చలికాలం మొదలైంది. వాతావరణంలో మార్పులతో వైరల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ఆహారం, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా, సీజనల్ పండ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోవడం మంచిది.
చలికాలంలో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి. కాలానుగుణంగా కాసే ఉసిరితో ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఇక ఒంట్లో వేడిని పెంచడంలో మిరియాలు ముందుంటాయి. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం ద్వారా.. పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉసిరిలో విటమిన్ ఎ, సి, ఇతోపాటు ఐరన్, క్యాల్షియం, ఫైబర్, వివిధ రకాల యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మిరియాల్లోనూ విటమిన్ ఎ, కె, ఇ, బి1, బి2, బి5, బి6, కాపర్, మాంగనీస్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం, జింక్, క్రోమియం వంటి క్రియాశీల సమ్మేళనాలు అనేకం ఉంటాయి. ఈ రెండూ కలిస్తే.. శక్తిమంతమైన ఔషధం తయారవుతుంది.
చలికాలంలో ఎదురయ్యే సాధారణ సమస్య.. జలుబు. దీనికి ఉసిరి, మిరియాలకు మించిన ఇంటి ఔషధం లేదు. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే.. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరిలోని విటమిన్ సి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. మిరియాలు శరీరానికి అంతర్గతంగా వెచ్చదానాన్ని అందిస్తాయి. శ్లేష్మం పేరుకుపోకుండా నివారిస్తాయి.
ఉసిరి, మిరియాలలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్ లక్షణాలు పుష్కలం. చలికాలం ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో ఇవి ముందుంటాయి. శ్వాసకోశ వ్యవస్థను శుభ్రం చేయడంతోపాటు వివిధ రకాల ఫ్లూ జ్వరాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనిని శరీరం పూర్తిగా శోషించుకోవడానికి, మిరియాలలోని పైపెరిన్ సాయపడుతుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యంలో ఉసిరి కీలకంగా ఉంటుంది. దాన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే.. ఆయా ప్రయోజనాలు రెట్టింపవుతాయి. వీటిలోని విటమిన్ సి.. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. జుట్టుకు కావాల్సిన పోషణ అంది.. బలంగా తయారవుతుంది.
ఈ రెండిటినీ కలిపి తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థ, కాలేయం ఆరోగ్యానికి ఉసిరి, మిరియాలు రెండూ భరోసా ఇస్తాయి. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సాయపడతాయి. జీర్ణక్రియనూ మెరుగుపరుస్తాయి.