాంపిల్స్ ఇవ్వండి చాలు. సేల్ అయితే చూద్దాం’ అంటూ స్టోర్ మేనేజర్లు పెదవి విరిచారు. అయినా ఆమె నిరాశపడలేదు. కాళ్లు నొప్పులు పెడుతున్నా.. చంకలో బిడ్డను ఎత్తుకొని పదీపదిహేను స్టోర్లు తిరిగింది. అయినా, ఒంటరిపోరాటం సులక్షణకు కొత్త కాదు. షుషు బేబీస్ స్థాపనకు ముందు, ఒంటరిగానే వెళ్లి మార్కెట్ అధ్యయనం చేసింది. వెంటపడి అనుమతులు తెచ్చుకుంది. తయారీదారులతో మాట్లాడింది. లావాదేవీలు చూసుకుంది. తన ఉత్పత్తుల నాణ్యత ఏమిటో ప్రపంచానికి చూపింది.
సులక్షణ, శ్రావణ్ రెడ్డి దంపతులు 2017 వరకు అమెరికాలోని క్యాలిఫోర్నియాలో ఉద్యోగం చేసేవారు. బాబు పుట్టిన తర్వాత తను మళ్లీ ఉద్యోగంలో చేరింది. అయితే, నైట్షిఫ్ట్లతో చాలా ఇబ్బంది ఉండేది. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చేశారు. మూడేండ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా.. మళ్లీ నైట్‌షిఫ్టులు తప్పలేదు. బిడ్డ కోసం సమయం కేటాయించడం కుదిరేది కాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసింది సులక్షణ. అయితే.. తన కుమారుడి శరీరం చాలా సెన్సిటివ్. అమెరికాలో ఉన్నప్పుడు ఆర్గానిక్ ఉత్పత్తులే వాడేవారు. ఇక్కడికి వచ్చాక అంత నాణ్యమైనవి దొరికేవి కాదు. ఆ దుష్ప్రభావాలతో బాబుకు దద్దుర్లు వచ్చేవి. దీంతో తన బిడ్డలాంటి ఎంతోమంది చిన్నారుల కోసం.. ‘షుషు బేబీస్’ పేరుతో ఓ బ్రాండ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ముందుగా తన స్నేహితురాలైన ఆయుర్వేద వైద్యురాలిని సంప్రదించింది సులక్షణ. ఆమె సూచన మేరకు ఒంటరిగానే స్టార్టప్ ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను అధ్యయనం చేసింది. ఫార్మసీలో గోల్డ్‌మెడలిస్ట్ కాబట్టి, ఏ ఉత్పత్తుల్లో ఎలాంటి ఫార్ములాలు ఉంటాయి? ఏ కెమికల్స్ కలుపుతారు? వాడితే ఎంత ప్రమాదం? అనే విషయాలు తెలుసు. కాబట్టే ప్రకృతి సిద్ధమైన ముడిపదార్థాలను ఉపయోగించి ‘షుషు బేబీస్’ పేరుతో కొన్ని ఉత్పత్తులు తయారుచేసింది. వాటిని తనపై ప్రయోగించుకుంది. సున్నితమైన చర్మం కలిగిన కొడుకుపైనా ప్రయోగించింది. ఎలాంటి దుష్ఫలితాలూ లేకపోవడంతో.. ఆత్మీయుల పిల్లలకూ ఇచ్చింది. నూటికినూరు శాతం సురక్షితమని తేలడంతో.. క్లినికల్ ట్రయల్స్, ఆయుష్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఐదారు నెలల వ్యవధిలోనే అనుమతులు రావడంతో మరింత ఎక్కువ ఉత్పత్తి చేయడానికి సిద్ధమైపోయింది. కానీ ఓ దశలో ఆర్థిక సమస్యలు వచ్చాయి. తన సేవింగ్స్ సరిపోలేదు. దీంతో బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది.
వ్యాపారానికి మరింత మూలధనం అవసరం కావడంతో సలహా కోసం స్నేహితులను సంప్రదించారు సులక్షణ. వాళ్లే ‘వీహబ్’ గురించి చెప్పారు. ఆ ఆవరణ ఆమెకు మేనేజ్మెంట్ పాఠాలు నేర్పింది. ఒక మెంటర్‌ను కేటాయించింది. ఆన్లైన్ లావాదేవీలు, కస్టమర్ల మనస్తత్వం తదితర అంశాలు బోధించింది. తనవంతుగా దాదాపు రూ.15 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. మెంటర్స్ సలహాల మేరకు తన వ్యాపారాన్ని ఆన్లైన్కూ విస్తరించుకుంది సులక్షణ. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఫస్ట్‌క్రై, బిగ్‌బాస్కెట్, మీషో, మింత్రా, మిస్ట్రీ వంటి ఆన్లైన్ వేదికల మీద షుషు బేబీస్ ఉత్పత్తులు లభిస్తున్నాయి. వివిధ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఫిట్ డే, 24మంత్ర వంటి స్టోర్లకూ విస్తరించనుంది. తన స్టార్టప్ ద్వారా 30 మందికి ఉపాధి కల్పిస్తుందామె. వీరిలో 70శాతం మంది మహిళలే. తాజాగా జీఎస్టీ నుంచి ‘బెస్ట్ ఆంత్రప్రెన్యూర్’ అవార్డు కూడా అందుకుంది సులక్షణ రెడ్డి (www.shushubabies.com).
…✍ రవికుమార్ తోటపల్లి, 📷ఎం.గోపీకృష్ణ
“‘అందరూ హేళన చేసినా.. వీ హబ్ అండగా నిలబడింది.. నా కలను నిజం చేసింది’”