ఇమ్యూనిటీకి బూస్ట్ ఇద్దామా!
హాహా...చ్! రోజుకు ఒక్కసారన్నా ఇది వినకుండా బండి సాగదు వానాకాలంలో. ఆ శబ్దం అవతలి వాళ్లదా, మనదేనా అన్నది అప్రస్తుతం. అసలు ప్రస్తుతమేంటీ అంటే... ఎవరితో మాట్లాడినా బుర్రకథలా వినిపించే జ్వరాల సంగతులు.
హాహా…చ్! రోజుకు ఒక్కసారన్నా ఇది వినకుండా బండి సాగదు వానాకాలంలో. ఆ శబ్దం అవతలి వాళ్లదా, మనదేనా అన్నది అప్రస్తుతం. అసలు ప్రస్తుతమేంటీ అంటే… ఎవరితో మాట్లాడినా బుర్రకథలా వినిపించే జ్వరాల సంగతులు. ఇవేం సంగీతంలో సంగతుల్లా ఆహ్లాదంగా ఉండకపోయినా.. ఈ కాలాన్ని బట్టి వినక తప్పదు. మాత్ర, టానిక్, పథ్యం, పండ్లు, వేడి నీళ్లు.. ఇవే ఈ కాలపు ట్రెండింగ్ పాస్వర్డ్లు. అలాగని, వానను చూసి ఇంట్లోనే తల మీద దుప్పటి కప్పుకొని కూర్చోవడం అందరికీ సాధ్యమయ్యే పనీకాదు. అందుకే రోగనిరోధక శక్తికి పదును పెట్టాలి. వ్యాధుల కాలాన్ని ధైర్యంగా దాటాలి. మరి దాని కోసం శరీరాన్ని ఎలా సన్నద్ధం చేసుకోవాలి.. అసలేం తినాలి.. ఎలా ఉండాలి!!
రోగనిరోధకశక్తి అంటే మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ. అచ్చం బార్డర్లో సైనికుడిలా. వ్యాధికార క్రిముల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడంతో పాటు వచ్చిన వాటితోనూ పోరాడతాయీ కణాలు. అవి బలహీనపడితే మనం జబ్బుల బారిన పడతాం. కాబట్టి ఇమ్యూనిటీకి బలాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడు బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవులతో పాటు ఈ కాలంలో నీళ్ల ద్వారా వ్యాప్తి చెందే అనేక జబ్బుల నుంచి రక్షణ పొందొచ్చు. అదెలాగో చూద్దాం…
రెండు రకాలు
సహజంగా ఇమ్యూనిటీ అనేది రెండు రకాలు. మొదటిది సహజ ఇమ్యూనిటీ. ఇది మనం తల్లి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడే ఉంటుంది. సహజంగా మనకు ఎదురుపడే రకరకాల సూక్ష్మ జీవులతో పోరాడేందుకు ఇది తోడ్పడుతుంది. ఎన్నో రకాల జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది. రెండోది అక్వైర్డ్ ఇమ్యూనిటీ… అంటే ఆర్జిత రోగనిరోధకత. దీన్ని మన శరీరం సంపాదించుకుంటుందన్నమాట! ఉదాహరణకు ఒకసారి ఆటలమ్మ పోస్తే అది మళ్లీ రాదు. అంటే శరీరంలో దానికి సంబంధించిన యాంటీబాడీలు తయారై ఉంటాయి.
రకరకాల వ్యాధులు రాకుండా వేసే టీకాలు కూడా ఈ కోవలోవే. ఇక, వానాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియాల్లాంటి సూక్ష్మజీవుల వృద్ధికి ఇది అనుకూల సమయం. అవి మన రోగనిరోధక వ్యవస్థ మీద దాడి చేసినా ప్రతిఘటించేందుకు సిద్ధంగా మన శరీరాన్ని సన్నద్ధం చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.
