e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకుని ఏం చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఇదే నా జ‌వాబు

jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకుని ఏం చేస్తార‌నే ప్ర‌శ్న‌కు ఇదే నా జ‌వాబు

jayabharathi | ‘ రోడ్డుపై ఎవరైనా యువతి ద్విచక్ర వాహనం నడుపుతుంటే వింతగా చూడొద్దు. వెకిలి చేష్టలతో వేగాన్ని నియంత్రించొద్దు. గాయాలపాలు చేసి పైశాచికానందం పొందొద్దు. తన బతుకు తాను బతుకుతున్నట్టే, తన పరుగు తాను తీసే స్వేచ్ఛ మహిళకు ఉంది’ అంటారు హైదరాబాదీ బైక్‌ యాత్రికురాలు జయ భారతి. మహిళలకు డ్రైవింగ్‌పై అవగాహన కల్పిస్తూ.. అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 26 వరకు.. 46 రోజులపాటు 11,111 కి.మీలు ప్రయాణించి దేశంలోని 22 నగరాలు చుట్టొచ్చారామె. ‘వాహనం స్త్రీల ప్రయాణంలోనే కాదు, జీవనంలోనూ ఓ భాగమే’ అంటూ తన లక్ష్యాలను వివరించారు..

jayabharathi
jayabharathi

ఆడవాళ్లు డ్రైవింగ్‌ నేర్చుకుని ఏం చేస్తారు? అని ప్రశ్నించేవాళ్లకు నా సమాధానం ఒక్కటే.. టూ వీలర్‌, మోపెడ్‌ ఏది నడిపినా మహిళలో ఆత్మవిశ్వాసం వస్తుంది. ట్రాఫిక్‌లోనే కాదు, జీవన పద్మవ్యూహంలోనూ చొచ్చుకుపోగలమనే ధైర్యం వస్తుంది. ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అందుకే, మా సంస్థ ద్వారా ఇప్పటివరకు 1,500 మందికి డ్రైవింగ్‌ నేర్పాం. ఇందులో స్వయం సహాయక బృందాల సభ్యులు, కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగినులు ఉన్నారు. బండి నేర్చుకున్నాక వాళ్ల జీవితాలు మారాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు చక్కబెడుతున్నారు. వ్యాపారాలు విస్తరిస్తున్నారు. ఆదాయం రెట్టింపు చేసుకొంటున్నారు. ఈ మార్పు హైదరాబాద్‌కే పరిమితం కావొద్దని నా ఆలోచన. ఇతర రాష్ర్టాల్లో కూడా మహిళలకు డ్రైవింగ్‌ నేర్పే సంస్థలు ఉన్నాయి. వాటిని కలుపుకొని వెళ్లే ఉద్దేశంతో బైక్‌ మీద దేశమంతా తిరిగాను.

jayabharathi

వివక్ష వద్దు

- Advertisement -

నిజానికి, డ్రైవింగ్‌ పెద్ద కష్టమైన పనేం కాదు. కాకపోతే మహిళల దగ్గరికి వచ్చేసరికి అందరూ నిరుత్సాహ పరుస్తారు. ఈ పరిమితులను అధిగమించాలనే, 2019లో మూవింగ్‌ ఉమెన్‌ సోషల్‌ ఇనీషియేటివ్స్‌ ఫౌండేషన్‌ స్థాపించాను. గృహిణులకు, విద్యార్థినులకు డ్రైవింగ్‌ పట్ల అవగాహన కల్పించేందుకు ‘మూవింగ్‌ బౌండరీస్‌’ పేరుతో భారత్‌తో పాటు వియత్నాం, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కంబోడియా, అమెరికాలలోనూ లక్ష కిలోమీటర్లకు పైగా బైక్‌ నడిపాను. బండి విషయంలో వివక్ష వద్దు. వాహనాన్ని కనిపెట్టిన వాళ్లు కానీ, తయారుచేసే కంపెనీలు కానీ అమ్మాయిలు నడపొద్దని ఎక్కడా చెప్పలేదు. మనది పురుషాధిక్య సమాజం కాబట్టి, పురుషులే ఎక్కువగా నడుపుతారు కాబట్టి బండి మగవాళ్ల సొత్తనే అభిప్రాయం ఏర్పడింది. శిక్షణ లేకపోవడం వల్లే స్త్రీలు ధైర్యంగా నడపలేక పోతున్నారు. టూ వీలర్‌తో మొదలుపెడితే ఆటో, కారు కూడా అలవాటు అవుతాయి.

