అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, ధూమపానం.. గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలని తెలిసిందే! కానీ, నోటి బ్యాక్టీరియా కూడా హృద్రోగాలకు కారణం అవుతుందని తాజా అధ్యయనం కనుగొన్నది. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ప్రచురితమైన ఫిన్లాండ్, ఇంగ్లండ్ పరిశోధకులు నిర్వహించిన సర్వే.. నోటి శుభ్రతకు- గుండెపోటుకు లంకె ఉన్నట్లు వెల్లడించింది.
బ్రషింగ్, ఫ్లాసింగ్కు గుండె ఆరోగ్యానికి సంబంధం లేదని ఇన్నాళ్లూ అనుకునేవారు. కానీ, నోటి పరిశుభ్రత.. హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. నోటిలో సాధారణంగా కనిపించే ఓరల్ విరిడాన్స్ స్ట్రెప్టోకోకి – అథెరోస్లెరోసిన్ అనే బ్యాక్టీరియా.. గుండెపోటుకు కారణమవ్వొచ్చని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా.. అకస్మాత్తుగా మరణించిన 121 మంది వ్యక్తుల కరోనరీ ప్లేక్స్, 96 మంది వాస్కులర్ సర్జరీ రోగుల ధమని నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆశ్చర్యకరంగా.. దాదాపు సగం కేసులలో బ్యాక్టీరియల్ డీఎన్ఏను కనుగొన్నట్లు వెల్లడించారు. సదరు బ్యాక్టీరియా ధమనుల లోపల ప్రవర్తించే విధానంలోనే గుండెపోటు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. ఈ బ్యాక్టీరియా ధమనుల లోపలి భాగానికి అంటుకొని బయోఫిల్మ్గా పిలిచే కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి. దీర్ఘకాలంలో ధమనుల్లో రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తాయి.
ధమనులు, రక్త నాళాలలో కొలెస్ట్రాల్‌తోపాటు బ్యాక్టీరియా బయోఫిల్మ్‌లు కూడా గుండెకు చేటు చేస్తాయి. ఈ జెల్లీ లాంటి నిర్మాణాలు, అందులో బ్యాక్టీరియా.. రోగనిరోధక వ్యవస్థతోపాటు యాంటి బయాటిక్స్ నుంచి కూడా తప్పించుకొని జీవిస్తుంటాయి. ఎలాంటి పరీక్షల్లో బయట పడకుండా.. దశాబ్దాలపాటు తిష్టవేసి ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక ఒత్తిడికి గురైనప్పుడు.. ఆ బ్యాక్టీరియా తిరిగి మేల్కొంటుంది. దాంతో వచ్చే ఇన్ఫ్లమేషన్.. ధమనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా ధమనుల్లో రక్తం గడ్డకట్టడం, గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది. గుండెపోటులో సూక్ష్మజీవుల ప్రమేయం గురించి గతంలోనే చర్చకు వచ్చినప్పటికీ.. ఇప్పటివరకూ పరిశోధనల్లో నమ్మదగిన సాక్ష్యాలతో బయటపడలేదని అధ్యయనకారులు చెబుతున్నారు. ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా.. నోటి అపరిశుభ్రతతో తలెత్తే గుండెపోటు ప్రమాదాలను ముందుగా పసిగట్టే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఈ బయోఫిల్మ్‌లను తనిఖీ చేసే పరీక్షలు, చికిత్స ద్వారా మరణాలు తగ్గించే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.