నిద్ర
ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మొట్టమొదటి దారి నిద్ర. మనం పడుకున్నప్పుడు శరీరంలో లక్షల కణాలు పునరుత్పత్తి అవుతుంటాయి. అలాగే రోజంతా పోరాడిన రోగనిరోధక వ్యవస్థ ఈ సమయంలోనే రిపేర్ అవుతుంది. మరుసటి రోజుకి అది సన్నద్ధమయ్యే సమయం ఇదే. కాబట్టి 7 నుంచి 8 గంటల చక్కటి నిద్ర శరీరానికి అత్యవసరం.
వ్యాయామం
మన శరీరానికి వ్యాయామం చాలా అవసరం. దాని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అప్పుడు దానితో పాటు రోగనిరోధక కణాలు శరీరమంతా చక్కగా ప్రయాణించగలుగుతాయి. అందువల్ల నడక, పరిగెత్తడం లేదా ఇతర ఏవైనా చిన్నా పెద్దా వ్యాయామాలు చేయడం అన్నది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన మార్గాలు.
పరిశుభ్రత
రోగనిరోధక శక్తి వృద్ధిలో పరిశుభ్రత చాలా ముఖ్యం. చుట్టూ చెమ్మ, మురికి ఉండే వానాకాలంలో దీన్ని పాటించడం ఎంతో అవసరం. అందుకే తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అన్నం తినడానికి ముందు, ఏవైనా అపరిశుభ్రమైనవి తాకినప్పుడు…ఇలా. ఇక, చర్మం నుంచి కూడా వైరస్ లోపలికి వెళ్లొచ్చు. అంటే మనం ఒకదాన్ని పట్టుకొని తర్వాత ఆ చేతిని నోటికి తగిలించినా అవి లోపలికి వెళతాయనే విషయాన్నీ గమనించుకోవాలి.
ఒత్తిడి
స్ట్రెస్ ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దానివల్ల రోగనిరోధక కణాల పనితీరు తగ్గుతుంది. కాబట్టి దాన్ని నియంత్రించడానికి ప్రాణాయామం, ధ్యానంలాంటివి చేయాలి.
ఆహారం
ఇమ్యూనిటీని పెంచేందుకు ఆహారంలో కొన్ని సుగుణాలు చాలా ప్రధానం. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్… అంటే యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ గుణాలు ఉన్న ఆహారం ఇందుకు అవసరం. వెల్లుల్లిలో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అల్లం, పసుపుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కాక మరికొన్ని లక్షణాలున్న ఆహారాలూ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరం.
యాంటీ ఇన్ఫ్లమేటరీ
పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్కలాంటివి రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. టీలు, లేదా కూరలు లేదా ఇతర ఆహారంలోనైనా వీటిని జత చేసుకోవాలి. ఈ ఆహారాలకు యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అంటే సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
విటమిన్- సి, జింక్
తాజా పండ్లలో విటమిన్-సి, జింక్ బాగా దొరుకుతాయి. నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు, ఉసిరి, జామ, దానిమ్మలు ఇందులో ప్రధానంగా చెప్పొచ్చు. ఇవి తెల్ల రక్తకణాల తయారీకి సహకరిస్తాయి. ఆ కణాలు బయటి నుంచి వచ్చే సూక్ష్మ జీవులతో పోరాడతాయి. అవిసె, గుమ్మడిలాంటి గింజలన్నింటిలోనూ ఇవి పుష్కలంగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ భద్రం
రోగనిరోధక వ్యవస్థకు చెందిన 70 శాతం కణాలు పొట్ట భాగంలోనే ఉంటాయి. అందుకే జీర్ణవ్యవస్థను భద్రంగా చూసుకోవాలి. అక్కడి మంచి బ్యాక్టీరియాకు బలాన్నిచ్చేలా పులిసిన ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, చద్దన్నంలాంటివి తీసుకోవచ్చు.