jayabharathi

మనసును కదిలించారు…

ఇండియాలో ఇప్పటివరకు చాలా పర్యటనలు చేశాను. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ బైక్‌పై వెళ్లొచ్చాను. అన్నిటిలోకి 11,111 కిలోమీటర్ల యాత్ర ఎంతో ప్రత్యేకం. వెళ్లిన ప్రతిచోటా స్త్రీలకు డ్రైవింగ్‌ ప్రాధాన్యం వివరించాను. చెన్నైలో మేం నిర్వహించిన వర్క్‌షాప్‌కు 200 మంది మహిళా ఆటోడ్రైవర్లు వచ్చారు. చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఏదైనా సమస్య వచ్చినా, మధ్యలో ఆటో ఆగిపోయినా వాట్సాప్‌ గ్రూప్‌లో మెసేజ్‌ పెడతారట. దగ్గర్లో ఉన్న ఎవరో ఒక మహిళా ఆటో డ్రైవర్‌ క్షణాల్లో అక్కడ వాలిపోతారట. ఆ ఐకమత్యం చూసి ముచ్చటేసింది. కొవిడ్‌ సమయంలో ఆటోలు నడిపే వీలులేక, అంబులెన్స్‌ నడిపినవారూ ఉన్నారు. రాంచీలో 2013 నుంచే మహిళలు ఆటోలు నడుపుతున్నారు. రీనా అనే ఆటో డ్రైవర్‌కు భర్త లేడు. ఆటో నడుపుతూనే ఇద్దరు చిన్న పిల్లలను పోషించుకుంటున్నది. ప్రయాణికులు లేనప్పుడు వెనుక సీట్లో పిల్లలను పడుకోబెట్టి.. ప్రయాణికులు ఉన్నప్పుడు నడుముకు కట్టుకొని రెండేండ్ల పాటు నడిపింది. ఆమె మాటలు వింటుంటే నా కండ్లలో నీళ్లు తిరిగాయి.

jayabharathi

తెలంగాణ ప్రత్యేకం..

హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మోటర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. మేం దానికి ట్రాక్‌ డిజైన్‌ చేశాం. కూకట్‌పల్లి స్కిల్‌ సెంటర్‌ (మహిళ ప్రాంగణం)లో ఇది రూపుదిద్దుకుంటున్నది. ఇక్కడికి వచ్చే మహిళలు అన్ని నైపుణ్యాలతో పాటు డ్రైవింగ్‌ కూడా నేర్చుకుంటారు. మరే రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేదు. వెళ్లిన ప్రతి చోటా ఈ విషయాన్ని చెప్పాను. తెలంగాణలో ఇలా చేస్తున్నారు. మీ దగ్గరా ఇలాంటిది ప్రారంభిస్తే బాగుంటుందని వివరించాను. 2030 నాటికి కనీసం 10 లక్షల మంది మహిళల్లో డ్రైవింగ్‌ చైతన్యం తీసుకురావాలన్నదే నా లక్ష్యం.

jayabharathi

నా బైక్‌ యాత్రలో.. వందలమందితో మాట్లాడాను. చాలా మందికి డ్రైవింగ్‌ పట్ల ఆసక్తి ఉంది. కానీ నేర్పే వాళ్లే లేరు. అందుకే మేం ఒక వాట్సాప్‌ చాట్‌బోర్డ్‌ను ప్రారంభించాం. బైక్‌, ఆటో, ట్యాక్సీ నడపడం నేర్చుకొని.. డ్రైవింగ్‌లో ఉపాధి పొందాలనుకునే మహిళలు +918885916606 ఫోన్‌ నెంబర్‌కు ‘హాయ్‌’ అని మెసేజ్‌ పంపితే చాలు. దగ్గర్లో ఉన్న మా భాగస్వామ్య సంస్థలతో శిక్షణ ఇప్పిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.

…? గుళ్లపెల్లి సిద్ధార్థ గౌడ్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

ఇంట్లో చెప్ప‌కుండానే న‌టించా.. సినిమా విడుద‌ల‌య్యాక నాన్న‌కు తెలిసి..

ఎక్క‌డ మైక్ పెట్టినా హలో హలో మైక్‌ టెస్టింగ్‌ అంటుండె.. అది చూసి పాట పాడిస్తుండె

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

custard apple | సీతాఫ‌లాల‌తో ఐస్‌క్రీమ్‌లు త‌యారు చేస్తున్న పాల‌మూరు మ‌హిళ‌లు..

jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement