మగవారితో పోలిస్తే.. మహిళా ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అటు ఇంటిని-ఇటు ఉద్యోగాన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా వాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందులోనూ, 35 ఏళ్లు దాటిన ఉద్యోగినుల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వయసులోనే వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలు పెరుగుతాయి. ఈ క్రమంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బిజీ జీవనశైలికి తగ్గట్టుగా ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
పరీక్షలు తప్పనిసరి: క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయులు, షుగర్ లాంటి సమస్యలను పర్యవేక్షించుకోవాలి. మామోగ్రామ్, పాప్ స్మియర్ సహా.. సిఫారసు చేసిన స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. కుటుంబ వైద్య చరిత్రను తెలుసుకోవడం వల్ల.. వంశపారంపర్య సమస్యలు వచ్చే ప్రమాదాలను ముందుగానే పసిగట్టొచ్చు.
ఆచితూచి ఆహారం: ఇంతకుముందులా కాకుండా.. ఆహారాన్ని ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, ఉప్పును పరిమితం చేయాలి. ముఖ్యంగా, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత క్యాల్షియం, విటమిన్ డి తీసుకోవడం చాలా కీలకం. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలు, టీలను తగ్గించాలి.
నిత్య వ్యాయామం: శారీరక వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాలకు తగ్గకుండా చిన్నచిన్న ఎక్సర్సైజ్లు చేయాలి. బరువును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి.. నడక, సైక్లింగ్, ఈత లాంటివి ఎంచుకోవాలి.
కంటినిండా నిద్ర: ప్రతిరోజూ 7-8 గంటలపాటు కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్ర నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి నిద్రవేళల సమయాన్ని పాటించాలి. ‘స్క్రీన్ టైమ్’ను తగ్గించాలి.
ఒత్తిడికి చెక్: శారీరక ఆరోగ్యంతోపాటు మానసికంగానూ దృఢంగా ఉండటం కూడా ముఖ్యమనే సంగతి గుర్తించాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లాంటి మైండ్ఫుల్నెస్ అభ్యాసాలను ఆశ్రయించాలి. ప్రకృతిలో విహరించాలి. ఒత్తిడి మరీ ఎక్కువైతే.. కౌన్సెలింగ్ తీసుకోవడానికీ వెనుకాడొద్దు.