నీళ్లు
శరీరానికి నీరు ఎంత బాగా అందితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఈ కాలంలో తప్పకుండా శుద్ధి చేసిన నీళ్లే తాగాలి. ఫిల్టర్ నీళ్లు, లేదా కాచి చల్లార్చిన నీళ్లను ఇందుకోసం ఎంచుకోవాలి. పండ్ల ద్వారా కూడా కొంత నీరు అందుతుంది. సూప్స్లాగానూ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వెచ్చగా ఉండే ఆహారం తినడం ముఖ్యం. దాని వల్ల గాలి, నీళ్ల ద్వారా గొంతు భాగంలో పేరుకుపోయిన సూక్ష్మ జీవులు చనిపోతాయి. అందుకే టమాటా, దాల్, మిక్స్డ్ వెజిటబుల్లాంటి సూప్‌లతో పాటు నాన్ వెజిటేరియన్లయితే బోన్ సూప్లాంటివీ తీసుకోవచ్చు.
ఏం తినకూడదు
- ఈ సమయంలో ఏ ఆహారాన్నైనా ఉడికించి తీశాకే తినాలి. కూరగాయల సలాడ్లు పచ్చివి తినకూడదు. వాటిల్లో తొందరగా సూక్ష్మ జీవులు చేరతాయి. కాబట్టి కొద్దిగా అయినా ఆవిరి మీదో లేదా నీళ్లలో అయినా ఉడికించుకోవాలి.
- పండ్లు అయితే తరిగిన వెంటనే తినాలి. బయట దొరికే పండ్ల ముక్కలు అస్సలు తినకూడదు. వాటి వల్ల టైఫాయిడ్‌లాంటి వాటర్ బోర్న్ బ్యాక్టీరియాకు సంబంధించిన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
- ఆకు కూరలు బాగా కడిగి తినాలి. శుభ్రంగా కడిగిన తర్వాతే తరగాలి. అంతేకానీ తరిగిన తర్వాత కడగొద్దు. అంతేకాదు వానాకాలంలో ఆకుకూరలు కాస్త తక్కువగా తినాలి. ఆ మొక్కలు ఎత్తు తక్కువగా ఉంటాయి కనుక బురద, వాన నీళ్లు దాని గుండా వెళుతుంటాయి.
- చేపలు, రొయ్యల్లాంటి సీ ఫుడ్ తక్కువగా తింటే మంచిది. అవి కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రోజులో ఏం తినాలి
- లేవగానే కొంచెం వేడి నీళ్లల్లో పసుపు వేసుకునో లేదా హెర్బల్ టీలాంటివో తాగాలి. పసుపు పాలు తాగినా మంచిదే.
- రెండు మూడు నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్స్ తినాలి.
- తొమ్మిది గంటలకు ఇడ్లీ, దోశ లాంటివి తినాలి. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఉడికించిన పల్లీలు, పెసర్లు, శనగల్లాంటివి జతగా తీసుకోవచ్చు.
- 11 గంటలకు రోజూ ఒక పండు తినాలి. దానిమ్మ, యాపిల్, జామ, నారింజ.. ఇలా ఏదైనా సరే.
- మధ్యాహ్నం రొట్టెలు, రైస్, బ్రౌన్ రైస్, పప్పు, ఏదైనా కూర, పెరుగన్నం లేదా మజ్జిగ (ఇందులో జీలకర్ర కలుపుకొని తాగితే అరుగుదలకి, జీర్ణాశయ ఆరోగ్యానికి సాయపడుతుంది)
- సాయంత్రం గుగ్గిళ్లు, ఫూల్ మఖానాలాంటివి తినొచ్చు. ఉడికించిన కూరల్లో అల్లం తురుము వేసి కూడా తీసుకోవచ్చు.
- రాత్రికి చపాతీ కూర లేదా టీ స్పూన్ నెయ్యితో కిచిడీ, కాదంటే టమాటా సూప్ తీసుకోవచ్చు. అయితే త్వరగా భోజనం ముగించాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
2వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు
ఓట్ల తొలగింపు దరఖాస్తులపై పరిమితులు.. ఫామ్-7 దుర్వినియోగం నేపథ్యంలో ఈసీ నిర్ణయం
విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎంపీపై జేఎన్‌యూ వేటు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

